నియంతలా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి

– ప్రజా సమస్యలు వదిలేసి ప్రశ్నించే వారిపై కేసులు
– బీఆర్ఎస్ నేత హరీష్‌రావు ధ్వజం
– కంది సెంట్రల్ జైలులో పార్టీ నాయకుడు క్రిశాంక్‌కు పరామర్శ

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులు, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, సిట్లు, కమిషన్లు వేస్తూ అణచివేసే కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా కంది సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌తో పాటు మరో ఏడుగురు కార్యకర్తలను ఆయన మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలతోపాటు ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్యం కల్పిస్తామని చెప్పి నేడు నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ నాయకత్వంపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారి గురించి పోలీసులకు ఆధారాలతో ఫోన్ అప్పగించి క్రిశాంక్ ఫిర్యాదు చేస్తే తప్పు చేసిన వారిని వదిలేసి ఫిర్యాదు చేసిన క్రిశాంక్‌నే అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి రెండు బాధ్యతలూ మీరే పెట్టుకుని ఇలాంటి అరాచకాలకు పాల్పడతారా రేవంత్ రెడ్డీ.. ఇదేనా మీ ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. క్రిశాంక్‌పై నాన్ బెయిలబుల్ కేసులు ఎలా పెడతారని సాక్షాత్తూ మెజిస్ట్రేట్ పోలీసులను ప్రశ్నించారంటే మీ కక్షసాధింపు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. అంగన్వాడీ ఫోన్ల కుంభకోణం, టెన్త్ పేపర్ లీక్, హెచ్‌సీయూ గచ్చిబౌలి భూములు, సోమ్ డిస్టిలరీస్ వ్యవహారం, మిస్ వరల్డ్ పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ వివాదం.. ఇలా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకే ఆయనపై వరుసగా కేసులు పెట్టారని పేర్కొన్నారు. భారత పౌరులకు ప్రశ్నించే హక్కు లేదా.. లగచర్లలో గిరిజనుల పైనా, మెదక్, సంగారెడ్డిలో తమ నాయకులపైనా అక్రమ కేసులు బనాయించారు. రేవంత్ రెడ్డి ఇలా కేసులు పెట్టి మళ్లీ గెలుస్తాననుకుంటే అది హిట్లర్‌ను మించిన మూర్ఖత్వమే అవుతుందని అన్నారు. మీ అరాచకాలను గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. బెంగళూరు నుంచి ప్రైవేట్ హ్యాకర్లను తెచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కూర్చోబెట్టారని, ప్రతిరోజూ బీఆరఎస్ నేతల ఫోన్లను, తమ ఇళ్ల ముందున్న సీసీ కెమెరాలను చట్టవ్యతిరేకంగా హ్యాక్ చేస్తున్నారని హరీష్‌రావు ఆరోపించారు. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి.. తాము అధికారంలోకి వచ్చాక రిటైర్ అయినా సరే మిమ్మల్ని ఎక్కడున్నా వదిలిపెట్టం.. కచ్చితంగా విచారణ జరిపిస్తాం. .చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న ఐపీఎస్ అధికారులకు తగిన మూల్యం తప్పదు.. కాబట్టి చట్టానికి లోబడి పనిచేయండి అని హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ.. చేతలు తక్కువ అన్నారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ చాలదన్నట్టు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో వంద కోట్లతో కొత్త ప్యాలెస్ కట్టుకుంటున్నావు.. నీ పాలనలో సగం కాలం పూర్తయింది.. మిగిలిన సగం కాలమైనా ప్రజలకు ఏదైనా మేలు చేసే ప్రయత్నం చెయ్ అని హితవు పలికారు. రైతులు 20 రోజులుగా కొనుగోలు కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తుంటే శనగలు, పొద్దుతిరుగుడు కొనే నాథుడే లేడు. మీ మంత్రులు నిద్రపోతున్నారా.. మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తోంది.. అని ఆయన నిలదీశారు. ఎకరాకు 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని మక్కలకు కొత్త షరతులు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. 13 లక్షల ఎకరాల్లో పంట వస్తే కనీసం సగం కూడా కొనలేని దుస్థితిలో ఉన్నారన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. వడ్లకు ఐదారు కిలోల తరుగు తీస్తున్నారు. తరుగు పెడితే తోలు తీస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెవరి తోలు తీస్తాడో చెప్పాలన్నారు. మిల్లుల ముందు లారీలు నాలుగైదు రోజులుగా ఆగిపోతున్నాయి. యాసంగి సన్న వడ్లకు బోనస్ ఇస్తావా.. ఇవ్వవా స్పష్టం చెయ్.. ఇవ్వలేకపోతే తప్పుకో లేదా జరిగింది చెప్పుకో.. ఏ సంగతీ చెప్పకుండా రైతులను మోసం చేయొద్దు అని అన్నారు. ఎండలో రైతులు మాడిపోతుంటే పట్టించుకునే తెలివి లేదా.. రైతుల కష్టాలు మీకు పట్టవా.. అని అడిగారు. ఇప్పటికైనా అక్రమ కేసులు బంద్ చేసి ఆరు గ్యారంటీల అమలు గురించి ఆలోచించు.. ప్రజలు మెచ్చే పాలన అందించు.. క్రిశాంక్‌పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి.. మళ్లీ పీటీ వారెంట్లు వేసి ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకోం అని హరీష్‌రావు హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *