ప్రాజెక్టులలో పూడిక తీత పనులు ప్రారంభించాలి •యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టాలి
•డిసెంబర్ మొదటి వారంలో నల్లగొండకు సీఎం రేవంత్ రెడ్డి
•వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 25: సీతారామ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులను ఆదేశిం చారు. రాష్ట్రప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్ట్ ల నిర్మాణాలకు అంకురార్పణ చుట్టిందని ఇందులో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సోమవారం బంజారాహిల్స్ నుంచి నీటిపారుదల శాఖాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల శాఖా సలహాదారుఫు ఆదిత్యా దాస్ నాథ్, ఇఎన్.సి జనరల్ అనిల్ కుమార్,ఇఎన్.సి ఓఅండ్‌ఎం నాగేందర్ రావు తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చీఫ్ ఇంజినీర్లు ఇతర ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రాధాన్యాతా క్రమంలో ఉన్న ప్రాజెక్ట్ లకు పాలనా పరమైన అనుమతులు సత్వరమే తీసుకోవాలన్నారు. మోదీకుంట వాగు ప్రాజెక్టుకు అయ్యే అంచనాలతో పాటు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ పురోగతి పై ఆయన అడిగి తెలుసుకున్నారు ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతితో ప్రత్యేక ఐఏ ఎస్ అధికారిని నియమించామని ఎప్పటికప్పుడు ఆర్%•%ఆర్ కమిషనర్ గా నియమితులైన ఐఏఎస్ అధికారి వినయ్ కృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపి భూసేకరణ నిర్వహించాలని ఆయన సూచించారు.
అన్నింటికి మించి ఇసుక మెటలు, మట్టి నిల్వలతో పూడుకుపోయిన ప్రాజెక్టులలో పూడిక తీత పనులు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ పనులను వేగవంతం చేసి ప్రాజెక్టులలో నీటి సామర్ధ్యం పెంచేలా చర్యలు చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు సింగూరు ప్రాజెక్ట్ పై నవంబర్ 27 న ప్రత్యేక సమీక్ష సమావేశం ఉంటుందని ఆ సమీక్షలో రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖామంత్రి దామోదర రాజనరసింహ పాల్గొంటారని అందుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలన్నారు నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టు స్థితిగతులపై డిసెంబర్ మొదటి వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారని అందుకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదికలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.