– రైళ్ల కేటాయింపులో కేంద్రం వివక్ష తగదు
– అక్కడ నిరసనలకు ఆటంకం.. ఇక్కడ పాదయాత్రలు
– బీజేపీ తీరుపై మంత్రి పొంగులేటి ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : ప్రజాస్వామ్యం, నిరసన తెలిపే హక్కుల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులు తమ పాలనలో అనుసరించిన విధానాలను గుర్తు చేసుకోవాలని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. గతంలో నిరసనలు, ధర్నాలకు అవకాశం లేకుండా ఇందిరా పార్కులో ధర్నా చౌక్‌ను ఎత్తివేసిన వారే ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సచివాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నా చౌక్‌ను పునరుద్ధరించి ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు అవకాశం కల్పించిందని తెలిపారు. గతంలో నిరసన తెలిపిన వారిని అణచివేయడం, నోరు మూయించే ప్రయత్నాలు చేయడం వంటి చర్యలకు పాల్పడినవారు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలని హితవు పలికారు. నవంబర్ 2న హోం మంత్రి అమిత్‌షా పాదయాత్రపై పొంగులేటి స్పందిస్తూ కేంద్రంలో నిరసనలకు ఆటంకాలు కల్పిస్తూ తెలంగాణలో పాదయాత్రలు చేపట్టాలని బీజేపీ నాయకులు భావించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా తన అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవచ్చని, పాదయాత్రలు నిర్వహించవచ్చని తెలిపారు. అయితే అదే స్వేచ్ఛను ఇతర పార్టీలకు కూడా కల్పించాలన్నదే తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అర్హులైన ఓటర్ల ఓటు హక్కును తొలగిస్తున్నారనే అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోందని, ‘సర్’ ప్రక్రియలో ఓటర్ల సమస్యలపై పునఃపరిశీలన జరిపి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తోందని అన్నారు. ఈ అంశంపై నాలుగైదు నెలలుగా దిల్లీ కేంద్రంగా వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టినా కేంద్రం, కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం లేదని విమర్శించారు. ఎన్నికల ప్రధాన కమిషనర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఆయన రాజీనామా చేసేలా చూడాలని లేదా చట్టప్రకారం పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందన్నారు.
దిల్లీ ర్యాలీకి రైళ్లు కేటాయించకపోవడం సమంజసం కాదు
ఓటు హక్కు పరిరక్షణకు చేపట్టిన ఆందోళనలో భాగంగా నవంబర్ 1న దిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించాలని ఇండి కూటమి పిలుపునిచ్చినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రైల్వే బోగీలు కేటాయించాలని కోరినా కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని విమర్శించారు. పది రోజులుగా రాష్ట్రంతోపాటు పలు రాష్ట్రాల్లో ఇండి కూటమి నేతలు, కార్యకర్తలకు రైళ్ల కేటాయింపులో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రాజకీయ కార్యక్రమాలకు రైళ్లను కేటాయించే విషయంలో కేంద్రం రాజకీయాలకతీతంగా వ్యవహరించాలని సూచించారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజాప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాలని, ప్రజాస్వామ్యబద్ధమైన కార్యక్రమాలకు అవసరమైన రవాణా సదుపాయాలను కల్పించాలని కోరారు.
కేంద్ర సంస్థల వ్యవహారాలపై ఆధారాలతో ప్రశ్నిస్తాం
‘సర్’ ప్రక్రియతోపాటు రైల్వే శాఖ వ్యవహారాలు, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్ణయాలపై తమ పార్టీ ప్రశ్నలు లేవనెత్తుతుందని పొంగులేటి తెలిపారు. వివిధ అంశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను ఆధారాలతో ప్రజల ముందుంచుతామన్నారు. ప్రజాస్వామ్యబద్ధమైన నిరసనలను అడ్డుకోవడం, రాజకీయ కార్యక్రమాలకు ఆటంకాలు కల్పించడం వంటి చర్యలపై ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.
నిరాడంబరంగా మంత్రి పొంగులేటి పుట్టిన రోజు
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం తన పుట్టిన రోజు వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. ఈ ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్‌రెడ్డి పొంగులేటికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి కూడా పాల్గొని మంత్రి పొంగులేటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎలాంటి ఆర్భాటాలు, వేడుకలు నిర్వహించవద్దని, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలని మంత్రి ముందస్తుగా తన అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సంయమనం పాటించాలని, తన పుట్టిన రోజును నిరాడంబరంగా గడపాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి స్పష్టం చేయడమే గాక ఆచరణలో చూపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





