– ప్రపంచ దేశాలతో పోటీపడేలా తెలంగాణ అభివృద్ధి
– ప్రతీ కార్యక్రమంలో మీ వెన్నంటి ఉంటాం
– ఎన్నారైల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ
– ఆన్లైన్లో ఓటు హక్కు నమోదు చేసుకోండి: ప్రవాసులకు భట్టి విజ్ఞప్తి
బాల్టిమోర్ (అమెరికా), ప్రజాతంత్ర, ఆగస్టు 3 : అనేక కష్టనష్టాలకోర్చి ఖండాంతరాలు దాటి ఉన్నత శిఖరాలకు చేరుకున్న ప్రవాస భారతీయులు తాము సాధించిన విజ్ఞానాన్ని, మేధస్సును సొంత రాష్ట్రం, పుట్టిన గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా జరిగిన 19వ ‘ఆటా’ జాతీయ మహాసభలలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాక ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతో దీటుగా తెలంగాణ రాష్ట్రం పోటీపడే స్థాయికి తీసుకెళ్తున్నామని, ఈ క్రమంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాసులు ముందుకు రావాలని కోరారు. ‘మీ కోసం సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేశాం. అన్ని అనుమతులు వెంటనే ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. పారిశ్రామికంగా, సామాజికంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో మేము వెన్నంటి ఉంటాం. మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించాలనే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఇక్కడికి పంపించారు’ అని డిప్యూటీ సీఎం చెప్పారు. తెలంగాణను 2047 నాటికి మÖడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మలచాలనే స్పష్టమైన ప్రణాళికతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఆనాడు సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో నేడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వనరులను సద్వినియోగం చేస్తూ పాలన సాగుతోందన్నారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు అత్యంత అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్రం వేగంగా దూసుకెళ్తోందని వివరించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరానికి మణిహారంగా ఉన్న 56 కి.మీ మూసీ నదిని లండన్‌లోని థేమ్స్ నది తరహాలో సుందరీకరిస్తున్నామని, స్వచ్ఛమైన నీరు పారేలా ప్రక్షాళన చేసి నగర రూపురేఖలు మార్చబోతున్నామని వెల్లడించారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నేడు తెలంగాణకు పెద్ద ఆస్తులుగా మారాయని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ఔటర్ రింగ్ రోడ్డును దాటి మిగతా జిల్లాలను కలుపుతూ ట్రిపుల్ ఆర్(రీజినల్ రింగ్ రోడ్) నిర్మిస్తున్నామని, వాటిని అనుసంధానం చేస్తూ కొత్తగా 36 రేడియల్ రోడ్లను ప్లాన్ చేశామని వివరించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు దీటుగా ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఆ ప్రాంతాన్ని ఆనుకుని సరికొత్తగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. రాష్ట్ర ప్రగతికి మానవ వనరుల అభివృద్ధే కీలకమని నమ్మిన ప్రభుత్వం అందుకోసం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు భట్టి తెలిపారు. సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు సైతం అమెరికా దాకా ఎదిగి ప్రపంచాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలన్న ఉద్దేశంతోనే ఒకేసారి వంద నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ బృహత్తర యజ్ఞంలో ప్రవాసులు భాగస్వాములు కావాలని, ఏ మూలాల నుంచి వచ్చారో ఆ మూలాలను మర్చిపోకుండా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నారైల సమస్యల పరిష్కారానికి చట్టబద్ధమైన ప్రత్యేక వ్యవస్థ 
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు(ఎన్నారైలు), తెలంగాణలో ఉంటున్న వారి తల్లిదండ్రుల సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధత(లీగల్ స్టేటస్) కలిగిన ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ ఆలోచనలో ఉందన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రవాసులు.. తమ సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక వేదిక కావాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ప్రపంచంలో ఎక్కడున్న తెలంగాణ వాసులైనా తమ ఇబ్బందులను లేదా రాష్ట్రంలో ఉంటున్న తమ తల్లిదండ్రుల సమస్యలను ఈ ప్రత్యేక వ్యవస్థ దృష్టికి తీసుకొస్తే వాటిని సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ కొనసాగుతోందని ప్రవాసులకు గుర్తుచేశారు. తెలంగాణ పౌరులు ప్రపంచంలో ఏ నలుమూలల ఉన్నా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా తమ ఓటు హక్కును నమోదు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉందన్నారు. ప్రవాసులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భట్టి విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





