శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మే

-చ‌ర్చ‌లే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం
-చ‌ర్చ‌ల‌కు ప్ర‌భుత్వం సుముఖ‌మా? క‌దా?
-ఆప‌రేష‌న్ క‌గార్ నిలిపేయాలి
– మావోయిస్టు పార్టీ కేంద్ర ప్ర‌తినిధి అభ‌య్‌

భద్రాచలం,ప్రజాతంత్ర,మే 14 : శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యలను పరిష్కరించడానికి త‌మ‌ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధమేన‌ని ప్రధానని మోదీ  ప్రభుత్వం ఇందుకు సుముఖమా, కాదా, స్పష్టం చేయాల‌ని మావోయిస్టు పార్టీ కేంద్రఅధికార ప్రతినిధి అభయ్ ఒక లేఖ‌లో కోరారు. గ‌త ఏప్రిల్ 25న కాల్పుల విర‌మ‌ణ పై తాను చేసిన ప్ర‌క‌ట‌న‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి సానుకూల స్పంద‌న రావడాన్ని ఆహ్వానించారు. అయితే కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గానీ, ఛత్తీస్‌ గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి గానీ వచ్చిన వ్యతిరేక ప్రతిస్పందన బాధాక‌రంగా వున్న‌ద‌న్నారు.  మావోయిస్టుల‌పై చేప‌ట్టిన ఆప‌రేష‌న్ క‌గార్‌ను నిలిపేయాల‌ని కోరారు. అయితే కాల్పుల విరమణ ప్రసక్తే లేదనీ, మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టకుండా వారితో శాంతి చర్చలు జరిపే అవకాశం లేదని కేంద్ర హోంశాంఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, ఛత్తీస్‌ గఢ్‌ ఉపముఖ్యమంత్రి ,రాష్ట్ర హోంమంత్రి విజయ్‌ శర్మ  క‌రాఖండీగా ప్ర‌క‌టించార‌ని గుర్తు చేశారు.

ఎటువంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వం సిద్ధమని విజయ్‌ శర్మ పదే పదే చేసిన ప్రకటనలకు భిన్నంగా కాల్పుల విరమణ ప్రకటించకుండానే మావోయిస్టులు ఆయుధాలు విడిచిపెట్టాలని షరతు పెట్ట‌డం ఎంత‌వ‌ర‌కు స‌హేతుక‌మ‌ని ప్ర‌శ్నించారు. త‌మ‌పార్టీ  16 రాష్ట్రాల్లో ప‌నిచేస్తున్నద‌ని గుర్తుచేశారు. అందువల్ల శాంతి చర్చల విషయంలో కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి  అమిత్‌ షా ప్రతిస్పందించాల్సి వుందని లేఖలో కోరారు. త‌మ‌ పార్టీ 2002 నుంచే శాంతి చర్చల పట్ల తన వైఖరిని ప్రకటిస్తూ వచ్చింద‌ని,  2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం చ‌ర్చ‌లు ప్రారంభించి మ‌ధ్య‌లోనే ఏక‌ప‌క్షంగా వైదొల‌గిన సంగ‌తిని గుర్తు చేశారు. అయితే ఆ చ‌ర్చ‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కే ప‌రిమితం. కానీ 2010లో కేంద్ర‌ప్ర‌భుత్వంతో శాంతి చ‌ర్చ‌లు జ‌రిపేందుకు కేంద్ర క‌మిటీ చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోగా శాంతి చ‌ర్చ‌ల‌కు ప్ర‌య‌త్నిస్తున్న త‌మ  ప్రతినిధి కామ్రేడ్‌ ఆజాద్‌ ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం హత్య చేసిందని ఆరోపించారు.

ఈ చర్చల ప్రక్రియలో భాగంగానే పశ్చిమ బెంగాల్‌ లో మా పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు కామ్రేడ్‌ రాంజీ (మల్లోజుల‌ కోటేశ్వర్లు)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హత్య చేయ‌డం ద్వారా  శాంతి చర్చల ప్రక్రియను భగ్నం చేసాయ‌న్నారు. తామెప్పుడూ శాంతి చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మేన‌న్నారు.  ఆపరేషన్‌ కగార్‌లో త‌మ పార్టీ నాయకత్వం -కేడర్లతో పాటు పెద్ద సంఖ్యలో ఆదివాసుల్ని హత్య చేయడమే కాకుండా త‌మ పార్టీకి, ఆదివాసుల అస్తిత్వానికి పెనుసవాలు విసిరార‌న్నారు.  కేడ‌ర్‌ను కోల్పోతున్నందువ‌ల్ల‌నే చ‌ర్చ‌ల ప్ర‌స్థావ‌న తెస్తున్నార‌న్న ప్ర‌చారాన్ని ఖండిస్తున్నామ‌న్నారు. సభలు, సమావేశాలు, సదస్సుల ద్వారా శాంతి చర్చలకు అనుకూల వాతావరణాన్ని ఏర్పరచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణలో ప్రత్యేకించి అనేక వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజాస్వామికవాదులు, శాంతికాముకులను అర్బన్‌ నక్సల్స్‌గా ముద్ర వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని పేర్కొన్నారు. ఇది సరైంది కాద‌ని స్ప‌ష్టం చేశారు.   మావోయిస్టులతో  మోదీ ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని డిమాండ్‌ చేసారు.

మే 7వ తేదీన కర్రెగుట్టల్లో ప్రభుత్వ సాయుధ బలగాలు పాశవికంగా నిర్వహించిన హత్యాకాండలో 22 మంది కామ్రేడ్స్‌ అమరులయ్యారు. దీంతో కర్రెగుట్టల ఆపరేషన్‌ లో అమరులైనవారి  కామ్రేడ్స్‌ సంఖ్య 26కు చేరుకుంది. ఒక వైపు చర్చల ప్రక్రియ కొనసాగుతుండగా ఈ విధంగా హత్యాకాండ కొనసాగించడాన్ని తీవ్రంగా ఖండిరచాల్సిందిగా దేశవాసులకు, ప్రజాస్వామికవాడులకు విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు. ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసే విషయానికి వస్తే ఈ విషయంపై మా పార్టీలో ఏ ఒక్కరో నిర్ణయం తీసుకోలేర‌న్నారు. ఆపరేషన్‌ కగార్‌ లో లక్షలాది మంది పోలీసు, పారామిలిటరీ, కమాండో బలగాలు మా ఉద్యమ ప్రాంతాలను చుట్టిముట్టి వున్న స్థితిలో మా పార్టీలో కనీసం కోర్‌ అయినా సమావేశమై ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం లేకుండా పోతోంది. అందువల్లనే కాలావధితో కూడిన కాల్పుల విరమణను ప్ర‌తిపాదిస్తున్నామ‌న్నారు. ప్రజలకు గానీ, మా పార్టీ కేడర్లకు గానీ రక్షణ లేని పరిస్థితుల్లో ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వంతో చర్చలకు రావడం అసాధ్యమన్నారు. ఈఆపరేషన్‌ కగార్‌ ను ఆపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి శాంతి చర్చలు జరపాల్సిందిగా  మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ముందుకు రావాల్సిందిగా భారతదేశవాసులకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page