– పాతికేళ్లుగా దేశానికి మోదీ అందిస్తున్న సేవలను పురస్కరించుకుని..
– బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్లపాటు నిరంతరాయంగా దేశానికి అందించిన విశిష్ట సేవలను పురస్కరించుకుని జాతీయ స్థాయిలో నెల రోజులపాటు ‘సేవా సంకల్ప్ అభియాన’ నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు వెల్లడించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ పన్నెండున్నరేళ్లు సీఎంగా, ఆపై మరో పన్నెండున్నరేళ్లు ప్రధానిగా మొత్తం 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారని ఆయన గుర్తుచేశారు. ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన మైలురాయి అని కొనియాడారు. బీజేపీ జాతీయ నాయకత్వ ఆదేశాల మేరకు ఈనెల 17న మోదీ జన్మదినం నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ చేపడుతున్నట్లు తెలిపారు. ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉన్నందున ఆ రోజు సాయంత్రం హైదరాబాద్లో ఆశీర్వాద్ కా దియా కార్యక్రమంతో ఈ అభియాన్ను ప్రారంభిస్తామని రామచందర్రావు తెలిపారు. మోదీ పాలన పట్ల కృతజ్ఞతగా ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కేంద్ర పథకాల లబ్దిదారులు ఇళ్లలో దీపాలు వెలిగించి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. రాజకీయ అంశాలకే పరిమితం కాకుండా కార్యకర్తల్లో సేవాభావాన్ని నింపడమే బీజేపీ ప్రత్యేకత అన్నారు. నెల రోజులపాటు రక్తదాన శిబిరాలు, స్వచ్ఛ భారత్, వ్యాసరచన పోటీలు, ‘మేరే సప్నో కా భారత’, ‘సేవా జ్యోతి కలశ్ యాత్ర’, ‘సుశాసన్ సేవా సంవాద్’ వంటి విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జన్ ధన్ యోజన ద్వారా 80 కోట్ల మంది పేదలకు బ్యాంకు ఖాతాలు అందించి డీబీటీ విధానంతో అవినీతి, దళారీ వ్యవస్థను రూపుమాపారని గుర్తు చేశారు. ఒకప్పుడు విమర్శలు చేసిన వారు ఆశ్చర్యపోయేలా నేడు ప్రపంచ యూపీఐ లావాదేవీల్లో భారత్ 41 శాతం వాటా సాధించిందని ఆయన తెలిపారు. దేశ జీడీపీ 7.8 శాతానికి చేరిందని, గతంలో 9.7 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణాన్ని 2.5 శాతానికి కట్టడి చేశామని చెప్పారు. విశ్వకర్మ యోజన ద్వారా చేతివృత్తుల వారికి రూ.లక్ష సాయం, పీఎం స్వనిధి ద్వారా దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోని సుమారు రెండు లక్షల మంది వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. కోవిడ్ సంక్షోభ సమయంలో వైద్యులకు రక్షణ చట్టం తేవడమే కాక స్వదేశీ వ్యాక్సిన్ను ఉచితంగా అందించి ప్రపంచ దేశాలకు కూడా ఎగుమతి చేసి ఆదుకున్న గొప్ప నాయకుడు మోదీ అని కొనియాడారు. హైవేలు, రైల్వేలు, ఎయిర్పోర్టుల వంటి మౌలిక వసతుల కల్పనతో వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతోందని, మోదీ 25 ఏళ్ల పాలనా విజయాలను ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస’ స్ఫూర్తితో ప్రతి గడపకూ తీసుకెళ్తామని రామచందర్రావు స్పష్టం చేశారు.
వికసిత భారత్ నిర్మాణంలో విద్యార్థులే కీలకం
– దిల్లీ పబ్లిక్ స్కూల్ యూత్ పార్లమెంట్లో రామచందర్ రావు
ప్రజాస్వామ్య దేవాలయాలైన చట్టసభలు దూషణల వేదికలుగా మారడం దురదృష్టకరమని, విద్యావంతులైన యువతరం రాజకీయాల్లోకి వచ్చినప్పుడే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు అన్నారు. నాచారం దిల్లీ పబ్లిక్ స్కూల్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రజాస్వామిక క్రమశిక్షణ, సభా మర్యాదలు, పరిణతి చెందిన విధివిధానాలు నేటి రాజకీయ నాయకులకు ఆదర్శనీయమని అభినందించారు. అసెంబ్లీ, పార్లమెంట్లలో ప్రజా సమస్యలపై అర్థవంతమైన చర్చలు జరగాలని, అధికార-విపక్షాలు పరస్పరం దూషణలకు పరిమితం కాకుండా ప్రజల గొంతుకగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. నేడు తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రభస, నిరాధార ఆరోపణలు, సభా ఔచిత్యాన్ని దెబ్బతీసే వైఖరికి ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలన్నారు. సేవాభావం, నైతిక విలువలు, ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న విద్యావంతులైన యువత రాజకీయాల్లోకి రావాలని రామచందర్రావు పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ విభిన్న మతాలు, కులాలు, భాషలతో కూడిన భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతోందని, మతం లేదా కులం పేరుతో సమాజాన్ని విభజించడాన్ని అందరూ వ్యతిరేకించాలన్నారు. నేడు మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, సుమారు 7.8 శాతం వృద్ధి రేటుతో ‘వికసిత భారత్’ దిశగా దూసుకుపోతోందని గుర్తు చేశారు. పేదల కష్టార్జితంతో చదువుకుని సమాజ శ్రేయస్సును విస్మరిస్తే దేశ ద్రోహమేనన్న స్వామి వివేకానందుడి మాటలను విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. సమాజం పట్ల బాధ్యతాయుతమైన నిజమైన దేశభక్తులుగా ఎదిగి వికసిత భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని రామచందర్ రావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





