– గవర్నర్ కార్యదర్శికి రాజీనామా లేఖ అందచేత
– అధిష్ఠానం ఆదేశాల మేరకు వైదొలగుతున్నట్లు ప్రకటన
– జాతీయ రాజకీయాలకు వెళ్లే ఆలోచన లేదని వెల్లడి
బెంగళూరు,మే 28: కొంతకాలంగా ఊహాగానాలతో సాగిన రాజకీయాలు మలుపు తిరిగాయి. కర్ణాటకలో సిద్దరామయ్య ప్రస్థానం ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. గురువారం మధ్యాహ్నం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన లోక్‌భవన్‌కు వెళ్లారు. అయితే, ఆ సమయంలో గవర్నర్ థావర్ చంద్ గహ్లోత్ అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యదర్శికి సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ విషయాన్ని గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి సైతం ధ్రువీకరించారు. సీఎం రాజీనామా లేఖను తీసుకున్నామని, గవర్నర్ తిరిగొచ్చాక దీనిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. గహ్లోత్ ఈ సాయంత్రం బెంగళూరు చేరుకోనున్నారు. అనంతరం మంత్రులు డీకే శివకుమార్, పరమేశ్వరతో కలిసి సిద్ధరామయ్య డియాతో మాట్లాడారు. అధిష్ఠానం సూచనలతో సీఎం పదవికి రాజీనామా చేశా. హైకమాండ్ ఆదేశాలకు అందరం కట్టుబడి ఉంటాం. రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైదొలిగా. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశా. దాన్ని గవర్నర్ ఆమోదిస్తారనే విశ్వాసం ఉంది. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉంది. రాజ్యాంగబద్ధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వ నిర్వహణలో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. సీఎంగా నాకు అవకాశమిచ్చిన సోనియా, రాహుల్, ఖర్గేకు కృతజ్ఞతలు. 7 కోట్ల మంది కర్ణాటక ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. రాజ్యాంగమే మా ధర్మం. ప్రజలే మాకు దేవుళ్లు అని సిద్ధరామయ్య తెలిపారు. జాతీయ రాజకీయాల్లోకి రావాలని హైకమాండ్ అడిగింది. రాజ్యసభ సీటు ఆఫర్ చేసింది. కానీ, నేను సున్నితంగా తిరస్కరించా. జాతీయ స్థాయి రాజకీయాలపై నాకు ఆసక్తి లేదు. అయితే, రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదు. ప్రజలు నన్ను 5 ఏళ్ల కాలానికి ఎన్నుకున్నారు. ఇంకా రెండేళ్లు మిగిలి ఉన్నాయి. అప్పటివరకు ఎమ్మెల్యేగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని, పదవీకాలాన్ని గుర్తుచేసుకుంటూ సిద్ధరామయ్య ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. నేను పొరపాటున రాజకీయాల్లోకి వచ్చా. మా కుటుంబంలో అంతకుముందు ఎవరూ రాజకీయాల్లో లేరు. 2006లో కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి హైకమాండ్ నన్ను ఆదరించింది. సీఎం అవుతానని కలలో కూడా అనుకోలేదు. అలాంటిది ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా రెండేసిసార్లు సేవలందించాను. మ్యానిఫెస్టోలో ఇచ్చిన 160 హాల్లో 158 నెరవేర్చా. మొదటి ఏడాదిలోనే ఐదు గ్యారెంటీలు అమలు చేశాం. నాపై ప్రతిపక్షాలు వదంతులు ప్రచారం చేశాయి. కానీ, నా రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. పదవి కోసం, డబ్బు కోసం ఏనాడూ పాకులాడలేదని సిద్ధరామయ్య వివరించారు. ఈ క్రమంలో అధిష్టానంతో భేటీకి సిద్ధరామయ్య దిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశానికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సిద్ధరామయ్య స్థానంలో రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. శనివారం జరిగే సీఎల్పీ సమావేశంలో కొత్త శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. ప్రమాణస్వీకార కార్యక్రమంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
సిద్దరామయ్యకు డికె పాదాభివందనం 
సిద్ధరామయ్య తన సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలో బెంగుళూరులో ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. సీఎం సిద్ధరామయ్యను ఆలింగనం చేసుకున్న డిప్యూటీ సీఎం శివకుమార్ ఆ తర్వాత పాదాభివందనం చేశారు. సిద్ధరామయ్య కాళ్లను మొక్కి డీకే శివ.. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. బ్రేక్‌ఫాస్ట్ టింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. శివకుమార్‌ను సీఎం సిద్ధరామయ్య హత్తుకున్న ఫోటోను సీఎంవో ఆఫీసు విడుదల చేసింది. ఇక తర్వాత సిద్ధరామయ్య పాదాలను శివకుమార్ తాకారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





