కాంగ్రెస్‌వి మత ఆధారిత ఓటు బ్యాంకు రాజకీయాలు

– ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌లే ఇందుకు నిద‌ర్శ‌నం
– ఓట్ల కోసం మతప్రాతిపదికన మంత్రి పదవులా?
– మండిపడ్డ బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలు సంతుష్టీకరణ రాజకీయాల, కాంగ్రెస్‌ పార్టీ విభజనాత్మక రాజకీయాల అసలు ముఖాన్ని బట్టబయలు చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు దుయ్యబట్టారు. ముస్లింలకు గౌరవం ఉందా అంటే అది కాంగ్రెస్‌ వల్లేనని, కాంగ్రెస్‌ లేకుంటే ముస్లింలకు దిక్కులేదు అనే సీఎం వ్యాఖ్యలతో కాంగ్రెస్‌ పార్టీ మతాధారిత ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే నమ్ముతుందని మరోసారి స్పష్టమైందన్నారు. అభివృద్ధి, పాలన, ప్రజాసేవపై చర్చించడానికి బదులు సమాజాన్ని మతం పేరుతో విభజించి రాజకీయ లాభం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 20 శాతం ముస్లింల ఓట్ల కోసం 80 శాతం హిందువుల భావాలను నిర్లక్ష్యం చేయడం, దీన్ని సెక్యులరిజం అని చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. మంత్రి పదవులు సైతం ఎన్నికల్లో లాభం కోసం మతప్రాతిపదికన పంచడం సిగ్గుచేటన్నారు. ఆ సమాజానికి నిజమైన న్యాయం చేయాలంటే విద్య, ఉపాధి, ఆర్థిక అవకాశాల దిశగా చర్యలు తీసుకోవాలి.. కానీ కాంగ్రెస్‌ మాత్రం వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిందన్నారు. రేవంత్‌ రెడ్డి గారూ.. మీకు, మీ పార్టీకి ముస్లింల ఓట్లు మాత్రమే కావాలనుకుంటే హిందువుల ఓట్లు అవసరం లేదని బహిరంగంగా చెప్పే ధైర్యం చేయగలరా అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే రేషన్‌ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయోజనాలు రద్దు చేస్తామన్న బెదిరింపులు ప్రజాస్వామ్యానికి అవమానకరమని, ప్రజల స్వేచ్ఛను దెబ్బతీసే ప్రయత్నమేనని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌, కేటీఆర్‌లపై ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు, ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ కేసు ఏమైంది.. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్‌ఎస్‌ నాయకులను రక్షించడమే రేవంత్‌ రెడ్డి బాధ్యతా.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కేటీఆర్‌ను అరెస్టు చేయకుండా ఎందుకు వెనుకడుగు వేస్తున్నట్లు.. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు సహా బీఆర్‌ఎస్‌ కాలంలో ఉన్న ముఖ్య అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. ఈ నిశ్శబ్దం వెనుక ఏ ఒప్పందం దాగి ఉందని రామచందర్‌రావు ప్రశ్నించారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌, ఇప్పుడు కాంగ్రెస్‌ రాష్ట్రాన్ని దోచుకుని నింద మాత్రం బీజేపీపై మోపుతున్నాయన్నారు. కాళేశ్వరం కేసును ఏడాదిన్నరపాటు సాగదీసి కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా వ్యవహరించిన రేవంత్‌ సర్కారు అసలు ఉద్దేశం ఏమిటన్నారు. ఆనాడు ఓటుకు నోటు కేసులో తనను కాపాడినట్లే ఇప్పుడు రేవంత్‌ సర్కారు బీఆర్‌ఎస్‌ను అనేక కేసుల నుంచి తప్పిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రజలతో ఉంది.. యావత్‌ జాతిని, సమాజాన్ని ఏకీకృతం చేసే శక్తిగా నిలుస్తుంది. ఉప ఎన్నికలో మాదే విజయం.. బీజేపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు అని రామచందర్‌రావు స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page