నెట్ జీరో సిటీ తరహాలో ఫ్యూచర్ సిటీ

– అంతర్జాతీయ సంస్థలను రప్పించాలి
– ప్రజాప్రతినిధులు, బ్యురోక్రాట్లు, జర్నలిస్టులకు 500 ఎకరాలు
– హెల్త్ క్లస్టర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి
– పరిశ్రమల ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 20 : భారత్ ఫ్యూచర్ సిటీలో నెట్ జీరో సిటీ తరహాలోనే డిజైన్స్ ఉండాలని, మౌలిక వసతుల కల్పన అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో రాజీ పడొద్దని అన్నారు. ఇక్కడ భూమి కేటాయింపు, పరిశ్రమల ఏర్పాటుపై ఎంసీఆర్ హెచ్ ఆర్ డీ బోధి పెవిలియన్ లో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు.  అంతర్జాతీయ స్థాయి నగరాలను అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసిన తర్వాతే భూ కేటాయింపులు చేయాలని, అంతర్జాతీయస్థాయి సంస్థలను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలి కోరారు. ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలన్నారు. కేంద్రం ప్రకటించిన హెల్త్ క్లస్టర్ ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరం అయితే ప్రధాని మోదీని కలిసి హెల్త్ క్లస్టర్ కేటాయించాలని విజ్ఞప్తి చేద్దామన్నారు. జూన్‌లో ఫ్యూచర్ సిటీ ఇండ్రస్టియల్ పార్క్‌లో  పరిశ్రమల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగేలా చూడాలన్నారు. భూ కేటాయింపు జరిగిన వెంటనే పరిశ్రమలు నిర్మాణం మొదలు పెట్టేలా నిబంధన విధించాలని సూచించారు. ఇన్వెస్ట్ తెలంగాణ పేరులో పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని, ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ఆకర్షణీయమైన లోగో, వెబ్‌సైట్ రూపొందించాలని, ఇన్వెస్ట్ తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారి కోసం ఎస్కార్ట్ ఆఫీసర్ వ్యవస్థని రూపొందించాలని, గ్రూప్-1 స్థాయి అధికారిని ఎస్కార్ట్ ఆఫీసర్‌గా నియమించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. తమిళనాడు, గుజరాత్ పారిశ్రామిక విధానాన్ని అధ్యయనం చేయాలన్నారు.

హైదరాబాద్ వెలుపలా జీసీసీల ఏర్పాటుకు ప్రోత్సాహం

బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ ప్రారంభించాలని, 1500 ఎకరాల్లో డేటా సిటీ ఏర్పాటు చేయాలని, డేటా సిటీ నీటి అవసరాల కోసం ఎస్‌టీపీలను వినియోగించాలని ఆదేశించారు. హైదరాబాద్ వెలుపలా జీసీసీల ఏర్పాటుకు రాజ‌ధాని హైదరాబాద్ మ‌హ‌న‌గ‌రానికే కే కాదు.. జిల్లాలకూ ఐటీ వెలుగులు విస్తరించాలని ముఖ్య‌మంత్రి ఉద్ఘాటించారు. హైదరాబాద్ అవతల కూడా జీసీసీలు ఏర్పాటు చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ హైవేల వెంట జీసీసీలు, డేటా సెంటర్లు ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సూచించారు. ద్వితీయ, తృతీయ‌ శ్రేణి నగరాల్లో జీసీసీల ఏర్పాటుపై దృష్టి పెట్టేలా పాలసీ రూపకల్పన చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మూడు నెలల్లో ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్‌కు కనెక్ట్ కావాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే టీ-ఫైబర్‌కు మారిన ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.54 కోట్ల ఆర్డర్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఫ్యూచర్ సిటీలో స్థాపించే కంపెనీలన్నీ నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తో ఒప్పందాలు కుదుర్చుకునేలా చూడాలన్నారు. సమావేశానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) వైస్ చైర్మన్ శశాంక, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సీఎంతో ఎఫ్‌టీసీసీఐ బృందం భేటీ 

ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) అధ్యక్షుడు ఆర్.రవికుమార్ బుధవారం ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో కలిశారు. ఈయనతోపాటు జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, ఎఫ్‌టీసీసీఐ  డైరెక్టర్ సంగీత,  ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్ అవార్డ్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్స్ అవార్డుల కార్యక్రమానికి ఎఫ్టీసీసీఐ బృందం ముఖ్యమంత్రిని ఆహ్వానించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *