అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డు

– ఐటీ, పరిశ్రమల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 26: గత ప్రభుత్వం పదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 27 లక్షల రేషన్‌ కార్డులు మాత్రమే అందిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం ఏడాదిన్నర వ్యవధిలోనే కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు తెలిపారు. ఇంకా అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు అందిస్తామని చెప్పారు. అబ్దుల్లాపూర్‌ెమెట్‌ మండలం పెద్దఅంబర్‌పేట్‌ మున్సిపల్‌ పరిధికి సంబంధించి రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా మండలాల, మున్సిపల్‌ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డిలతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు రేషన్‌ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు 10వేల కుటుంబాలకు కొత్త రేషన్‌ కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నందున రేషన్‌ కార్డులకు ప్రస్తుతం చాలా ప్రాధాన్యత ఉన్నదన్నారు. తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించామని, పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపల్‌ పరిధి రోడ్ల అభివృద్ధికి రూ.25 కోట్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి మాట్లాడుతూ మండలాలవారీగా రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లావ్యాప్తంగా 14,572 కొత్త రేషన్‌ కార్డులతోపాటు లక్షా 51 వేల మంది కొత్త సభ్యుల పేర్లను రేషన్‌ జాబితాలో చేర్చామన్నారు. అర్హులైన వారు ఇంకా మిగిలి ఉంటే ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అదే సమయంలో అనర్హులకు కార్డులు రాకుండా పకడ్బందీగా వెరిఫికేషన్‌ ప్రక్రియను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికీి సన్న బియ్యం అందజేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మల్‌ రెడ్డి మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇంకా మూడు మండలాలు, మూడు మునిసిపాలిటీ పరిధిలో మిగిలి ఉన్న రేషన్‌ కార్డుల పంపిణీ రానున్న వారంలోపు అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు. కార్యక్రమంలో రోడ్ల అభివృద్ధి చైర్మన్‌ మల్‌రెడ్డి రాంరెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిలక మధుసూదన్‌ రెడ్డి, ఆర్డీవో జగదీశ్వర్‌ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పారిజాత, సివిల్‌ సప్లైస్‌ డీఎం గోపీకృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *