నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
సరిగ్గా పదేళ్ల క్రితం మనం, అప్పటివరకు మనకు తెలియని ఒక కొత్త ప్రదేశంలోకి గొప్ప నిబద్ధతతో ప్రవేశించాం. అంతకుముందు దశాబ్దాలుగా అసలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించగలమా? అన్న సందిగ్ధంతో గడిపాం. మనం ఈ అభిప్రాయాన్ని సమూలంగా మార్చివేసి, భారతీయులు సాంకేతికతను చక్కగా ఉపయోగించు కోగలరన్నవిశ్వాసంతో ముందడుగు వేశాం. మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ధనిక, పేద అంతరాలను తొలగించడానికి సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాం.
మన ఉద్దేశం మంచిదైనప్పుడు, నవకల్పన తక్కువ సాధికారత కలిగినవారిలో సాధికారతను కలిగిస్తుంది. ఆవిధంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్లగలిగినప్పుడు నిరుపేదల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈ విశ్వాసమే డిజిటల్ ఇండియా పురుడు పోసుకోవడానికి దోహదం చేసింది. ఈ విధానంలో అందరికీ అన్నీ ప్రజాస్వామ్య బద్ధంగా అందుబాటులోకి వచ్చాయి. సమ్మిళిత డిజిటల్ మౌలిక సదుపాయాలతో పాటు అందరికీ సమానావకాశాలను కల్పించాయి.
2014లో ఇంటర్నెట్ వాడకం తక్కువ. డిజిటల్ అక్షరాస్యత కనిష్ట స్థాయిలో ఉండేది . ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ఇటువంటి పరిస్థితిలో ఇంతటి సువిశాల, వైవిధ్య పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో డిజిటల్ ఇండియా ఎంతవరకు సాధ్యమని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేవలం డ్యాష్‌బోర్డులతోనే కాదు, 140కోట్ల మంది ప్రజల జీవన విధానంలో వచ్చిన మార్పే దీనికి సమాధానం. పాలనాశైలి, అభ్యసనం, లావాదేవీల నిర్వహణ మరియు డిజిటల్ ఇండియాను ప్ర తిచోట నిర్మించుకున్నాం.
2014లో దేశంలో 250 మిలియన్ల ఇంటర్నెట్ కనెక్షన్లుండేవి. మరినేడు ఈ సంఖ్య 970 మిలియన్లకు చేరాయి! 4.2మిలియన్ కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్‌ను నిర్మించాం. ఇది భూమి, చంద్రుడి మధ్య దూరానికి 11 రెట్లు ఎక్కువ! ఇప్పుడు మారుమూల గ్రామాలకు కూడా ఇంటర్నెట్ సదుపాయం వచ్చింది. ఇక 5జికి మనం మారడం చాలా వేగంగా జరిగింది. కేవలం రెండేళ్ల కాలంలో 481000 బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయగలిగాం. పట్టణ ప్రాంతాలకు, సైనికపోస్టులు, గల్వాన్, సియాచిన్, లద్దాఖ్ ప్రాంతాలకు కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది.
వెన్నెముక లాంటి డిజిటల్ ఆధారంగా యూపీఐ వంటి వేదికల ద్వారా ప్రస్తుతం ఏటా 100 బిలియన్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ మొత్తంలో సగానికి సగం భారత్‌లో రియల్‌టైమ్ డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ (డీబీటీ) ద్వారా ఇప్పటివరకు రూ.44 ట్రిలియన్ల మొత్తాన్ని వివిధ లబ్దిదారుల ఖాతాల్లో జమచేయడం సాధ్యమైంది. దీనివల్ల రూ.3.48 ట్రిలియన్ల మేర దలారీల పరం కాకుండా కాపాడగలిగాం. స్వామిత్వ వంటి పథకాల ద్వారా దేశంలో 24 మిలియన్ల వ్యక్తిగత ఆస్తులకు సంబంధించిన కార్డులు అందజేశాం. దేశంలోని 647000 గ్రామాల మ్యాపింగ్ పూర్తయింది.
