సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యం

– కన్నీళ్లు కావాలంటే బీఆర్‌ఎస్‌కు.. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి
– నవీన్‌ యాదవ్‌ను ఆశీర్వదించండి
– నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి
– బోరబండలో మంత్రి సీతక్క విస్తృత ప్రచారం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 24: పేదలకు సంక్షేమం అందాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యం అని, కన్నీళ్లు కావాలంటే బీఆర్‌ఎస్‌కు.. ఇల్లు కావాలంటే కాంగ్రెస్‌కు ఓటెయ్యండి అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మూడు పర్యాయాలు బీఆర్‌ఎస్‌ను గెలిపించారు.. జూబ్లీహిల్స్‌లో కనీసం మంచినీళ్లు లేవు.. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు అని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ తరపున నియోజకవర్గంలోని బోరబండ సైట్‌-3 స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో శుక్రవారం ఆమె ప్రసంగించారు. ఇపుడు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్నారు.. నవీన్‌ ఎమ్మెల్యేగా గెలిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి.. ఆయనకు ఒక అవకాశం ఇవ్వండి అని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం.. ఇండ్లు లేని 4.5 లక్షల మంది పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం.. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నాం అని వివరించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో పదేళ్లలో రేషన్‌ కార్డు ఇవ్వలేదంటూ తాము ఒక్క జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోనే 15 వేల కుటుంబాలకు రేషన్‌ కార్డులు ఇచ్చామని ఆమె తెలిపారు. ఒక్క ఈ నియోజకవర్గంలోనే రూ.150 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని, ఇందిరమ్మ కాలం నుంచి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే.. భవిష్యత్తులో కూడా అభివృద్ధి చేసేది కాంగ్రెస్సే.. చేయి గుర్తుకు ఓటేసి నవీన్‌ యాదవ్‌ను గెలిపించండి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోండి అని సీతక్క విజ్ఞప్తి చేశారు.

నవీన్‌ మీద బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌, కేటీఆర్‌లు తప్పుడు కూతలు 

న‌వీన్‌పై బీఆర్ఎస్‌, కేసీఆర్‌, కేటీఆర్ త‌ప్పుడు కూత‌లు కూస్తున్నారు.. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌ ప్రచార రథం ఇస్తేనే కేసీఆర్‌ పార్టీ పెట్టారు.. తొలినాళ్లలో టీఆర్‌ఎస్‌ ప్రచారానికి నవీన్‌ కుటుంబ డబ్బులు వాడుకున్నారు.. ఇప్పుడు ఆయనపైనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటూ అన్నం పెట్టిన చెయ్యికి సున్నం పెట్టడం కేసీఆర్‌ కుటుంబ నైజం అని ఎద్దేవా చేశారు. నాడు చిన్న శ్రీశైలం యాదవ్‌ కుటుంబాన్ని వాడుకొని ఇప్పుడు విమర్శలు చేస్తే ప్రజలు క్షమించరని అన్నారు. రౌడీ షీటర్లు, బాలికలను వేధించిన, చిన్న పిల్లలను ఇబ్బంది పెట్టిన వ్యక్తులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు.. రౌడీ షీటర్లకు స్వయంగా కేటీఆర్‌ దండేసి దండం పెట్టి కాళ్లు మొక్కుతున్నారు.. అలాంటిది చిన్న శ్రీశైలం యాదవ్‌ కుటుంబంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారు.. సెంటిమెంట్‌ కాదు.. డెవలప్‌మెంట్‌ కావాలి.. ఈ గల్లీలో పుట్టి పెరిగిన నవీన్‌్‌ను గెలిపించండి.. ఆయన గెలుపుతోనే మన వీధుల్లో, బస్తీల్లో అభివృద్ధి సాధ్యపడుతుంది అని చెప్పారు.

సీతక్క ఇంటింటి ప్రచారం

మంత్రి సీతక్క బోరబండలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం బోరబండలోని వీకర్‌ సెక్షన్‌లో ఇంటింటి ప్రచారం చేశారు. తమ అభ్యర్థి నవీన్‌కు ఒక అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్పొరేషన్‌ చైర్మన్లు మువ్వ విజయ్‌ కుమార్‌, బండ్రు శోభారాణిలతో కలసి ప్రచారం కొనసాగించారు. ప్రచారంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చేయి గుర్తుకు ఓటేసి నవీన్‌ యాదవ్‌ని గెలిపించాలని ఓటర్లకు మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్‌ను గెలిపిస్తే ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. పలువురు ఓటర్లు మంత్రి సీతక్కకు హారతి ఇచ్చి తమ ఇళ్లల్లోకి ఆహ్వానించి అభిమానాన్ని చాటుకున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page