సిగాచి యాజమాన్యం ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశామ్రికవాడలో సోమవారం జరిగిన తీవ్ర ప్రమాదంపై ఎట్టకేలకు సిగాచి రసాయన పరిశ్రమ యాజమాన్యం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామని ప్రకటించింది. సిగాచి ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ వివేక్ లేఖ రాశారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారంతోపాటు అన్నిరకాల బీమా క్లెయిమ్స్‌ను చెల్లిస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని, వారి కుటుంబ పోషణను తామే చూసుకుంటామని సిగాచి సెక్రటరీ తెలిపారు. ప్రమాదంలో 40 మంది మృతిచెందారని, మరో 33 మందికి గాయాలైనట్లు చెప్పారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ప్రమాదం నేపథ్యంలో మూడు నెలల వరకు ప్లాంట్ పనులు నిలిపివేస్తామని యాజమాన్యం ప్రకటించింది. కాగా, ప్రమాద స్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం పరిశీలించి సిగాచి కంపెనీపై కఠిన చర్యలు తీసుకుంటామని, మానవీయ కోణంలో మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ సొమ్మును కంపెనీ ద్వారా బాధితులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగి 48 గంటలు గడిచినప్పటికీ కంపెనీ ఎండీ ఘటనా స్థలికి రాకపోవడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలో బుధవారం సిగాచి కంపెనీ పత్రికా ప్రకటనను విడుదల చేయడం విశేషం.