జయంత్యుత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 4: స్వపక్షాన్నే కాదు విపక్షాన్ని సైతం మెప్పించి అందరి మన్ననలు పొందిన గొప్ప నాయకుడు కొణిజేటి రోశయ్య అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనదని, అలాంటి మహానేత విగ్రహాన్ని ఈరోజు లక్డీకాపూల్‌లో ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని, ఇది ఆయనకు మనమిచ్చే గొప్ప గౌరవం అని అన్నారు. కొణిజేటి రోశయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జరిగిన ఆయన 92జయంత్యుత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పదవుల కోసం ఆయన ఎెప్పుడూ వెంపర్లాడలేదని, పదవులే ఆయన దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాయని, సామాన్య కార్యకర్తగా రాజకీయ రంగప్రవేశం చేసి స్వశక్తితో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ వాంటి పదవులను చేపట్టి వాటికే వన్నె తెచ్చారన్నారు. వాక్పటిమ, నిరంతర అధ్యయనం, పరిపాలనా సామర్థ్యం, పార్టీ పట్ల విధేయత వంటి సద్గుణాలే ఆయన రాజకీయ జీవితానికి వన్నె తెచ్చాయనటంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు. 16సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత ఆయనదని, చివరి క్షణం వరకూ ప్రజల కోసమే తపించారని, నిరంతర అధ్యయనంతో ప్రజల సమస్యలపై వారి గొంతుకగా పాలకపక్షాలను ప్రశ్నించేవారని తెలిపారు. ఆయన ప్రసంగాలు తమకు పాఠాలని, ఆయన కేబినెట్‌లో తాను మంత్రిగా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త కూడా. రోశయ్యను స్ఫూర్తిగా తీసుకొని రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని శ్రీధర్‌బాబు చెప్పారు. కాగా, అంతకుముందు అసెంబ్లీ మెంబర్స్ లాంజ్‌లో దొడ్డి కొమరయ్య, కొణిజేటి రోశయ్యలకు మంత్రి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.