బిసిలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి
ఫిబ్రవరి 11 ప్రామిస్ డే హామీలను నెరవేర్చాలి
మాట నిలబెట్టుకోవడం రేవంత్‌రెడ్డికి చేతకాదు
సిఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే హరీష్‌రావు ఫైర్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11: బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు డిమాండ్ చేశారు. మంగళవారం సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని కోనాయిపల్లిలో భక్తి శ్రద్ధలతో పద్మావతి గోదా సమేత వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..
బిసిలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాకే ఎన్నికలకు వెళ్లాడంతో పాటు ఫిబ్రవరి 11 ప్రామిస్ డే అని. ప్రామిస్ డే సందర్భంగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ప్రభుత్వాధినేత రేవంత్‌రెడ్డిని హరీష్‌రావు డిమాండ్ చేశారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదనే ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యాన, దిల్లీ రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తు చిత్తుగా వోడిరచారన్నారు. తెలంగాణ, కర్ణాకటలో ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే ఈ రెండు రాష్ట్రాల ప్రజలు వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిరచడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
చబ్బీస్ జనవరికి రైతు భరోసా, ఇందిరమ్మ భరోసా ఇస్తామన్నారు. కానీ, ఇప్పటివరకు పది పైసల మంది కూడా అందలేదన్నారు. దేవుళ్ల మీద ఒట్టు పెట్టి పంద్రాగస్టు కల్లా రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట ఇచ్చి మోసం చేశాడనీ, మాట తప్పడం తప్ప మాట నిలబెట్టుకోవడం రేవంత్ రెడ్డికి చేతకాదని మండిపడ్డారు. కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందనీ, కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన ఆలయం కోనాయిపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఈ ఆలయం నుంచే ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ ఏ ముఖ్య కార్యక్రమాన్ని అయినా ఈ కోనాయిపల్లి ఆలయం నుంచి ప్రారంభిస్తారనీ, కేసీఆర్ ఈ ఆలయం అంటే అంత ఇష్టమన్నారు.
ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఆలయానికి వొచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.3.60 కోట్లతో కోనాయిపల్లి ఆలయాన్ని అభివృద్ధి చేశాడనీ, రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను కేసీఆర్ అభివృద్ధి పర్చాడన్నారు. సిద్ధిపేట జిల్లాలో 75కోట్లతో అనేక దేవాలయాలను అభివృద్ధి చేశాడనీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వొచినప్పటి నుండి దేవాలయాలకు నిధులు విడుదల చేయడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి పూర్వ వైభవం వొచ్చే విధంగా చూడాలని వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగిందని ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. ఆయన వెంట బిఆర్‌ఎస్ నాయకులు దువ్వల మల్లయ్య, జాప శ్రీకాంత్‌రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, కోల రమేష్‌గౌడ్, గుండు భూపేష్, మోహన్‌లాల్, నిమ్మ రజనీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.





