– కంచి స్వామి, గవర్నర్ శుక్లాల తొలి పుష్కర స్నానం
– 30-40 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా
– ఇబ్బందులు తలెత్తకుండా భారీ ఏర్పాట్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : కాళేశ్వరం వద్ద ఈనెల 21నుంచి జరిగే సరస్వతీ నది అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేసింది. 12 రోజులపాటు అనగా జూన్ 1 వరకు జరగనున్న ఈ పుష్కరాలకు 30 నుండి 40 లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. గత ఏడాది జరిగిన ఆది పుష్కరాలనాటి అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంత్య పుష్కరాలకు ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలను చేపట్టింది. ప్రస్తుత వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పుష్కర ఘాట్ వద్ద కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పుష్కర ఘాట్ పరిసరాల్లోని 23 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్, బీటీ రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పుష్కరాల పనుల కోసం ప్రభుత్వం రూ.30.63 కోట్ల నిధులను కేటాయించింది. పుష్కరాల తొలి రోజు గురువారం తెల్లవారు జామున 5.43 గంటలకు కంచి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి, రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లాలు పుష్కర స్నానం చేసి అంత్య పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. ప్రతి రోజూ ఒక ప్రముఖ పీఠం స్వామిజీ ఈ పుష్కారాల్లో పుణ్య స్నానం చేస్తారు. ప్రతి రోజూఉదయం హోమాల నిర్వహణ, సాయంత్రం పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 90 షటిల్ బస్సులను ఏర్పాటు చేశారు.
రూ.1.20 కోట్లతో ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు 
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రూ.1.20 కోట్లతో ప్రత్యేకంగా మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నాగేంద్ర స్వామి ఆలయాన్ని రూ.30 లక్షలతో పునర్నిర్మించారు. పుష్కరాల సందర్భంగా ప్రతి రోజూ నిర్వహించే హారతి, హోమాలు, తెప్పోత్సవం లకు పెద్ద ఎత్తున ఏర్పాట్లT చేపట్టారు. పుష్కరాలకు హాజరయ్యే వారి సౌకర్యార్థం దాదాపు 500 టాయిలెట్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతోపాటు తాగునీటి కోసం రెండు ఓహెచఆర్‌సిలను నిర్మించారు. వాహనాల కోసం ఏర్పాటు చేసిన 23 పార్కింగ్ కేంద్రాలలోనూ తాగునీటి సౌకర్యంతోపాటు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు.
300 మంది వైద్యాధికారులతో శిబిరాల ఏర్పాటు
కాళేశ్వరం పుష్కర ఘాట్‌లోని 23 జోన్లలో ప్రత్యేక మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను 300 మంది వైద్యాధికా రులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లో అంబులెన్సులు ఏర్పాటు చేశారు. మహాదేవపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెఫరల్ హాస్పిటల్‌గా ఏర్పాటు చేశారు.
245 ఎకరాల్లో 1.70 లక్షల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు
పుష్కరాలకు లక్షా 70 వేల వాహనాలు వస్తాయని అంచనా వేసి వీటి కోసం 245 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ ఏరియాలతోపాటు ఘాట్స్, టెంపుల్ తదితర ప్రాంతాలలో 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పుష్కర స్నానాలకు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా ఎలఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ 12 రోజులపాటు పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు 300 మంది పారిశుధ్య సిబ్బందిని నియమించారు. పుష్కర ఘాట్లలో నిరంతరం విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టారు.
వందమంది గజ ఈతగాళ్ల నియామకం
పుష్కర స్నానాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా రెస్క్యూ బృందాలతోపాటు ప్రత్యేక శిక్షణ పొందిన వందమంది గజ ఈతగాళ్లను సరస్వతీ ఘాట్, నదీ ప్రాంతంలో నియమించారు. ఇవిగాక సెఫ్టీ బోట్స్, లైఫ్ రింగ్స్, ఎస్‌డిఆర్‌ఎఫ్ టీంలను నియమించారు. పుష్కర కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించేందుకు మీడియా సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
అంత్య పుష్కరాలు వైభవంగా జరుపుకోవాలి :సీఎం
సరస్వతీ నది అంత్య పుష్కరాలను భక్తిశ్రద్దలతో వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నుంచి జూన్ 1 వరకు కాళేశ్వరం వద్ద జరిగే సరస్వతీ అంత్య పుష్కరాలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఆరోగ్యం కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ పుష్కర శుభాకాంక్షలు తెలిపారు.
పుష్కరాలకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి సురేఖ 
వరంగల్ : సరస్వతి నది అంత్య పుష్కరాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఈ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని వివరించారు. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో కంచి పీఠాధిపతి విజయేంద్రస్వామితో కలిసి ఆమె బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయం బయట మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ అంత్య పుష్కరాలకు రూ.200 కోట్లకు పైగా నిధులను ప్రభుత్వం కేటాయించిందని వివరించారు. ఈ పుష్కరాలలో రోజుకు ఒక స్వామిజీ స్నానాలు ఆచరిస్తారని తెలిపారు. కాళేశ్వరంలో జరిగే ఈ సరస్వతి పుష్కరాల్లో ప్రతి రోజూ సాయంత్రం గోదావరి హారతి ఇస్తారని, పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామని సురేఖ వివరించారు. ఈ పుష్కరాల సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున సేవలందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం వరకు దేవాలయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





