– ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
– ఏడుగురు మృతి.. కొందరికి తీవ్ర గాయాలు
– సిఎం చంద్రబాబు, మంత్రుల దిగ్భ్రాంతి
– సహాయక చర్యలకు అధికారులకు ఆదేశాలు
పల్నాడు, ఆగస్ట్ 27: పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట అడ్డ రోడ్డు సెంటర్ వద్ద ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. మృతులను బొంతా బాబు, బొంతా మణెమ్మ, సంపూర్ణమ్మ, లక్ష్మమ్మ, గంగమ్మ, మరియమ్మ, చౌటుపల్లి సువార్తగా గుర్తించారు. కాగా, బాధితులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామస్థులుగా పోలీసులు తెలిపారు. వీరంతా ప్రకాశం జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హాస్పిటల్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, సత్య కుమార్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడం, పలువురు గాయపడటంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ’చిలకలూరిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒకే ఊరికి చెందిన వారు పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తూ ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంపై హోంమంత్రి అనిత దిగ్భ్రారతి వ్యక్తం చేశారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పల్నాడు జిల్లా అదనపు ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, బస్సు వేగం, డ్రైవింగ్ నిర్లక్ష్యం సహా అన్ని కోణాల్లో విచారణ చేయాలన్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయసహకారాలు అందించాలని సూచించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రైవేటు ట్రావెల్స్ రోడ్డు భద్రతా నిబంధనల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు అనిత ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కూడా స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి చెందారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ బస్సుల తనిఖీలు ముమ్మరం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. ప్రమాదంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రైవేటు బస్సుల ఫిట్‌నెస్, ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మృతిచెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. ప్రమాద ఘటనపై పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే ఓదార్చారు. చిలకలూరిపేట పట్టణంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడూ జరగలేదని.. ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం తనను కలచి వేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