దేశంలోని డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఎంఎస్ ఎంఈలను స్థాపించిన పారిశ్రామిక వేత్తలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. మార్కెట్ కొనుగోళ్లు, అమ్మకం దార్లకు ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్‌డీసీ) విప్లవాత్మక రీతిలో అన్ని సమయాల్లో ఉపయోగపడుతోంది. గవర్నమెంట్ ఈ-మార్కెట్ ప్లేస్ (జీఈఎం) ద్వారా సామాన్యుడు తన వస్తువులను ప్రభుత్వానికి చెందిన వివిధ విభాగాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోగలడు. ఇది సామన్యుడికి దేశంలోని సువిశాల మార్కెట్లు అందుబాటులోకి రావడమే కాదు, ప్రభుత్వానికి కూడా ఖర్చు బాగా తగ్గుతుంది. బనారస్‌లోని చేనేత కార్మికుల నుంచి నాగాలాండ్‌లోని వెదురు ఉత్పత్తుల కళాకారులు తమ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా అమ్ముకోగలుగుతున్నారు. విశేషమేమంటే ఈ లావాదేవీల్లో ఎటువంటి దలారీల ప్రమేయం ఉండదు . భారత్‌కు చెందిన డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాష్ట్రక్చర్ (డీపీఐ)లో భాగమైన ఆధార్, కోవిన్, డిజిలాకర్, ఫాస్ట్‌టాగ్, పి.ఎం-వాణి, వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్ వంటివి ప్రపంచ దేశాలు అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సినేషన్ ద్వారా 2200 మిలియన్ క్యుఆర్ కోడ్‌ల సహాయంతో ధ్రువీకరణ పత్రాలను అందించడం జరిగింది. ప్రస్తుతం డిజిలాకర్‌ను 540మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. ఇందులో 7750 మిలియన్ల డాక్యుమెంట్లు భద్రంగా ఉండటం విశేషం.
జీ20దేశాల అధ్యక్షత వహించిన సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా డీపీఐలను భద్రపరచుకునే సురక్షిత ప్రదేశాన్ని ఏర్పాటు చేశాం. అంతేకాదు 25 మిలియన్ డాలర్ల సోషల్ ఇంపాక్ట్ ఫండ్‌ను ఏర్పాటు చేసి ఆఫ్రికా, దక్షిణాసియా దేశాలకు సహాయం చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచంలో పెద్ద సంఖ్యలో స్టార్టప్‌ల ఎకో సిస్టమ్ కలిగిన మూడు దేశాల్లో భారత్ కూడా ఒకటి. ప్రస్తుతం మనదేశంలో 180000 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. 1.2 బిలియన్ డాలర్లతో బారత్ ఏఐ మిషన్ పనిచేస్తున్నది. దీని సహాయంతో ప్రపంచ వ్యాప్తంగా 34వేల జీపీయూలను అనుసంధానించగలిగింది. ఫలితంగా కేవలం గంట జీపీయూ వినియోగానికి 1 డాలర్ మాత్రమే చార్జ్ చేస్తోంది. ఇది మిగిలిన ప్రపంచ దేశాలకంటే చాలా తక్కువ ఫీజు కావడం గమనార్షం. భారత్ తన తొలి ఏఐతో మొత్తం మానవాళికే ఛాంపియన్‌గా నిలిచింది. ఏఐపై న్యూదిల్లీ డిక్లరేషన్ నవకల్పనలకు, జవాబుదారీతనానికి ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా మనం ఏఐ సెంటర్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది మరింత పరిణామాత్మకంగా ఉండబోతున్నది. ప్రస్తుత డిజిటల్ గవర్నెన్స్ నుంచి గ్లోబల్ డిజిటల్ లీడర్‌షిప్ వైపు మనం ప్రయాణం సాగిస్తున్నాం. అంటే ఇండియా ఫస్ట్ నుంచి మన ప్రస్థానం ఇండియా ఫర్ ది వరల్డ్ వైపునకు కొనసాగనున్నది. డిజిటల్ ఇండియా అనేది ఇక ఎంతోకాలం ప్రభుత్వ కార్యక్రమంగా ఉండబోదు. ఇదొక ప్రజా ఉద్యమంగా మారనున్నది. ఇది ఆత్మనిర్భర్ భారత్‌కు దోహదం చేయడమే కాకుండా ప్రపంచంలో భారత్‌ను ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలపనున్నది.
సృజనశీలురు, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, ఉజ్వల భవిష్యత్తు కోసం కలలుగనేవారికి ఒక్కటే చెప్పదలచుకున్నా. ఈ ప్రపంచం మరో డిజిటల్ మైలురాయిని కోరుతోంది.
మన సాధికారతను నిర్మించుకుందాం
వాస్తవిక అంశాలను మాత్రమే పరిష్కరిద్దాం
సాంకేతిక పరిజ్ఞానం మనందరిని ఒక్కతాటిమీదకు తీసుకొస్తుంది.
-‘మింట్’ సౌజన్యంతో