రామదాసు, కంచర్ల గోపన్న ఒకరేనా? – 2

1650లో గోపన్న గోల్కొండ వెళ్లి మేనమామలైన అక్కన్న, మాదన్నలని కలవగా వారు నాటి తానాషా ప్రభువు ఆర్ధిక మంత్రి అయిన మీర్జా మొహమ్మద్ సయ్యద్ వద్దకు గోపన్నను తీసుకెళ్లి అతనికేమైనా ఉద్యోగం ఇప్పించమని ప్రార్ధించారు. వారి ప్రార్థనలను మన్నించి మీర్జా సయ్యద్ గోపన్నను భద్రాచలం దేవాలయంలో లెక్కలుచూసే గుమస్తాగా నియమించారని ఒక కథనం. ఆ నాటికే భద్రాచలంలో రామ దేవాలయం ఒకటి ఉండింది.  ఇక్కడినుంచి రామదాసు జీవితంపై భిన్నకథనాలున్నాయి. ఒకటేమిటంటే రామదాసు భద్రాచలంలో ఉన్న రాములవారి మందిరం చూసి, కలతచెంది, ప్రజలు జిజియాపన్నుకు చెల్లించిన డబ్బులు, ఇతరపన్నులకు ఇచ్చిన డబ్బులను రామాలయ నిర్మాణానికి వెచ్చించి దానిని పునర్నిర్మించాడని, ఈ వార్త తెలిసి తానాషా గోపన్నను 12 సంవత్సరాలకు ఖైదు చేసాడని. రెండవది, ఔరంగజేబు దాడి జరుపబోతున్నట్లు తెలిసి గాభరాగా పునర్విచారించి రామదాసును నిర్దోషని ప్రకటించి జైలునుంచి పంపించి వేసాడని.

ఈ కథనం ప్రకారం పోకల దమ్మక్కకు కల రావటం, ఆవిడ ఆ కొండపై సీతాసమేత రామలక్ష్మణులను కనుగొని, తాత్కాలిక తాటాకుల పందిరివేసి ఆ దేవతలను భక్తితో సేవించటం, ఆ సమయంలో రామదాసు తహసీల్దారుగా అక్కడికి వచ్చి, ఈ పోకల దమ్మక్క నిర్మించిన రామమందిరం చూసి చలించిపోయి దాని నిర్మాణానికి ప్రజలనుంచి ధనం సేకరించటం అంతా ఓ కట్టు’కథ’ అయిపోతుంది. అసలు రామదాసు పాడుపడ్డ మందిరాన్ని పునర్నిర్మించాడా, లేక కొత్త మందిరం కట్టించాడా? మందిరం కట్టించేప్పటికీ ఆయన గుమాస్తానా, తహసీల్దారా?

డచ్ ఈస్ట్ ఇండియా కథనాలు, ఆలయ కథనాలు, జనంలో ఉన్న ప్రచారం వేరువేరుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఆయన ఎక్కువకాలం భద్రాచలంలోనే ఉన్నట్లు తెలుస్తుంది. ఒక కథనం ప్రకారం రామదాసు కేవలం సంవత్సరం మాత్రమే గోల్కొండలో ఏకాంత జైలుజీవితం గడిపినట్టు తెలుస్తుంది. వికీపీడియా గూడా రామదాసు చుట్టూ అల్లుకొని అనేక దైవసంబంధమైన కథలు ప్రచారంలో ఉన్నాయని రాసింది. ఇక్కడనుంచి రామదాసు కాలనిర్ణయసమస్యల పరిణామమెట్లా సాగిందో చూడవలసి ఉంది. ప్రసిద్ధ చరిత్రకారుడు, శాసనశోధకుడు బిఎన్ శాస్త్రి రాసిన ‘గోల్కొండ చరిత్ర- సంస్కృతి- శాసనములు’ (1989) ప్రకారం అబ్దుల్ కుతుబ్ షా 1626నుంచి 47 సంవత్సరములు గోల్కొండను పాలించి 21-4-1672లో కాలం చేశారని రాశారు.

‘విచిత్ర పరిస్థితులలో అబ్దుల్ కుతుబ్ షా మూడవ కూతురు బాదుషాబీబిని వివాహమాడి అబుల్ హాసన్ తానాషా (నిత్యం ఆనందంగా జీవించే తాత్వికుడు) గోల్కొండ నవాబు అయినాడని నిర్ధారించారు. అంటే 1672కు గోల్కొండ నవాబు అబుల్ హాసన్ తానాషా. అంతవరకూ ఆయన మామ అబ్దుల్ కుతుబ్ షానే గోల్కొండ పాలించాడు. అబుల్ హాసన్ తమాషా 1687లో దివంగతుడయినాడు. అంటే అబుల్ హాసన్ తానాషా కేవలం 15 సంవత్సరాలే గోల్కొండ పాలించారన్నమాట. అంతేగాదు, అబుల్ హాసన్ తానాషా కింద పనిచేసే ముజఫర్ వద్ద పేష్కారుగా మాదన్న, అతనికి కార్యదర్శిగా అక్కన్న పనిచేసేవారు. ముజఫర్ రాజద్రోహచర్యలను బాగా గమనిస్తుండెడివారని, ఫలితంగా వారు తానాషాకు ముజఫర్ ను వదిలించుకొని ఆయన అధికారం పదిలపరుచుకోవటంలో సహాయపడ్డారని శాస్త్రిగారు రాశారు. అందుకు బదులుగా మంత్రిగా మాదన్న, అక్కన్న పేష్కార్ గా నియమితులైనారు. ఈ మొత్తం చరిత్రలో బిఎన్ శాస్త్రి ఎక్కడా కంచర్ల గోపన్న, భద్రాచలం రామాలయం, గోల్కొండలో ఉన్న గోపన్న ఖైదు గురించి పేర్కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఇది ఇలా ఉంటే, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత బాలాంత్రపు రజినీకాంతరావు తన పుస్తకం ‘రామదాసు’లో (కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ, 1988) రామదాసు జీవితంలో ఇద్దరు గోల్కొండ ప్రభువులు భాగమైనట్లు రాశారు. 1925లో భావరాజు వెంకట కృష్ణారావు భారతిలో రాసిన వ్యాసంలో ఈ విషయం పేర్కొన్నట్టు తన పుస్తకంలో ఉటంకించారు. అంతేగాదు, వీరుగూడా నాటి ప్రచారంలో ఉన్న యక్షగానాలనుంచి, హరికథల నుంచే రామదాసు జీవితచరిత్ర అల్లినట్టు తొలుతే రాసుకున్నారు. పైగా అక్కన్న, మాదన్నలను కంచర్ల గోపన్న మేనమామలుగా ఈయన నమ్మినట్టు రాశారు. వీరి ప్రకారం రామదాసు ప్రభుత్వ ఖజానాకు జమ కావలసిన ధనం రామమందిర నిర్మాణానికి వాడినందుకు 1665-1677 వరకూ జైలులో ఒంటరిగా ఖైదీగా గడిపినట్టు రాశారు.

నిజానికి, ఈ కాలానికి అబుల్ హాసన్ తానాషా గోల్కొండ నవాబు కాదు. అప్పటికి అబ్దుల్ కుతుబ్ షానే గోల్కొండ పాలకుడు. అప్పటికి అక్కన్న, మాదన్నలు ఇంకా గోల్కొండలోకి ప్రవేశించలేదు. వాళ్ళు వచ్చింది అబుల్ హాసన్ తానాషా హయాంలో. అబ్దుల్ కుతుబ్ షా కింద పనిచేసే సయ్యద్ మిర్ జుంలా ముజఫర్ ఆదాయ వ్యయాలమంత్రిగా వ్యవహరిస్తున్నప్పడు ఆయనకు సహాయకులుగా (పేష్కార్లుగా) ఉండేవారు.  ఒకవేళ ఇదే జరిగి ఉంటే సయ్యద్ మిర్ జుంలా ముజాఫర్ రామదాసును భద్రాచలంలో ఉన్న రామాలయానికి పన్నులు, జిజియా వసూలు చేసేందుకు పంపిన గుమాస్తానే కానీ, తహసీల్దారు కాదు.

అయితే రజనీకాంతరావు రచనలో రెండు ముఖ్యవిషయాలు పేర్కొన్నారు. ఒకటి అబ్దుల్ కుతుబ్ తానాషా రామదాసుకు 12 ఏళ్ళు జైలు శిక్ష విధించినా, ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన అబుల్ హాసన్ తానాషా మహామంత్రి మాదన్న, అక్కన్నల విజ్ఞప్తి మేరకు రామదాసు కేసును పునః పరిశీలించి ఆయనను 1677లో జైలు నుంచి విడుదల చేయటం జరిగిందని. ఇందుకు ఆధారంగా ఆయన ఆరుద్ర, వేదం వెంకటరాయ శాస్త్రి రచనలను ఉటంకించారు. ఇంకా మార్టిన్, హవార్ట్ అనే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు కూడా ఇదే వాదనను సమర్ధించారు. అయితే వారి విమర్శలో వారు రామదాసును భద్రాచలం తహసీల్దార్ గానే అభివర్ణించినట్టుగా రజనీకాంతరావు పేర్కొనటం గమనార్హం. (ఇంకా ఉంది)

-డా. కొప్పరపు నారాయణమూర్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page