శాస్త్రీయ పద్ధతిలో గనుల మూసివేత

బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల శాఖ కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 3: తమ ప్రభుత్వం ఉత్పత్తిని పెంచడంతోపాటు కార్మికుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడిరచారు. హైదరాబాద్‌ శివార్లలోని కన్హా శాంతివనంలో బొగ్గు, గనుల శాఖకు సంబంధించిన కన్సల్టేటివ్‌ కమిటీ సమావేశం గురువారం జరిగింది. సమావేశంలో మైన్‌ క్లోజర్‌, మినరల్‌ ఎక్స్‌ప్లొరేషన్‌కు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈ దిశగా జరిగిన ప్రయత్నాలను అధికారులు వెల్లడిరచగా ఇకపై చేపట్టాల్సిన అంశాలపై కమిటీ సభ్యులు పలు సూచనలు చేశారు. మైనింగ్‌కు సంబంధించిన పలు అంశాలను కూడా లెవనెత్తారు. వీటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అధికారులు సమాధానం ఇస్తూ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామన్నారు. మైన్‌ క్లోజర్‌ సందర్భంగా మైనింగ్‌ కోసం భూములిచ్చి ఉద్యోగాలు పొందిన వారికి మళ్లీ ఉపాధి కల్పించడం, తదితర అంశాలను సభ్యులు లేవనెత్తారు. దీనిపై దృష్టిసారిస్తామని కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగుల బీమా విషయంలో తమ ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రస్తుతం ఉన్న బీమా మొత్తానికి అదనంగా రూ.కోటి బీమా ప్రతి ఒక్కరికీ ఇస్తున్నామని వెల్లడిరచారు. ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్‌ చంద్రదూబే, కమిటీ సభ్యులైన ఎంపీలు, గనుల శాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావ్‌, బొగ్గు, గనుల శాఖ ఉన్నతాధికారులు, కోలిండియా చైర్మన్‌ పీఎం ప్రసాద్‌, సింగరేణి సీఎండీ బలరాం నాయక్‌ సహా వివిధ పిఎస్‌యుల సీఎండీలు ఈ రెండు శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం హార్ట్‌ఫుల్‌నెస్‌ సెంటర్‌, కన్హా శాంతి వనంతో కోలిండియా, సింగరేణి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. కోలిండియా కూడా దేశంలోని వివిధ బొగ్గు గని ప్రభావిత ప్రాంతాల్లో అటవీ సంపద ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం మీడియాతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక ప్రాంతాల్లో మైనింగ్‌ చేసి బొగ్గు వెలికి తీసిన తర్వాత ఆ బ్లాక్స్‌ అలాగే వదిలేశారని, సైంటిఫిక్‌ సిస్టమ్‌లో ఆ బ్లాక్‌లను మూసివేసి ఆ భూమి మళ్లీ ఉపయోగపడేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇటీవల ప్రధానమంత్రి ఈ విషయంపై ఒక ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి దేశంలో ఉన్న సుమారు 143 కోల్‌ మైన్స్‌ (బొగ్గు వెలికితీత పూర్తయిన) గనులను సైంటిఫిక్‌ పద్ధతిలో, పర్యావరణ పరిరక్షణ దృష్టిలో మూసివేయాలని ఆదేశించారని పేర్కొన్నారు. ఇందుకోసం అక్కడున్న ప్రజలకు, రైతులకు ఉపయోగపడేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని ముందుకెళ్తున్నామన్నారు. ఈ సంవత్సరమే సుమారు పది గనుల్లో పని మొదలుపెట్టి దాదాపు ఏడెనిమిది గనులను మూసివేశామన్నారు. రానున్న రోజుల్లో మిగతా 130 మైన్స్‌ను కూడా మూసివేసి అటవీ, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంఆమన్నారు. షాద్‌నగర్‌లోని హార్ట్‌ఫుల్‌ నెస్‌ సంస్థ వృక్షసంపదను పెంచేదిశగా చేపడుతున్న చర్యల స్ఫూర్తితో గనులను మూసివేసిన తర్వాత సమాజానికి ఉపయోగపడేలా వృక్ష సంపద పెంచుతామని, ఇందుకోసం ఆ సంస్థతో ఎంఓయూ కూడా కుదుర్చుకున్నామని మంత్రి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page