– మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లు
– సమన్వయ అధికారిగా జిల్లాకొక హెచ్‌వోడీ నియామకం
– వ్యవసాయ మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: మొక్కజొన్న కొనడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని, అయినప్పటికి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు గురువారం నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఆరంభిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదేవిధంగా సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వివిధ పంటల కోతలు ప్రారంభమైన సందర్భంగా వాటి సేకరణపై మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, హాకా, ఆర్‌ఐసీ సంస్థల ఎండీలతో ఆయన బుధవారం సమీక్ష నిర్వహించారు. కాగా, సీసీఐ టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని, కలెక్టర్లు జిన్నింగ్ సెంటర్లను గురువారంలోగా నోటిఫై చేసి పత్తి కొనుగోళ్లు కూడా ఆరంభించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం సేకరణలో అవసరమయ్యే క్లీనర్లు, టార్పలిన్లు మున్నగు వాటి జిల్లాల వారీ లభ్యతపై కూడా సమీక్ష జరిపారు. అన్ని పంటల కొనుగోళ్లకు సంబంధించి ప్రతీ ఉమ్మడి జిల్లాకు ఒక హెచ్‌వోడీని సమన్వయ అధికారిగా నియమించామని, వీరు ఉమ్మడి జిల్లా పరిధిలోని కలెక్టర్లతో సమన్వయం చేసుకుని కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వేర్‌హౌజ్ ఎండీ, వరంగల్ జిల్లాకు హార్టీకల్చర్ డైరెక్టర్, నల్లగొండ జిల్లాకు అగ్రికల్చర్ డైరెక్టర్, మహబూబ్‌నగర్ జిల్లాకు హాకా ఎండి, ఖమ్మం జిల్లాకు మార్కెటింగ్ డైరెక్టర్, ఆదిలాబాద్ జిల్లాకు సీడ్ సర్టిఫికేషన్ డైరెక్టర్, కరీంనగర్ జిల్లాకు ఆగ్రోస్ ఎండీ, మెదక్ జిల్లాకు మార్క్‌ఫెడ్ ఎండీ, రంగారెడ్డి జిల్లాకు ఆయిల్‌ఫెడ్ ఎండీని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ‘హాకా’ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి పాల్గొన్నారు.]
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





