కరువు ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు

– ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి పనులు ప్రారంభించాలి
– నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
– పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : ఎల్‌నినోతో ఎదురయ్యే నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడంతోపాటు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. బీఆర్‌కే భవన్‌లోని సెర్ప్ కార్యాలయం నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సుమారు 12 వేల మంది సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులతో మంత్రి మాట్లాడారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, సెర్ప్ కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా అదనపు కలెక్టర్లు ఐటీడీివో అధికారులు, డీఆర్డీవోలు, డీపీవోలు, జెడ్పీ సీఈవోలు, ఇంజనీరింగ్ విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన జలసిరి వీడియోను మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలోని 12,516 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 244 పంచాయతీల్లోనూ వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. బుధవారం ఈనెల 27న) ఉపాధి పనులకు 3,97,788 మంది కూలీలు హాజరుకావడం రికార్డుగా నిలిచిందని, ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామాల్లో కూలీలను సమీకరించి వారికి నిరంతరంగా పనులు కల్పించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూనే, కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించి వలసలను నివారించాలని చెప్పారు.

నీటి సంరక్షణకు పెద్దపీట

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జి పనులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని మంత్రి సూచించారు. చెరువుల పునరుద్ధరణతోపాటు వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పశువులకు మేత, తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నీటి వృథాను అరికట్టేందుకు సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.

అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అవసరమైన నిధులు అందుబాటులో ఉంచుతోందని మంత్రి సీతక్క తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని వర్క్‌షెడ్లు, పశువుల షెడ్లు, కమ్యూనిటీ హాళ్లు వంటి నిర్మాణాలు చేపట్టవచ్చని చెప్పారు. ఒక్కో గ్రామానికి సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు సమకూరే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధి పనుల బిల్లులు 15 రోజుల్లో వస్తాయంటూ ఆ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సర్పంచులు, కార్యదర్శులు, మండలస్థాయి అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు.

సర్పంచుల అభిప్రాయాల సేకరణ

వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పలు జిల్లాలకు చెందిన సర్పంచులతో మంత్రి నేరుగా మాట్లాడి వారి గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఉపాధి పనులను సమర్థవంతంగా వినియోగించుకొని గ్రామాల్లో అభివృద్ధిని సాధించిన సర్పంచులను అభినందించారు. వారి పనితీరును ఆదర్శంగా తీసుకుని ఇతర సర్పంచులు కూడా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి పనుల వివరాలను జీపీఎసఏపీలో నమోదు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో కోటి 12 లక్షల రికార్డులను నమోదు చేశామని, ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపరిచామని వెల్లడించారు. ఈ వ్యవస్థను ఉపయోగించుకుని పనుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణను మెరుగుపర్చాలని సూచించారు.

ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కూలీలకు ఉపాధి కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, ప్రజల జీవన విధానాలను దృష్టిలో పెట్టుకుని పనులను ఎంపిక చేయాలని తెలిపారు. నీటి సంరక్షణ పనులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచి వలసలను అరికట్టాలని సూచించారు.

19లోగా మహిళా సంఘ భవనాలు పూర్తి చేయాలి

ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబరు 19న గ్రామ మహిళా సంఘ భవనాలను ప్రారంభించుకునేలా నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గడువులోగా పనులు పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఆదర్శ గ్రామాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు 

ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తే కేంద్రం నుంచి అవార్డులు పొందే అవకాశం ఉంటుందన్నారు. అవార్డుల ద్వారా లభించే అదనపు నిధులను కూడా గ్రామాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చన్నారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు, నీటి సంరక్షణ, ఉపాధి కల్పన, పారిశుధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా తిరిగి నియమితులైన దాన కిషోర్‌ను మంత్రి సీతక్క అభినందించి సత్కరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *