– సామాన్యుడి జీవితంలో మార్పు రావాలి
– కార్యాలయాల్లో ఆదా అయ్యే సమయం ప్రజలకు తిరిగి అందాలి
– సామాన్యుడి సమస్య పరిష్కారమే సాంకేతికత వినియోగానికి గీటురాయి
– ‘ఏఐ సాక్షమ్’ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : కృత్రిమ మేధస్సు(ఏఐ)తో ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వేగవంతం కావాలి.. సమస్యలు సకాలంలో పరిష్కారమై రైతులు, పింఛనుదారులు, సామాన్యులు తమ పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి మారాలి.. కార్యాలయంలో ఆదా అయ్యే ప్రతి గంట ప్రజలకు తిరిగి అందించే సమయంగా మారాలి అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజల జీవితాల్లో కనిపించే సానుకూల మార్పే ప్రభుత్వ పాలనలో ఏఐ విజయానికి అసలైన కొలమానం అని చెప్పారు. సాంకేతికత ఎంత అధునాతనమైనదన్నది ముఖ్యం కాదు.. అది ప్రజలకు ఎంత మెరుగైన సేవలందించగలిగిందన్నదే కీలకమని పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచఆర్డీలో ప్రణాళికా శాఖ సహకారంతో టీజీ మ్యాథ్ బుధవారం చేపట్టిన ‘ఏఐ సాక్షమ’ ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించి ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, సమర్థంగా సేవలందించే పరిపాలనా వ్యవస్థను నిర్మించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ప్రజాధనం వినియోగంలో మెరుగైన విశ్లేషణ
ఆర్థిక శాఖలో ప్రజాధనం సరైన లక్ష్యాలకు చేరుతోందా.. వ్యయాల్లో జాప్యాలకు కారణాలేమిటి.. ప్రాజెక్టుల అమలులో ఎక్కడ లోపాలున్నాయి అనే అంశాలను విశ్లేషించేందుకు ఏఐ సాధనాలు దోహదపడగలవని తెలిపారు. వివిధ ప్రాజెక్టుల వ్యయాలను పోల్చడం, అసాధారణ వ్యయ ధోరణులను గుర్తించడం ద్వారా అధికారులు మరింత సమర్థంగా వ్యవహరించవచ్చన్నారు. అయితే, ఒక వ్యవస్థ గుర్తించిన అసాధారణ ధోరణి అక్రమాలకు రుజువు కాదని, ప్రతి అంశాన్ని ఆధారాలు, నిబంధనల ప్రకారం పరిశీలించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రణాళికా రంగంలో గణాంకాల సగటులు వాస్తవ పరిస్థితులను పూర్తిగా ప్రతిబింబించకపోవచ్చన్నారు. ఒక జిల్లాలో అభివృద్ధి సూచికలు మెరుగ్గా ఉన్నా మారుమూల ప్రాంత ప్రజలకు ప్రభుత్వ సేవలు అందకపోవచ్చన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరుతున్నాయా.. ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనే అంశాలను గుర్తించేందుకు ఏఐ విశ్లేషణ ఉపయోగపడుతుందని వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రజల అభిప్రాయాలు, ఉద్యోగుల అనుభవానికి ప్రాధాన్యం కొనసాగాలని స్పష్టం చేశారు.
విద్యుత్ రంగంలోనూ ఉపయోగకరం
విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయడం, పరికరాల్లో తలెత్తే లోపాలను గుర్తించడం, నిర్వహణ చర్యలను మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులు, చిన్న పరిశ్రమలు, హాస్పిటల్స్‌కు నిరంతర విద్యుత్ సరఫరా అందించడంలో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం దోహదపడుతుందన్నారు. అయితే, వాస్తవ పరిస్థితుల్లో వ్యవస్థ పనితీరును, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో తరచుగా ఎదురయ్యే సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఏఐ సాధనాలను ప్రయోగాత్మకంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులను గుర్తించడం, నివేదికలు రూపొందించడం, ప్రజలకు అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని అందించడం వంటి పనుల్లో ఏఐ ద్వారా సమయం ఆదా చేయవచ్చన్నారు. అలా ఆదా అయిన సమయాన్ని క్లిష్టమైన కేసులను పరిశీలించడానికి, మరింతమందికి సేవలందించడానికి వినియోగించాలని సూచించారు. తెలుగులో స్పష్టమైన సమాచారాన్ని అందించేందుకు ఏఐ ఉపయోగపడుతుందని, అయితే భాషాపరమైన స్పష్టత మాత్రమే సమాచార కచ్చితత్వానికి హామీ కాదని అన్నారు. పేర్లు, మొత్తాలు, అర్హత నిబంధనలు, సాంకేతిక అంశాలను సంబంధిత అధికారులు ధ్రువీకరించాలని సూచించారు.
ప్రజల సమాచార భద్రతకు ప్రాధాన్యం
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు అందించే వ్యక్తిగత సమాచారాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. అనుమతి లేని ఏఐ సాధనాల్లో అధికారిక లేదా వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయరాదన్నారు. ఏ సమాచారాన్ని వినియోగించవచ్చు.. దేనికి ప్రత్యేక అనుమతులు అవసరం.. ఏ సమాచారాన్ని నమోదు చేయకూడదు అనే అంశాలపై ఉద్యోగులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఏఐ రూపొందించిన సమాచారం తప్పుగా ఉండే అవకాశం ఉన్నందున దాన్ని అధికారిక రికార్డుల్లో చేర్చే ముందు లేదా నిర్ణయాలకు ఆధారంగా ఉపయోగించే ముందు ధ్రువీకరించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదేనన్నారు. ఏఐ ఆధారంగా తీసుకున్న నిర్ణయాల్లోనూ మానవ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, ప్రతికూల నిర్ణయాలపై పౌరులు అధికారులను సంప్రదించే అవకాశం కల్పించాలని తెలిపారు. ఏఐ ఆధారిత వ్యవస్థలకు అధికారాలు కల్పించే ముందు వాటి పరిమితులను స్పష్టంగా నిర్ణయించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ముసాయిదా తయారు చేసే సాధనానికి, అధికారిక ఆదేశాలు పంపే లేదా రికార్డులను మార్చే వ్యవస్థకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించి తగిన నియంత్రణలు ఏర్పాటు చేయాలన్నారు. ఏదైనా తప్పు జరిగితే బాధ్యత వహించే వ్యక్తి ఎవరో స్పష్టంగా ఉండాలన్నారు. ప్రతి శాఖలో చిన్నస్థాయి ప్రయోగాలతో ప్రారంభించి, వాటి కచ్చితత్వం, ఖర్చు, ప్రజలకు కలిగే ప్రయోజనం, పనితీరును అంచనా వేసిన తర్వాతే విస్తరణ చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ‘ఏఐ సాక్షమ’ కీలక పాత్ర పోషిస్తుందని భట్టి అన్నారు. కార్యక్రమంలో ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, టీజీ మ్యాథ్ ఎండీ పూజ, ఎంసీఆర్ హెచఆర్‌డీ డైరెక్టర్ జనరల్ శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





