పిల్లా పోదాం పదవే పల్లెకి
పిలగా ఏముంది రా పల్లెలో
పంట చేతికొచ్చే వేళ
జరుపుకునే పండుగకి పోదామే
కళకళలాడే లోగిళ్ళను చూద్దామే
ఎనకటి రోజులు కావయ్యా
ఎదురుచూసే మనుషులు లేరయ్యా
పావురంగా జూసుకునే బంధాలు లేవయ్యా
ప్రపంచీకరణ బాంధవ్యాలను చిదిమేసిందయ్యా
అట్టెట్టనే పిల్లా
పచ్చాని పల్లె కళ్ళల్లో తిరుగుతుందే మల్లా
ఏం చేద్దునే పిల్లా
ఓరోరి పిలగా
పల్లెవృత్తులన్నీ కాట గల్సినయిరో
తెల్లారేసరికి వాకిట వాలే హరిదాసులు లేరు
ఎద్దులేని ఎవుసం వచ్చాక గంగిరెద్దుల జాడ లేదు
కల్లాపి చల్లి వాకిట ముగ్గేసి పెట్టే గొబ్బెమ్మల్లేవు
అలంకరణకి పశువులే లేవు బండ్లు లేవు
వడ్లోల చంద్రన్న బండ్ల గిల్లలు ఇరుసు మరిసి

పట్నంబోయి బహుళ అంతస్తులల్ల
తలుపు గూళ్లు చేసుకుంటుండు
బోనం కుండ ఇచ్చే కుమ్మరోళ్ళ మల్లన్న
కుండను మింగిన అల్యూమినియంను
తిట్టుకుంటూ వృత్తినే వదిలేసిండు
చౌడు మట్టిని వాడి ధగధగ మెరిసేట్లు
బట్టలుతికిన చాకలి వెంకటన్న
ఎటుపోయిండో జాడే లేడు
ఆ బ్రదర్స్ ఈ బ్రదర్స్ కొట్లల్ల అవుసలి శేషన్న
పని జేస్తుండురా పిలగా
పండగంటే కోడిపందేలని ఊదరగొట్టే గొట్టాలు
ఓమారు పల్లెకష్టాలను లోకంముందు పెట్టకపాయే
పైస పల్లెల్లో జొరబడ్డాక
తానమ్మేదే నిఖార్సైన సరుకంటూ


వస్తుమార్పిడిని ధ్వంసం చేసిందిరో పెట్టుబడి
కోడిపందాల మాటున జరిగే యాపారాలెన్నో
వాటిమాటున దాగిన మాఫియా ఎనుక రాజ్యం నిర్లజ్జగా
ఏం చేస్తవురా పిలగా ఊరికి పోయి
పలకరించనీ తోటోళ్లు లేరు
వలస ఊరిని ఎడారి చేసే
ఇంటిపట్టున ముసలిముతక తారాడుతుండ్రు
పల్లె భారత పట్టుగొమ్మలనేది కాగితం దాటి
పల్లె కొచ్చినప్పుడు పోదాం లే పిల్లగా
సరే లే పిల్లా
నాడు నీకో ఆకుపచ్చచీర
సాలోళ్ల సాయన్నతో నేయిస్తా
సంక్రాంతి సంబరంగా జరుపుకుందాం నాడు
గిరి ప్రసాద్ చెలమల్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *