న్యూదిల్లీ, అక్టోబర్ 23 : కూటమి తరఫున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పోస్టర్ల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫొటో మాయమవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వచ్చే నెల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నేడు ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలోని ఓ హోటల్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోస్టర్లలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఫొటోను మాత్రమే ప్రముఖంగా ప్రదర్శించారు. మిగతా భాగస్వామ్య పార్టీల నేతల చిన్న ఫొటోలను ఏర్పాటు చేశారు. అయితే, అందులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఫొటో మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఇందుకు సంబంధించిన పోస్టర్లు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు విమర్శలను ఎక్కుపెట్టింది. తేజస్వి యాదవ్, ఆయన మద్దతుదారులు రాహుల్ నాయకత్వాన్ని అవమానించారంటూ వ్యాఖ్యానించింది. తాజా పరిణామాలపై బీజేపీ నేత షెహజాద్ పూనవాలా ఎక్స్ వేదికగా స్పందిస్తూ నిన్నటి వరకూ రాహుల్ గాంధీయే కూటమి ముఖచిత్రంగా చెప్పుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం గౌరవం లేదని స్పష్టమవుతోంది. ఈ కూటమికి గందరగోళం, విభజన, పదవుల కోసం ఆశ తప్ప.. ఒక లక్ష్యం గానీ, దార్శనికత గానీ లేవు అంటూ ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





