ఉద్యమ పతాకకు కాషాయ కిరీటం

రాడికల్స్‌ను ఎదురొడ్డి ఉస్మానియాలో ఏబీవీపి జెండా ఎగరేసిన రామచంద్రరావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 30: విద్యార్ధి దశలోనే ఏబీవీపీ పక్షాన పోరాడి పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న నాయకుడు ఎంతోమంది పేదల, బీజేపీ నేతల పక్షాన న్యాయ పోరాటం చేసిన న్యాయవాది .. అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం రామచంద్రరావు సొంతం. హైకమాండ్‌ నిర్ణయంపట్ల సీనియర్ల హర్షం.. పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి అగ్ర తాంబూలం లభిస్తుందనడానికి రాంచంద్రరావే నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన ఉస్మానియా వర్శిటీలో ఉద్యమాలు కొత్తకావు. తెలంగాణ ఉద్యమానికే కాదు… విద్యార్ధి సంఘాల పోరాటాలకు పుట్టిల్లు ఉస్మానియా యూనివర్శిటీ. రెండు దశాబ్దల క్రితం వరకు విద్యార్ధి సంఘాల పోరాటాలు, విద్యార్ధి సంఘం ఎన్నికలు ఎమ్మెల్యే ఎన్నికలకు మించి ఉత్కంఠగా సాగేవి. ముఖ్యంగా ఉస్మానియాలో విద్యార్ధి సంఘాల ప్రభావం అంతాఇంతా కాదు. నాడు విద్యార్ధి సంఘాల నాయకులుగా పనిచేసిన వారే ఆ తరువాత రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తూ గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, రాష్ట్ర మంత్రులుగా అనేక పదవులు చేపట్టిన చరిత్ర ఉస్మానియాకు ఉంది. ఇదంతా ఎందుకంటే ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు పేరును జాతీయ నాయకత్వం ఖరారు చేసింది. మరికాసేపట్లో ఆయన నామినేషన్‌ దాఖలు చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఎవరీ రామచంద్రరావు? బీజేపీ నాయకత్వం ఆయన పేరునే కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేట్‌ చేసిందనే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొందరు ప్రత్యర్థులు రామచంద్రరావును సోషల్‌ మీడియా, యూ ట్యూబ్‌ ఛానల్స్‌ లో డమ్మీగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని ద్రుష్టిలో ఉంచుకుని ఎన్‌.రామచంద్రరావు విద్యార్ధి, రాజకీయ నేపథ్యంపై వాస్తవాలు మీ ముందుంచుతున్నాం.

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నక్సలైట్లకు ఎదురొడ్డి..

ఎన్‌.రామచంద్రరావు అంటే న్యాయవాదిగా, మాజీ ఎమ్మెల్సీగా మాత్రమే ఈ తరానికి తెలుసు. కానీ విద్యార్ధి రాజకీయాల్లోనే రామచంద్రరావు ఒక సంచలనం. అందులోనూ ఉస్మానియా యూనివర్శిటీలో ఏబీవీపీ మనుగడలో లేని సమయంలో రామచంద్రరావు ఏబీవీపీలో చేరి ఆ సంఘాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్‌. ఉస్మానియా వర్శిటీ పరిధిలోనే నివాసం ఉండేవారు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో ఉద్యమాలకు స్వతహాగా దూరంగా ఉండేవారు. కానీ రామచంద్రరావు మాత్రం ఏబీవీపీలో ఉంటూ విద్యార్ధుల పక్షాన ఉద్యమాలకు నాయకత్వం వహించడమే రాడికల్‌ స్టూడెంట్స్‌ తో నేరుగా తలపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. 1975 నుండి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డగా మారిన సమయం. రాడికల్స్‌ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రావు. ఉస్మానియా వర్శిటీ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలైట్లు అక్కడికి వచ్చి రామచంద్రరావుపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్లు, చేతులు విరగ్గొట్టి వెళ్లారు. దాదాపు రెండు నెలలపాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తరువాత రాడికల్స్‌ కు వ్యతిరేకంగా మరింత ఉధ్రుతంగా పోరాటాలు చేశారు. విద్యార్ధుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్‌ తోపాటు ఇటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు ఎం.ఏ (1980-82), ఎల్‌.ఎల్‌.బీ (1982-85) పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా (1977-85), నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

న్యాయ కోవిదుడు రామచంద్రుడు

1986లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్‌ ప్రారంభించిన ఆయన, జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్‌ కోర్టులు, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో న్యాయ సేవలందించారు. 2012లో హైకోర్టు ఆయనను సీనియర్‌ అడ్వకేట్గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులు, ట్రిబ్యూనల్స్‌లలో క్రిమినల్‌, సివిల్‌, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు. ఇక బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుండే వారు. ప్రజా సమస్యలపై, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయపోరాటం చేసి జైలు నుండి బయటకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు.

రాజకీయ దురంధరుడు
ఇక ప్రత్యక్ష రాజకీయాల విషయానికొస్తే 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్‌ లోని రవీంద్రనగర్‌ డివిజన్‌ నుండి కార్పొరేటర్‌ గా పోటీ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా (1980-82), నగర ఉపాధ్యక్షుడిగా (1986-90) పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్‌ సంయుక్త కన్వీనర్‌ (1999-2003), కన్వీనర్‌ (2003-06)గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ లీగల్‌ సెల్‌ సంయుక్త కన్వీనర్‌ (2006-10), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా (2007-09), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (2009-12), ముఖ్య అధికార ప్రతినిధిగా (2012%-%15) పనిచేశారు. 2015లో హైదరాబాద్‌%-%రంగారెడ్డి%-%మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్‌ లీడర్గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్‌ నగర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.

 

కలుపుగోలు మనిషి… పార్టీ విధేయుడు

రామచంద్రావుకు పార్టీలో, బయట కలుపుగోలు మనిషిగా పేరుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరితో నవ్వుతూ సఖ్యతగా మాట్లాడే నాయకుడు. పాత, కొత్త తరం నాయకులందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయన సొంతం. రామచంద్రరావు ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులుంటాయని, టెన్షన్‌ మటుమాయమవుతుందని పార్టీ నేతలంతా సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు. విధేయతకు కేరాఫ్‌ అడ్రస్‌ గా రామచంద్రరావు నిలుస్తారని, హైకమాండ్‌ ఒక పని అప్పగించిందంటే అది పూర్తి చేసేదాకా కష్టపడతారని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్ని సుగుణాలు, రాజకీయ నేపథ్యం ఉన్నందునే పార్టీ జాతీయ నాయకత్వం రామచంద్రావుకు రాష్ట్ర పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైందని, దీనిని ద్రుష్టిలో ఉంచుకునే పార్టీలోని సీనియర్‌ నేతలంతా ఆయనకు సంపూర్ణంగా మద్దతు పలికారని పార్టీ వర్గాలు పేర్కొనడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page