భూభారతి బాధితులు ఉండకూడదు

గత ప్రభుత్వ పదేండ్ల పాలనలో ప్రజలు భూసంబంధిత సమస్యలతో సతమతమయిన సంగతి
ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ‘ధరణి’ పోర్టల్ బాధితుల అవస్థలు
అయితే వర్ణనాతీతమే. రకరకాల సమస్యలతో జనం ఇక్కట్లు పడ్డారు..ఇప్పటికీ
పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ‘ధరణి’ స్థానంలో
‘భూభారతి’ చట్టం తీసుకొచ్చింది. సుమారు 9 వేల పై చిలుకు భూభారతి సదస్సులు
నిర్వహించి..
జనం నుంచి సుమారు 3 లక్షలా 30 వేలకు పై చిలుకు దరఖాస్తులను
స్వీకరించింది. అయితే, వీటి పరిష్కారానికి ప్రజాప్రభుత్వంలో ఆస్కారం
ఉంటుందని జనం ఎంతో ఆశగా, ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో
కాంగ్రెస్ సర్కారు ఎంతో జాగ్రత్తగా ఆచితూచి భూసంబంధిత సమస్యల
పరిష్కారానికి చొరవ తీసుకోవాలి. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి
శ్రీనివాస్‌రెడ్డి ఆగస్టు 15 లోపు భూసమస్యలను పరిష్కరిస్తామని
ప్రకటించారు. దాంతో రెవెన్యూ శాఖ వాళ్లకు పంద్రాగస్టు అనేది డెడ్‌లైన్‌గా
మారింది. ఇక్కడే అసలు చిక్కులు వచ్చి పడ్డట్టయింది. ఆగస్టు 15 లోపు
అప్లికేషన్లను ఏ మేరకు పరిష్కరిస్తారనేది కీలకం కానుంది.
క్షేత్రస్థాయి యంత్రాంగమెక్కడ?
భూసంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది
కీలకంగా పని చేయాలి. కాగా, క్షేత్రస్థాయిలో యంత్రాంగం కొరత
కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ప్రజల సమస్యలను ప్రభుత్వం నిజంగా
పరిష్కరించాలనుకుంటే రెవెన్యూ శాఖలో గ్రామాల్లో కీలకంగా వ్యవహరించాల్సిన
గ్రామ పాలనా అధికారులను(వీఏవో) వెంటనే అధిక సంఖ్యంలో నియమించాలి. తద్వారా
గ్రామాల్లో రెవెన్యూ చిక్కులకు చెక్ పడే ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా
డెడ్‌లైన్ విధించి పనులు చేయాలని ఆదేశాలు జారీ చేస్తే మళ్లీ.. సేమ్
తప్పులు రిపీట్ అయ్యే చాన్సెస్ మెండుగా ఉంటాయి. ఈ విషయాలను గమనించి
సర్కారు ఆ దిశగా ఆలోచన చేయాలి. గతంలో గ్రామస్థాయిలో కీలకంగా వ్యవహరించే
వీఆర్వో‌లు ఉండేవారు. కానీ, వారిని తీసేశారు.
ఇప్పుడు సరికొత్త పేరు(వీఏవో)తో మరొక పోస్టును క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే రాష్ట్రంలోని
కొన్ని మండలాల్లో అయితే తహశీల్దార్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మాత్రమే
విధులు నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల సమస్యల పరిష్కారానికి సిబ్బంది
అవసరముంటుంది. లైసెన్సుడ్ సర్వేయర్ల కొరత కూడా ఉంది. ఈ విషయాలన్నింటినీ
పరిగణనలోకి తీసుకుని సర్కారు పకడ్బందీ చర్యలు తీసుకుంటేనే భూ సంబంధిత
సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. లేదంటే గతంలో ‘ధరణి’ బాధితుల మాదిరిగానే
భవిష్యత్తులో ‘భూభారతి’ బాధితులు ఉండే ఆస్కారముంటుంది. అలా కాకుండా
ఉండాలంటే ప్రభుత్వం మానవ వనరులను రెవెన్యూ శాఖలో పెంచేందుకు తగు చర్యలు
తీసుకోవాలి.
– అంబీర్ శ్రీకాంత్,
సెల్:81859 68059.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page