– అదనంగా 5 నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ నిల్వ సామర్థ్యం లక్ష్యం
– అత్యాధునిక సాంకేతికత వినియోగం
– మిల్లర్ల నుంచి బకాయిల వసూలుకు పటిష్ట కార్యాచరణ
– జీఈఎం, తెలంగాణ ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా ధాన్యం వేలం
– పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27: రాష్ట్రంలో ఏటేటా విస్తరిస్తున్న వరి సాగు, గణనీయంగా పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి, ప్రభుత్వ సేకరణ అవసరాలకు దీర్ఘకాలిక పరిష్కారంగా అత్యాధునిక ధాన్య సైలోల నిర్మాణానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర పౌర సరఫరాల సంస్థను ఆదేశించారు. రాష్ట్రంలో అదనంగా 5 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల శాస్త్రీయ ధాన్య నిల్వ సామర్థ్యాన్ని సృష్టించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఈ సైలోల నిర్మాణం, నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. మహిళా సంఘాల ఆర్థిక సాధికారతకు కొత్త మార్గాలను తెరవడంతోపాటు, రాష్ట్ర ఆహార భద్రతకు అవసరమైన శాశ్వత మౌలిక సదుపాయాల నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసే నమూనాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలపై సీనియర్ అధికారులతో మంత్రి ఉత్తమ్ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం ఉత్పత్తి, సేకరణకు అనుగుణంగా నిల్వ సామర్థ్యాన్ని విస్తరించాల్సిన అవసరాన్ని వివరించారు. మెరుగైన సాగునీటి సదుపాయాలు, సాగు విస్తీర్ణం పెరగడం, కనీస మద్దతు ధరకు ప్రభుత్వం ధాన్యం సేకరిస్తుండడంతో తెలంగాణలో వరి ఉత్పత్తితో పాటు ధాన్యం కొనుగోళ్లు కూడా ఏటేటా పెరుగుతున్నాయన్నారు. భవిష్యత్ అవసరాలను కేవలం సంప్రదాయ గోదాములతో తీర్చడం సాధ్యం కాదని మంత్రి స్పష్టం చేశారు. ఆటోమేటెడ్ హ్యాండ్లింగ్, శాస్త్రీయ సంరక్షణ, యాంత్రిక రవాణా, డిజిటల్ పర్యవేక్షణ వంటి అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలతో కూడిన నిల్వ నెట్‌వర్క్ అవసరమన్నారు. తేమ, పురుగులు, ఇతర నిల్వ సంబంధిత కారణాలతో ధాన్యం నష్టపోకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. ధాన్యం నిల్వ నుంచి తరలింపు వరకు ప్రతి దశలో నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని పెంచే విధంగా సైలో వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామస్థాయి సంస్థలు, పౌర సరఫరాల సంస్థ భాగస్వామ్యంతో ఆధునిక సైలోల నిర్మాణం, నిర్వహణ చేపట్టేందుకు అనువైన నమూనాలను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇందులో పౌర సరఫరాల సంస్థ, మహిళా సంఘాలు, ఇతర భాగస్వామ్య సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచించాలని చెప్పారు. సైలోలు ఆర్థికంగా స్వయం సమర్థంగా, వృత్తిపరంగా నిర్వహించబడేలా తగిన ఆర్థిక, కార్యాచరణ నమూనాలను రూపొందించాలన్నారు. “రాష్ట్ర ధాన్య నిల్వ మౌలిక సదుపాయాలను కేవలం వచ్చే కొనుగోలు సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని కాదు.. రాబోయే దశాబ్దాల అవసరాలను ముందుగా నే అంచనా వేసి నిర్మించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, కేంద్ర గిడ్డంగుల సంస్థ, భారత ఆహార సంస్థ, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, ప్రైవేటు పెట్టుబడిదారుల గోదాముల ద్వారా ధాన్యం నిల్వ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు సొంతంగా సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్నప్పటికీ,ప్రతి సీజన్‌లో భారీగా సేకరిస్తున్న ధాన్యాన్ని నిల్వ చేసేందుకు ఇతర సంస్థలు, అద్దె గోదాములపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఇటీవలి ధాన్యం సేకరణ పరిమాణమే రాష్ట్ర నిల్వ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తెలియజేస్తోందని మంత్రి చెప్పారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో పౌర సరఫరాల సంస్థ 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం సేకరించేందుకు సిద్ధమైందని, సీజన్ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా తక్షణమే సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భారీ స్థాయిలో పెరుగుతున్న ధాన్యం సేకరణకు, అందుబాటులో ఉన్న శాశ్వత శాస్త్రీయ నిల్వ సామర్థ్యానికి మధ్య పెరుగుతున్న అంతరం కొత్త సైలోల నిర్మాణం ఎంత అత్యవసరమో స్పష్టం చేస్తోందన్నారు.
మిల్లర్ల బకాయిల వసూలుకు పటిష్ట వ్యూహం
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




