అర్చకులు రంగరాజన్‌పైదాడి అమానుషం..

  • ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలకు తావులేదు..
  • నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
  • కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి

న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి  10 : చిలుకూరు బాలాజీ ప్రధానార్చకుడు రంగరాజన్‌ ‌పై జరిగిన దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని  కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.  గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదు.

ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలి. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న శ్రీ రంగరాజన్‌.. ‌దేవాలయాలను, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడే విషయంలో ముందు వరుసలో ఉన్నారు. దీన్ని సమాజంలోని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలి. సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కిషన్‌ ‌రెడ్డి డిమాండ్‌ ‌చేశారు.  భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలన్నారు.భారతీయ జనతాపార్టీ రంగరాజన్‌ ‌కి అన్నిరకాలుగా అండగా నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page