– ఓర్వలేకే మాపై ప్రతిపక్షాల విమర్శలు
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా నెరవేరుస్తామని, ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆందోళనకు గురికావొద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అత్యధిక మెజారిటీతో నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరుతూ ఎల్లారెడ్డిగూడ, కమలాపురి కాలనీ, ఇమాంగూడ, జయప్రకాష్ నగర్, తవాక్కల్ నగర్, అలీ నగర్ తదితర ప్రాంతాల్లో బుధవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమంటూ ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఇంటింటికీ తిరిగి వివరించారు. తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగులను గాలికొదిలేసిన బీఆర్‌ఎస్ నేతలు ఈ ఉప ఎన్నికలో లబ్దిపొందేందుకు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు లక్షలాదిమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంటే అది చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి అజెండాగా ముందుకు సాగుతున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా నిలవాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





