Ratan Tata : ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. వయోభారంతో గత కొన్ని రోజులుగా ముంబైలోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రతన్ టాటా.. బుధవారం (అక్టోబర్ 09న) రాత్రి తుదిశ్వాస విడిచారు. సోమవారం (అక్టోబర్ 07న) రోజున వయోభారానికి సంబంధించిన పలు అనారోగ్య సమస్యల కారణంగా.. హాస్పిటల్ లోచేరిన రతన్ టాటా ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండటంతో.. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి చికిత్స అందించారు. అయితే.. రతన్ టాటా పరిస్థితి పూర్తిగా విషమించడంతో కన్నుమూశారు.
రతన్ టాటా 1991లో ‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వందేళ్ల కిందట తన ముత్తాత స్థాపించిన గ్రూప్‌ను 2012 వరకు ఎంతో విజయవంతంగా నడిపారు రతన్ టాటా. 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలిసర్వీసెస్‌ను, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రారంభించి.. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు. టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. రతన్ టాటా నాయకత్వంలో, టాటా గ్రూప్స్ సంస్థ.. 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. తన వ్యాపారాలన్నింటినీ ఎంతో విజయవంతంగా నడిపిస్తూ.. దేశంలోని గొప్ప పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా రతన్ టాటా పేరు సంపాదించుకున్నారు.