– ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి అమలుకు కలెక్టర్లే మార్గదర్శకులు
– 8 జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ మంత్రి పొంగులేటి సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 2: రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం దార్శనికతతో తీసుకొచ్చిన భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సమర్ధవంతంగా అమలు చేసి వాటి ఫలితాలు పేదలకు అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ రెండు పధకాలను విజయవంతంగా అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లు నిరంతరం శ్రమించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో నిర్మల్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, వనపర్తి జిల్లాల కలెక్టర్లతో భూభారతి, ఇందిరమ్మ ఇండ్లపై బుధవారం సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడితే స్వరాష్ట్రంలో గత పదేళ్లలో ఎదుర్కొన్న భూ సమస్యలకు విముక్తి లభిస్తుందని, సొంతింటి కల నెరవేరుతుందని ప్రజానీకం అత్యంత విశ్వాసంతో తమకు అధికారం అప్పగించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా భూభారతి చట్టానికి, అలాగే ఇందిరమ్మ ఇండ్ల పధకానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ చట్టం ఫలితాలు ప్రతి పేదవానికి అందినప్పుడే చట్టం సార్ధకత నెరవేరుతుందన్నారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, రెవెన్యూ కార్యాలయానికి వచ్చే సామాన్యుడు సైతం సంతోషపడేలా రెవెన్యూ యంత్రాంగం పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులున్నా దాని ప్రభావం ఇందిరమ్మ ఇండ్లపై పడకుండా ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. మీరు చేయాల్సింది లబ్దిదారుల ఎంపిక, ఇండ్ల మంజూరు, నిర్మాణ పనుల పర్యవేక్షణ.. ఈ మూడిరటినీ పకడ్బందీగా పర్యవేక్షించాలని, క్షేత్రస్ధాయిలో పర్యటించి ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అనర్హులని తేలితే ఇంటి నిర్మాణం మధ్యలో ఉన్నా రద్దు చేయడానికి వెనుకాడవద్దని, ప్రతి ఇల్లు అర్హులకే అందాలని, ప్రభుత్వం ఒక్కో ఇంటికి ఉచితంగా అందిస్తున్న 40 మెట్రిక్ టన్నుల ఇసుక కచ్చితంగా అందేలా పర్యవేక్షించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు.