త్వరలో మహిళా సంఘ సభ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్

– విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్యావ‌కాశాలు 
– ఎస్‌హెచ్‌జీ సమావేశంలో మంత్రి సీతక్క

హైదరాబాద, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: మహిళా సంఘ సభ్యుల్లో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని, అక్షరజ్నానంతోపాటు వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మహిళా స భ్యుల ఎడ్యుకేషన్ ప్రొఫైల్స్ ను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. సెర్ప్ కార్యాలయంలో  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్ తో కలిసి సెర్ఫ్ డైరెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులతో శనివారం సమీక్షసమావేశం నిర్వహించారు. మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం, నూతన సభ్యుల చేరిక, ‘అమ్మకు అక్షరమాల’ కార్యక్ర మం, సెర్ప్ అమలు చేస్తున్న పథకాల పురోగతి పై సమగ్రంగా చర్చించారు. గత నెలలో నిర్వహించిన జిల్లా సమాఖ్య సమావేశాల వివరాలు, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సెర్ఫ్ కార్యక్రమాల అమలు, గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణాల పురోగతి వంటి అంశాలపై సమీక్ష జరిగింది. నిర్మల్ జిల్లాలో వంద శాతం లోన్ రిపేమెంట్ చేయగా జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు గంగవ్వను మంత్రి సీతక్క చీరతో సత్కరించారు. అన్ని జిల్లా సమాఖ్యలు గంగవ్వను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమీక్షలో మంత్రి సీతక్క మాట్లాడుతూ గ్రామ మహిళా సంఘ భవనాల నిర్మాణం యజ్ఞంలా కొనసాగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 8,227 గ్రామ మహిళా సంఘ భవనాలకు అనుమతులు మంజూరు కాగా 5,239 భవనాల కోసం స్థలాల ఎంపిక పూ ర్తయి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఇప్పటికే కొన్ని భవనాలు పూర్తై ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను అభినందించారు. జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు గ్రామాల్లో పర్యటించి విజయవంతమైన కథనాలను ఇతర గ్రామాల్లో పంచుకోవడం ద్వారా మహిళా సభ్యులను ప్రేరేపించాలని సూచించారు. ప్రస్తుతం ఐదు వేలకుపైగా వీఓ భవనాలు నిర్మాణంలో ఉన్నాయని, వచ్చే సంవత్సరం మరో ఐదు వేల భవనాలు నిర్మిస్తామని తెలిపారు. వంద శాతం రీపేమెంట్ చేసిన భవనాల నిర్మాణం చేపడతామని, తగిన ప్రోత్సాహాలు అందిస్తామని వెల్లడించారు. అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని మహిళా సంఘాలు విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గతంలో చదువు అవకాశాలు లేకపోయిన మహిళలకు ఈ కార్యక్రమం ద్వా రా అక్షరజ్ఞానం అందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే ఆరు లక్షలకుపైగా మహిళలకు చదువు నేర్పించామని, త్వరలో మరో 6 లక్షల మందికి గ్రామస్థాయిలోనే విద్యాబోధన చేపడతామని చెప్పారు. సభ్యులలో ఎవరూ నిరక్షరాస్యులుగా మిగలకుండా చర్యలు తీసుకుంటున్నామని, వారి విద్యార్హతలను గుర్తించి ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. బాల్య వివాహాల వంటి సామాజిక సమస్యలను అరికట్టడంలో మహిళా సంఘాలు కీలక పాత్ర పోషించాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామాల్లో మహిళా సంఘాలు చెప్పిన మాటకు ప్రాధాన్యత ఉండేలా పనిచేయాలని కోరారు.
త్వరలో మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో మహిళలు రాజకీయ నాయకులుగా ఎదగాలని ప్రోత్సహించారు. మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారంటూ ప్రతి మహిళా సంఘం ఆర్థిక క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. కేవలం రుణాలు పొందడం కాక ఆ రుణాలను లాభదాయక వ్యాపారాలుగా మార్చుకునే మార్గాలను మహిళలకు నేర్పించాలన్నారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో కొత్త సభ్యుల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ప్రతి మహిళ సంఘ సభ్యురాలిగా మారేలా కృషి చేయాలని సూచించారు. వేసవి సెలవులను సద్వినియో గం చేసుకునేందుకు టీనేజ్ బాలికల కోసం ‘స్నేహా సమ్మర్ ప్రోగ్రామ్’ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లైఫ్ స్కిల్స్, సాధికారత, విద్యా కొనసాగింపు, ఆరోగ్య పరిరక్షణ, భద్రత అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. భవిష్యత్తులో బాలికలు సొంతంగా ఎదగడానికి బైక్ రైడింగ్ వంటి నైపుణ్యాలు నేర్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా సమ్మర్ ట్రైనింగ్లో సైకిల్ తొక్కడం కూడా నేర్పిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *