22ఎ తొలగించేదాకా కలెక్టరేట్ ఎదుట వంటావార్పు

– పటాన్‌చెరులోనే లక్ష ఇళ్లు, 50 వేల ఎకరాలు 22ఎలో..
– రేవంత్, పొంగులేటి ఆస్తులు జాబితా నుంచి ఎలా తీశారు
– పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి
– వారంలో సమస్య పరిష్కరించకపోతే సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి
– బీఆర్ఎస్ నేత హరీష్ రావు హెచ్చరిక

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్టు 29 : పిచ్చోడి చేతిలో రాయిలాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తయారైందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు మండిపడ్డారు. ఈరోజు 22ఎ బాధితుల కన్నీళ్లు చూస్తుంటే రాష్ట్రంలో ఏం జరుగుతున్నదో అర్థమవుతోందన్నారు. 1980లో లేఅవుట్ చేసి 46 ఏళ్లుగా కాలనీల్లో ఇళ్లు కట్టుకుని నివసిస్తుంటే ఇప్పుడు వాటిని నిషేధిత జాబితాలో పెట్టి పిల్లల పెళ్లిళ్లు, చదువులు ఆపేస్తున్నారు.. బ్యాంక్ లోన్లు రాకుండా చేస్తున్నారు.. ఇల్లంటే ఒక మనిషి జీవితకాల కల. పైసా పైసా కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారు.. హుడా, మున్సిపల్ పర్మిషన్లు, కరెంట్, నల్లా కనెక్షన్లు ఇచ్చి టాక్స్‌లు వసూలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీ ఆస్తులు 22ఎలో ఉన్నాయని ఇళ్లను కూల్చేయడం దుర్మార్గమని అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలో శనివారం సాయంత్రం జరిగిన 22ఎ భూముల బాధితుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. సమావేశంలో బాధితులు తమ ఆవేదనను హరీష్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను కూలగొడుతున్నారని, రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయని, లంచాలు ఇవ్వాలని ఎమ్మార్వోలు బెదిరిస్తున్నారని వాపోయారు. సింఫోని కాలనీ, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల బాధితుల కన్నీటి గోసను విన్న హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటిల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ఎమ్మార్వో ఏకంగా రూ.2 కోట్ల లంచం అడిగాడని, హైకోర్టు అక్షింతలు వేసినా పట్టించుకోకుండా ఇల్లు కూలగొట్టి తనను రోడ్డున పడేశారని ఇక్కడ ఓ బాధితుడు కన్నీరుమున్నీరుగా చెబుతుంటే ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్లైనా లేదా అని అడిగారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో రాష్ట్రాన్ని పెట్టి రాహుల్ గాంధీ దిల్లీ నుంచి చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. రేవంత్ పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు ఏమాత్రం రక్షణ లేదన్నారు. ఒక్క పటాన్ చెరువులోనే అపార్టుమెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇళ్లు కలిపి దాదాపు లక్ష ఇండ్లను 22ఎ జాబితాలో పెట్టారు.. గుమ్మడిదలలో 12,432 ఎకరాలు, అమీన్‌పూర్‌లో 3,200 ఎకరాలు, రామచంద్రాపురంలో 8,300 ఎకరాలు, పటాన్ చెరువులో 12,300 ఎకరాలు, జిన్నారంలో 13,900 ఎకరాలు.. ఇలా మొత్తం ఐదు మండలాల్లో కలిపి 50,565 ఎకరాల ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. పటాన్‌చెరు అంటేనే మధ్యతరగతి, పేదలు, చిరుద్యోగులు ఉండే ప్రాంతం.. ఏ పాపం తెలియని వీరి మీద కాంగ్రెస్ ఎందుకు ఇంత కక్ష సాధింపులకు పాల్పడుతోంది అని ప్రశ్నించారు. ఈ దుర్మార్గం కేవలం పటాన్‌చెరుకే పరిమితం కాలేదు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కుత్బుల్లాపూర్, మలక్‌పేట, ఉప్పల్.. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ప్రాంతానికి వెళ్లినా లక్షల ఆస్తులను 22ఎలో పెట్టారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు కూడా 22ఎ నిషేధిత జాబితాలోనే పడ్డాయి. ఆ విషయం తాను బయటపెట్టగానే ఎలాంటి అప్లికేషన్ లేకుండా రాత్రికిరాత్రే వాళ్ళ ఇళ్లను జాబితా నుంచి ఎలా తొలగించారు అని ప్రశ్నించారు. మీకు అధికార బలంతో ఆస్తులను కాపాడుకునే ప్రత్యేక చట్టం ఉందా అని అడిగారు. దరఖాస్తు పెట్టకుండా మీ ఆస్తులను ఎలా తీశారో.. అదే విధంగా లక్షలాదిమంది సామాన్యుల ఆస్తులను ఎందుకు 22ఎ నుంచి తీయడం లేదో రేవంత్ రెడ్డి, పొంగులేటి సమాధానం చెప్పాలి అన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి కాదు.. ఆయన ప్రజలను లూటీ చేసే పొంగులూటి. 98 శాతం 22ఎ సమస్యను పరిష్కరించామని బొంకుతున్నారు.. 98 శాతం జాబితా నుంచి తీసేసినట్లయితే ఒక్క పటాన్‌చెరులోనే ఇంకా 50వేల ఎకరాలు, లక్షల ఇళ్లు నిషేధిత జాబితాలో ఎందుకున్నాయ్ మిస్టర్ బొంకులేటి అని ప్రశ్నించారు. తప్పు మంత్రి పొంగులేటి చేస్తే శిక్ష ప్రజలు ఎందుకు అనుభవించాలి అన్నారు. రేవంత్ రెడ్డి గారూ.. ఈ 22ఎ దందాలో మీకు సంబంధం లేకపోతే వెంటనే పొంగులేటిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు. ఒకవేళ అధికారులే పొరపాటు చేశారనుకుంటే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. అమీన్‌పూర్‌కు తాగునీరు రావడం లేదని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అడగ్గానే పైప్‌లైన్ వేయించి ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దన్నారు. ఐటీఐ కావాలన్నా, పాలిటెక్నిక్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలన్నా మంజూరు చేశామన్నారు. రేవంత్ రెడ్డి కేవలం భూముల చుట్టూనే తిరుగుతాడన్నారు. కేసీఆర్ పేదలకు ఇండ్ల స్థలాలు ఇస్తే రేవంత్ రెడ్డి వాళ్ల ఇళ్లను కూలగొట్టి రోడ్డున పడేస్తున్నాడని ఆరోపించారు. వారంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి 50 వేల ఎకరాల నిషేధిత జాబితాను మీకు పంపిస్తారు.. వాటిని 22ఎ నుంచి బేషరతుగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం.. లేదంటే 50 వేల ఎకరాల రైతులు, లక్షల ఇండ్లవాసులను కలుపుకుని ఎమ్మెల్యే, నాయకులతో కలిసి బీఆరఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.. వంటావార్పు చేసి అక్కడే బైఠాయిస్తామని హరీష్‌రావు కలెక్టర్‌ను హెచ్చరించారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదర్శ్‌రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, 22ఎ బాధిత కుటుంబీకులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *