రఫేల్‌ ‌యుద్ద విమానంలో రాష్ట్రపతి గగన విహారం

– రాష్ట్రపతి ముర్ముతో ‘రఫేల్‌ ‌రాణి’ శివాంగీ సింగ్‌

‌న్యూదిల్లీ, అక్టోబర్‌ 29: ‌రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రఫేల్‌ ‌యుద్ధ విమానంలో విహరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఎక్స్ ‌ఖాతాలో షేర్‌ ‌చేశారు. హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరంలో దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్‌ ‌ద్రౌపది ముర్ము ఫ్లైయింగ్‌ ‌సూట్‌ ‌ధరించి భారత వైమానికి దళానికి చెందిన రఫేల్‌ ‌యుద్ధ విమానంలో విహరించారు. ముందుగా భద్రతా దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు. ఇందులో యుద్ధ విమాన పైలట్‌ ‌శివాంగీ సింగ్‌తో దిగిన ఫొటో ఇప్పుడు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతోంది. పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చేపట్టిన సమయంలో ఆమెని బంధించినట్లు దాయాది పాకిస్థాన్‌ ‌సోషల్‌ ‌మీడియాలో అసత్య ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భారత్‌కు చెందిన రఫేల్‌ ‌సహా పలు యుద్ధ విమానాలను నేలకూల్చామని, ఓ మహిళా పైలట్‌ను బంధించామని పాక్‌ అబద్దాలు ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని భారత్‌ అప్పట్లోనే ఖండించింది. దీంతో నాడు శివాంగీ సింగ్‌ ‌పేరు నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఇప్పుడు ఆమెతో రాష్ట్రపతి ముర్ము ఫొటో దిగడంతో శివాంగీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె కోసం నెటిజన్లు శోధిస్తున్నారు. సింగ్‌ ‌స్వస్థలం వారణాసి. అక్కడే పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆమె బెనారస్‌ ‌హిందూ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పట్టా అందుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్‌సీసీలో చేరారు. ఆపై 2016లో ఎయిర్‌ఫోర్స్ అకాడలో శిక్షణ తీసుకున్నారు. చిన్నతనం నుంచీ పక్షిలా ఆకాశంలో ఎగరాలని కలలు కన్న ఆమె ఎప్పటికైనా పైలట్‌ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొదటి దశ యుద్ధ విమాన పైలట్లుగా నియమితులైన మోహనా సింగ్‌, ‌భావనా కాంత్‌, అవనీ చతుర్వేది స్ఫూర్తితో పైలట్‌గా శిక్షణ తీసుకున్నారు. 2017లో రెండో దశ యుద్ధ విమాన పైలట్లలో ఒకరిగా ఎంపికైన శివాంగీ మిగ్‌-21 ‌బైసన్‌ ‌యుద్ధ విమానాలు నడపడంలో ప్రావీణ్యం సాధించారు. మిగ్‌ ‌ఫైటర్‌ ‌జెట్లు నడిపిన అనుభవంతోనే 2020లో దేశంలోనే అత్యాధునిక రఫేల్‌ ‌యుద్ధ విమానాన్ని నడిపే అవకాశం దక్కించుకున్నారు. అప్పటి నుంచి అంబాలా ఎయిర్‌బేస్‌లోని గోల్డెన్‌ ‌యారోస్‌ స్క్వాడ్రన్‌ ‌బృందంలో భాగంగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2022లో జరిగిన గణతంత్ర వేడుకల్లో భవిష్యత్తు కోసం భారత వైమానిక దళం రూపాంతరం చెందుతోంది అనే థీమ్‌తో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ ‌శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటంలో రఫేల్‌ ఫైటర్‌ ‌జెట్‌ ‌యుద్ధ విమానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ శకటంపై శివాంగి సింగ్‌ ‌సెల్యూట్‌ ‌చేస్తూ కనిపించారు. గణతంత్ర వేడుకల పరేడ్‌లో పాల్గొన్న రెండో పైలట్‌గా ఘనత సాధించారు. ఆ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ ‌మహీంద్రా ‘రఫేల్‌ ‌రాణి’ అంటూ చేసిన పోస్ట్ ఆకట్టుకుంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page