‘నీట్’ కొత్త షెడ్యూల్ విడుదల

– జూన్ 21న పరీక్ష నిర్వహణ
– వివరాలు వెల్లడించిన ఎన్‌టీఏ

న్యూదిల్లీ, మే 15: రద్దయిన ‘నీట్’ యూజీ 2026ను మళ్లీ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. జూన్ 21న ఆదివారం ఈ పరీక్ష జరగనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) శుక్రవారం వెల్లడించింది. ఈ మేరకు తమ ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్ చేసింది. రీఎగ్జామ్‌కు సంబంధించి అధికారిక మార్గాల్లో వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని విద్యార్థులను కోరింది. హాల్‌టికెట్, ఇతరత్రా వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో ఈనెల 3న ‘నీట్`యూజీ జరిగింది. అయితే కొన్నిచోట్ల ప్రశ్నపత్రాలు లీకయ్యాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, రీఎగ్జామ్‌క” మరోసారి దరఖాస్తు చేసుకోనక్కర్లేదని, ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఇదిలాఉండగా పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు కీలక నిందితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. రాజస్థాన్‌లోని సికార్‌లో ఈ లీకేజీ వ్యవహారం బయటపడింది. మహారాష్ట్రలోని నాసిక్ నుంచి ప్రశ్నపత్నం లీక్ అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అక్కడినుంచి రాజస్థాన్, హరియాణా, జమ్ముకశ్మీర్, కేరళ సహా పలు రాష్ట్రాలకు చేరినట్లు దర్యాప్తులో తేలింది. ఈ పేపర్ కోసం విద్యార్థుల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.

వచ్చే ఏడాది ఆన్‌లైన్‌లో : కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 

న్యూదిల్లీ, మే 15 : వచ్చే ఏడాది నుంచి ‘నీట్’ను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పేపర్ లీక్‌తో ఈనెల 3న నిర్వహించిన ‘ నీట్’ను రద్దు చేసి జూన్ 21న మళ్లీ పరీక్షను నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ శుక్రవారం వెల్లడించిన నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రశ్నపత్రం లీక్ ఆరోపణలపై విచారణకు ఆదేశించాం.. ఇప్పటికే ఈ కేసును సీబీఐ విచారిస్తోంది.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.. వారు నష్టపోకూడదనే పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహిస్తున్నాం’ అని వివరించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండేలా చూడటమే తమ మొదటి లక్ష్యం.. పరీక్ష పారదర్శకంగా నిర్వహించడమే తమ ప్రధాన కర్తవ్యం అన్నారు. ఏటా కోటి మందికి ఎన్టీఏ పరీక్షలు నిర్వహిస్తోందని, పేపర్ ఎలా లీక్ అయింది.. ఎవరి నుంచి ఎక్కడికి వెళ్లిందన్న పూర్తి వివరాలు త్వరలో బహిర్గతమవుతాయని చెప్పారు. ఈసారి ఎలాంటి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూస్తామంటూ రీటెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువు ఇస్తున్నామన్నారు. జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని, మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న వార్తలతో  విద్యార్థులు ఆందోళన చెందొద్దని ధర్మేంద్ర విజ్ఞప్తి చేశారు.

గతేడాది కూడా లీక్ : లీక్ పేపర్లతో ప్రభుత్వ వైద్య కళాళాలల్లో సీట్లు

‘నీట్’ 2026 పరీక్ష పత్రం లీకేజీపై దృష్టిపెట్టిన అధికారులకు గతేడాది లీక్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. కీలక నిందితుడైన వికాస్ బివాల్ గతేడాది యశ్ యాదవ్ నుంచి ‘నీట’ ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్లు సీబీఐ అనుమానిస్తున్నది. దీంతో ఈ యేడాది కూడా యశ్ నుంచే వికాస్ ఈ పేపర్‌ను కొన్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో యశ్ తండ్రి మంగిలాల్ బివాల్, అంకుల్ దినేశ్ బివాల్ హస్తం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. వికాస్ అతడి సోదరిలు ప్రగతి, కజిన్స్ సానియా, గుంజన్, పలాక్‌లు కూడా గతేడాది వైద్య విద్య సీట్లు పొందారు. వీరంతా లీకైన పేపర్ సాయంతోనే సీట్లు సాధించినట్లు తెలుస్తోంది. వికాస్‌కు పదో తరగతిలో 63శాతం, 12వ తరగతిలో 55శాతం మార్కులు వచ్చాయి. ఇక 2024లో ‘నీట్’ రాస్తే కేవలం 720కి గాను 240తో సరిపెట్టుకున్నాడు. సికార్‌లోని ఓ కోచింగ్ సెంటర్‌లో 46 పరీక్షలు రాస్తే సగటున 384 మార్కులు వచ్చాయి. కానీ, 2025లో మాత్రం 85.11 పర్సెంటైల్‌తో గవర్నమెంట్ కాలేజీలో సీటు సాధించడం విశేషం. ఇక ఆయన సోదరి ప్రగతికి 10వ తరగతిలో 69శాతం, 12వ తరగతిలో 91శాతం మార్కులు వచ్చాయి. 2024 ‘నీట్‌’లో 720కి 355 మార్కులే వచ్చాయి. కానీ, సికార్‌లోని కోచింగ్ సెంటర్‌లో 50 నమూనా పరీక్షలు రాస్తే ఏనాడూ 320` 342 మార్కులు దాటలేదు. కానీ 2025లో హఠాత్తుగా 92.53 పర్సంటైల్‌తో ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు వచ్చింది. ఇక మరో కజిన్ సోనియా 2024 ‘నీట్’లో 320 మార్కులతో సరిపెట్టుకొంది. సికార్‌లోని కోచింగ్ సెంటర్‌లో 49 మాక్‌టెస్ట్‌లు రాస్తే 341`361 మధ్యే మార్కులు వచ్చాయి. అదే ‘నీట’ రాస్తే మాత్రం అలవోకగా 94.07 పర్సంటైల్‌తో ప్రభుత్వ కాలేజీలో సీటు పొందింది. ఇక పలాక్‌కు 10వ తరగతిలో 93 శాతం, 12వ తరగతిలో 89 శాతం మార్కులు వచ్చాయి. 2024 ‘నీట్’ లో 512 మార్కులు మాత్రమే సాధించింది. సికార్‌లోని కోచింగ్ సెంటర్లలో నిర్వహించిన 50 నమూనా పరీక్షల్లో ఆమెకు ఏనాడూ 515`550 మార్కులు దాటలేదు. కానీ, 2025 ‘నీట’లో 98.61 పర్సంటైల్‌తో జైపూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. ఇప్ప్పుడు అదే కుటుంబంలోని రిషి కోసం పేపర్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతడు 10వ తరగతిలో 43శాతం, 12వ తరగతిలో గ్రేస్ మార్కులు 50శాతం సాధించాడు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *