– 13మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
– ప్రజల ఆకాంక్షలకనుగుణంగా పనిచేయాలి
– రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకనుగుణంగా రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ వ్యవస్ధలో విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిప్యూటీ కలెక్టర్ల నుంచి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి పొందిన 13మంది అధికారులు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో మంత్రి పొంగులేటిని బుధవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆశలు, ఆకాంక్షలకనుగుణంగా తమ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు క్షేత్రస్ధాయిలో పకడ్బందీగా అమలు చేయాలని, అప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అన్నారు. సాదాబైనామాల దరఖాస్తుల పరిష్కారానికి భూభారతి చట్టంలో స్పష్టమైన నిబంధనలను రూపొందించామని, దీనికి అనుగుణంగా సాదాబైనామా దరఖాస్తులను వీలైనంత త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గత ప్రభుత్వంలో సాదా బైనామాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు కానీ 2020 ఆర్వోఆర్ చట్టంలో పరిష్కారం చూపలేదని, ఫలితంగా 9.26 లక్షల దరఖాస్తులు పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించగా స్టే విధించిందని, ఇటీవలే స్టేను కోర్టు తొలగించిందని చెప్పారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని, రెవెన్యూ విభాగంలో వీలైనంతవరకూ అన్ని కేడర్లలో పదోన్నతులు కల్పించినట్లు చెప్పారు. పదోన్నతులు పొందినవారు ప్రజలతో మమేకమై రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని మంత్రి పొంగులేటి సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





