స్వాతంత్య్ర దిన వేడుకలకు పక్కా ఏర్పాట్లు చేయాలి

– సమష్టి బాధ్యతతో ఏర్పాట్లు చేయాలి
– సీఎస్ సంజయ్ సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 3: స్వాతంత్య్ర దిన వేడుకలను అత్యంత వైభవంగా, గౌరవప్రదంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పక్కా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమన్వయ సమావేశాన్ని సచివాలయంలో సోమవారం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర స్ఫూర్తికి తగిన విధంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలు నిర్వహించేందుకు అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలని సూచించారు. తొలుత ముఖ్యమంత్రి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక్ స్మారక్ వద్ద అమరవీరులకు పుష్పాంజలి ఘటిస్తారని, అనంతరం గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌÁవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని సీఎస్ తెలిపారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వేదిక ఏర్పాటు, ఇతర సౌకర్యాలు, అత్యవసర సేవలు తదితర అంశాలపై ముందస్తు ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లు, భవనాల శాఖ వేదిక నిర్మాణం, స్టేజ్, సిట్టింగ్ ఏర్పాట్లు, బ్యారికేడింగ్, రహదారుల మరమ్మతులు, తదితర మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు శాఖ భద్రత, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టడంతోపాటు వీఐపీలు, పాల్గొనేవారి రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచఎంసీ అధికారులు వేదిక పరిసరాల్లో పారిశుధ్యం, సుందరీకరణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ తగిన సంఖ్యలో వైద్య బృందాలు, అంబులెన్సులు, ప్రాథమిక చికిత్సా కేంద్రాలను వ్యూహాత్మక ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలని, అగ్నిమాపక శాఖ అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫైర్ టెండర్లు, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా, బ్యాకప్ ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఇతర శాఖలు కూడా తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి అన్ని పనులను వేడుకలకు ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి తనిఖీలు, సమీక్షలు నిర్వహించాలన్నారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు వికాస్ రాజ్, నవీన్ మిట్టల్, వాణిప్రసాద్, జీఏడీ(పొలిటికల్) ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, హోంశాఖ ప్రధాన కార్యదర్శి శిఖా గోయెల్, డీజీపీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్, అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *