– దేశ భక్తులను తక్కువ చేసి చూసింది
– నిజాంపై ఆయన పోరాటాన్ని మరువకూడదు
– జయంతి వేడుకలలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: ఏడాది పొడవునా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలను కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు ఘనంగా నిర్వహించబోతున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుంచి రాష్ట్రం వరకు, పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు, రైతు నుంచి స్వాతంత్య్ర సమరయోధుడి వరకు ప్రతీ భారతీయుడు సర్దార్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగస్వామిగా ఉండబోతున్నారన్నారు. ఆయన స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదు.. గుజరాత్‌లో రైతు ఉద్యమ నాయకుడిగా కూడా ప్రజల మనసుల్లో నిలిచారు.. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆయన వంటి మహనీయులు, లేదా తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు వంటి నాయకులు నచ్చరు.. వారికి నెహ్రూ కుటుంబం తప్ప ఇంకెవ్వరూ గుర్తుండరు.. సర్దార్ వల్లభాయ్ పటేల్, పీవీ నరసింహారావు, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి దేశ భక్తులను ఆ పార్టీ ఎప్పుడూ తక్కువ చేసి చూసిందని కిషన్‌రెడ్డి విమర్శించారు. దేశం కోసం, దేశ అభివృద్ధి కోసం పోరాడిన వీరులందరినీ చరిత్రలో నిలిచేలా చేయడం, నవతరానికి వారి త్యాగాలను తెలియజేయడం భారత ప్రభుత్వం గొప్ప కార్యక్రమం చేపట్టిందన్నారు. నిజాం పాకిస్థాన్ జెండాను ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో పటేల్ చొరవతోనే ఈ తెలంగాణ గడ్డపై భారత త్రివర్ణ పతాకం ఎగిరింది.. సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలంగాణలోని ప్రతీ బిడ్డ ఆయన పేరును గౌరవంగా స్మరించుకుంటాడని ఆయన చెప్పారు. పటేల్ ఆత్మీయత, ధైర్యం, దేశభక్తి ఇవన్నీ మనకు మార్గదర్శకమని అన్నారు. అందరం కలసి పటేల్ 150వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకుందాం.. ఆయన ఇచ్చిన ఐక్యత, స్వాతంత్య్ర విలువలను గుర్తుచేసుకుందాం.. ప్రతీ తెలంగాణ బిడ్డ ఈ సంవత్సరం మొత్తం ఆయనను స్మరించుకుంటూ, రజాకార్ల దమనకాండపై సర్దార్ పోరాటాన్ని ఘనంగా స్మరించుకుందాం అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





