- జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు
- మంత్రి కేటీఆర్ ఆదేశాలతో పారిశుద్ధ్య పనులు
కరోనా భయానికి తోడు ఈ వానకాలం సీజనల్ వ్యాధులు మరింతగా భయపెడుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు విశ్వరూపాన్ని చూపించేందుకు గ్రామాలు, బస్తీలు, అపరిశుభ్ర ప్రాంతాల్లో తిష్ఠవేస్తాయి. ఈ సమయంలో పరిశుభ్రత పాటించకుంటే మనలను పీక్కుతుంటాయి. సీజనల్ వ్యాధులకు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే ప్రధానమని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పట్టణాలు, ప్లలెలు, నగరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నారు. వానకాలంలో నీరు నిలువకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ముఖ్యంగా డెంగీ, చికున్‌గున్యా ప్రబలకుండా వైద్యాధికారులు, సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. డెంగీ నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలు,మండలాలు, పట్టణాల్లో ఇంటింటి సర్వే చేపట్టారు.జ్వరం సర్వే, పెరిడోమేస్ట్రి లార్వల్ సర్వే, యాంటీ లార్వల్ సర్వే, పేరిత్రల్ స్పే, యాంటి లార్వల్ ఆపరేషన్, అవగాహన సదస్సులను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటలకు పది నిమిషాలు ఎవరింట్లో వారు స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఇందులో పాల్గొంటున్నారు.
వర్షాకాలంలో మలేరియా విజృంభిస్తుంది. జ్వరం వచ్చి తగ్గుతుండడం, చలి, శరీరంలో నొప్పులు, తలనొప్పి లక్షణాలతో ప్రారంభమవుతుంది. ఇండ్లల్లో దోమ తెరలు వాడాలి. పరిసరాల్లో చిన్నచిన్న గుంతల్లో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇండ్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో డీడీటీ లాంటి పౌడర్‌ను చల్లడం అవసరం. చికెన్ గున్యా కూడా దోమ వల్ల వస్తుంది. కండరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ దోమ మంచి నీటిలో పెరుగుతుంది. ఇంట్లో పూల కుండీలు, కూలర్లలో ఎప్పటికప్పుడు నీటిని మారుస్తుండాలి. ఈ సీజన్లో సాధ్యమైనంత ఎక్కువగా కాచి చల్లార్చి వడబోసిన నీటిని లేదా క్లోరిన్ కలిపిని నీటిని మాత్రమే తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తినాలి. వ్యక్తిగత పరిశుభ్రత తప్పని సరిగా పాటించాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.