కర్ణాటక పవర్ కార్పొరేషన్‌కు సింగరేణి బొగ్గు

– రాష్ట్ర ఇంధన శాఖ మంత్రితో డిప్యూటీ సీఎం భట్టి చర్చలు

బెంగళూరు, ఆగస్టు 27 : కర్ణాటక రాష్ట్రానికి చెందిన జెన్‌కోకు ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో ఉన్న బొగ్గు బ్లాక్ మైనింగ్‌లో సింగరేణి అనుభవాన్ని వినియోగించుకోవాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక ఇంధన శాఖ మంత్రి జార్జ్‌కు ప్రతిపాదించారు. మైనింగ్‌లో కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, సింగరేణి సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ముందుకు వెళ్దామని భట్టి విక్రమార్క చేసిన ప్రతిపాదనపై కర్ణాటక ఇంధన శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బెంగళూరులో కర్ణాటక ఇంధన శాఖ మంత్రి జార్జ్‌తో గురువారం సమావేశం అయ్యారు. ఇప్పటికే ఉన్న ఇంధన సరఫరా ఒప్పందంలో భాగంగా సింగరేణి బొగ్గు సరఫరాపై ఇరు రాష్ట్రాల మంత్రులు చర్చించారు. ఇంధన రంగంలో కర్ణాటక జెన్కోకు ఉన్న అనుభవాన్ని సింగరేణి సంస్థ తన భవిష్యత్తు ప్రాజెక్టులలో ఉపయోగించుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. ప్రస్తుతం కర్ణాటకతో సింగరేణికి ఉన్న బొగ్గు సరఫరా ఒప్పందాలపై, బొగ్గు సరఫరా సరళిపై ఇరు రాష్ట్రాల మంత్రులు సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి కూడా నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయాలని భట్టి విక్రమార్కను కర్ణాటక మంత్రి జార్జ్ కోరగా కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు రోజుకు నాలుగు బొగ్గు రేకులను సరఫరా చేయాల్సిందిగా సింగరేణి అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు కర్ణాటక విద్యుత్ అవసరాల కోసం ఒడిషా రాష్ట్రంలోని నైనీ బొగ్గు గని నుంచి ఏడాదికి ఒక మిలియన్ టన్ను బొగ్గును అందించేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు సింగరేణి అధికారులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా ఆయన ఈ విషయాన్ని కర్ణాటక ఇంధన శాఖ మంత్రికి తెలిపారు. సమావేశం అనంతరం సింగరేణి వేలంలో దక్కించుకున్న కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలుకా లింగదహళ్ళి గ్రామంలో బంగారం, రాగి ఖనిజ బ్లాకును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సింగరేణి అధికారులతో కలిసి పరిశీలించారు. ఖనిజ అన్వేషణ విషయంలో స్థానిక అధికార యంత్రాంగంతో సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. డిప్యూటీ సీఎం వెంట సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *