‘టీమ్ బీజేపీ’ భావనతో పనిచేయాలి

– ప్రతీ ఎన్నికలో విజయమే ధేయయంగా నడవాలి
– రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు రామచందర్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : బీజేపీ అనేది ఒక్క వ్యక్తి ఆధారంగా నడిచే పార్టీ కాదు.. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక.. మనమంతా టీమ్ బీజేపీ భావనతో పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో, ప్రతి ఎన్నికలో విజయాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగాలి అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగగా ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రామచందర్‌రావు మాట్లాడుతూ తాను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ సంవత్సర కాలంలో తనపైౖ విశ్వాసం ఉంచి, ప్రతి అడుగులోనూ సహకరించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించి కార్యకర్తలను కలవడం, ఈ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరై మార్గనిర్దేశం చేయడం పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తోందో స్పష్టం చేస్తోందన్నారు. నితిన్ జాతీయ అధ్యక్షుడైన తర్వాత అస్సాంలో మూడోసారి, పుదుచ్చేరిలో రెండోసారి, పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి పార్టీ విజయాలు నమోదు చేసినట్లే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ విజయపతాకాన్ని ఎగురవేస్తుందనే పూర్తి విశ్వాసం తనకు ఉందంటూ ప్రజలకు నిజమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. బీఆరఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు కుటుంబ పాలన, అవినీతి, పాలనా వైఫల్యాలతో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చాయని విమర్శించారు. ఏ వర్గం కూడా ఈ ప్రభుత్వాల పాలనలో సంతృప్తిగా లేవంటూ పభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు పారదర్శకంగా నేరుగా ప్రజలకు చేరుతున్నా తెలంగాణలో ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదన్నారు. అవినీతి, కమీషన్లు, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకే కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందని దుయ్యబట్టారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది.. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హైడ్రా పేరుతో పేదలు, మధ్యతరగతి ప్రజలు బ్యాంకు రుణాలు తీసుకుని కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను కూల్చివేయడం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ నది ప్రక్షాళన విషయంలో బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదు.. కానీ ఆ పేరుతో గాంధీ సరోవర్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రకటించి రూ.లక్షల కోట్ల ఖర్చు చేస్తూ ప్రజలను నిర్వాసితులను చేయడం సరైన విధానం కాదని అన్నారు. ముందుగా మూసీని శుద్ధి చేయాలి.. ఆ తర్వాత ఇతర అభివృద్ధి ప్రణాళికలను చేపట్టాలిలని కోరారు. లేకపోతే ఈ ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు తరహాలోనే ప్రజల ధనాన్ని వృథా చేసే కార్యక్రమంగా మారుతుందన్నారు. పన్నెండేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అవినీతిరహిత, పారదర్శక పరిపాలన కొనసాగుతోందని, రాజకీయాలకతీతంగా అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తూ దేశ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం కూడా కేంద్ర ప్రభుత్వం రూ.లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు, నిధులు మంజూరు చేసిందని, ఎయిమ్స్, కోచ్ ఫ్యాక్టరీ, సమ్మక్క-సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ, జాతీయ రహదారులు వంటి అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమయ్యాయన్నారు. అయినా కేంద్రం తెలంగాణకు సహకరించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మెట్రో విస్తరణ, ఎంఎంటీఎస్ వంటి అంశాల్లో రాష్ట్రం తన బాధ్యతను నిర్వర్తించకుండా కేంద్రాన్ని విమర్శించడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కూల్చివేతలతో ప్రారంభమైన ఈ ప్రభుత్వాన్ని ప్రజలే ప్రజాస్వామ్య పద్ధతిలో కూల్చివేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని విశ్వసిస్తున్నానన్నారు. అలాగే బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ప్రజలను మోసం చేసే రాజకీయాల్లో ఒకే తాటిపై నడుస్తున్నాయని వ్యాఖ్యానించారు. ప్రజలు బీజేపీకి అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించి ఆదర్శ తెలంగాణగా తీర్చిదిద్దుతామని రామచందర్‌రావు హామీ ఇచ్చారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *