అదానీ కోసమే అనుముల అన్నదమ్ముల తపన
కొడంగల్ కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం
రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
కొడంగల్ లో జన సంద్రోహం మధ్య దద్ధరిల్లిన రైతు నిరసన దీక్ష
కొడంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : తెలంగాణలో ఏడాది కాలంగా కౌరవ పాలన కొనసాగుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కొడంగల్‌లో బీఆర్‌ఎస్ రైతు నిరసన దీక్ష సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కొడంగల్ కురుక్షేత్రం మాదిరిగా యుద్ధం నడుస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆయన అల్లుడికి భూములివ్వడానికి లగచర్ల, హకీంపేట రైతులను ఇబ్బందులు పెడుతున్నాడు. ఇల్లు దాటని లంబాడీ ఆడబిడ్డలకు ఇబ్బందులు పెడితే, దిల్లీకి వెళ్లి సమస్యలు చెప్పుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రజల కోసం పని చేయడం లేదు. అనుముల అన్నదమ్ములు, అదానీ కోసమే పని చేస్తున్నారు.
రూ.కోట్లు దోచి పెట్టేందుకే పని చేస్తున్నారు. మా ఎమ్మెల్యే సీఎం అయితే మాకు మంచి చేస్తారని కొడంగల్ ప్రజలు ఆశించారు. కానీ రేవంత్ ప్రజల కోసం పని చేయడం లేదు. భూములు గుంజు కోవాలనేదే ఆలోచన. రైతుబంధు డబ్బులు ఎవరికైనా వచ్చాయా..? అని ప్రశ్నించారు. అనుముల అన్నదమ్ముల కోసం, అదానీ కోసం, అల్లుడి కోసమే కొడంగల్ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి కురుక్షేత్ర యుద్దాన్ని తలపించేలా రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధ్వజమెత్తారు. తన మనుషులకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచిపెట్టడానికే లగచర్ల రైతులపై అక్రమకేసులు బనాయించారని విమర్శించారు.
నేడు కొడంగల్‌లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్, అల్లుడికి కట్నం కింద ఇవ్వడానికే లగచర్ల భూములకు రేవంత్ సూటి పెట్టాడన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా హామీలను అమలుచేస్తున్నానని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పట్నం నరేందర్ రెడ్డిపై పోటీ చేస్తే కొడంగల్ ప్రజలే తీర్పు చెబుతారన్నారు. 50 వేల మెజార్టీకి ఒక్క వోటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. కౌరవరాజు దుర్యోధనుడు లాగా సంవత్సర కాలంగా అరాచకాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఎదురొడ్డి కొడంగల్ ఆడబిడ్డలు అన్నదమ్ములు పోరాడుతున్నారు. సంవత్సర కాలంగా లగచర్ల, కొడంగల్‌లో కురుక్షేత్ర యుద్ధం నడుస్తుంది. 14 నెలల పదవీకాలంలో రైతులు, మహిళలు, వృద్ధులు, యువత కోసం రేవంత్ రెడ్డి ఒక పని కూడా చేయలేదు. అనుముల అన్నదమ్ముల కోసం,అల్లుడి కోసం, ఆదాని కోసం, బామ్మర్దుల కోసం, ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచిపెట్టడానికి కొడంగల్ భూములు ధారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో తొండలు కూడా గుడ్లు పెట్టవని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండు.
కానీ ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో కొడంగల్ నియోజకవర్గం కళకళాలాడుతుందన్నారు లంబాడి ఆడబిడ్డలు గడప దాటి బయటకు రారు అలాంటి వాళ్లను దిల్లీ వెళ్లి న్యాయం కోసం అడిగేలా రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించారన్నారు. అదానీ కంపెనీకి, అల్లుడి ఫార్మ కంపెనీకి భూములు గుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఎకరం 60-70 లక్షలు విలువ చేసే భూములకు 10 లక్షలు పరిహారం ఇవ్వడం ఏంటని అడిగినందుకు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు బనాయించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులను వదిలేసి కేవలం బీఆర్‌ఎస్ నేతలపైనే అక్రమంగా రేవంత్ ప్రభుత్వం కేసులు పెట్టిందని కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి జైలుకు పోయాడు. అర్ధరాత్రి పోలీసులను ఊరు మీదికి పంపి లంబాడి ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి అవమానించాడని లగచర్ల జ్యోతి శివంగిలాగా దిల్లీలో లడాయి చేసిందన్నారు.
బంజారా ఆడబిడ్డల పోరాటంతోనే లగచర్ల రైతులకు న్యాయం జరిగిందని తన బిడ్డకు పేరు పెట్టమని జ్యోతి అడగడంతో.. భూ పోరాటంలో పుట్టింది కాబట్టి ఆమెకు భూమి పేరు పెట్టానన్నారు. కొడంగల్ రైతుల భూ పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా నిలబడిందని వొచ్చే ఎన్నికల్లో కొడంగల్ ఆడబిడ్డలు రేవంత్ రెడ్డిని చిత్తుచిత్తుగా వోడిస్తారన్నారు. ఎప్పుడు ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని కొడంగల్‌తో పాటు తెలంగాణ మొత్తం ఎదురుచూస్తుందని అన్ని హామీలు అమలు చేస్తున్నా అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం కూడా చేయడు ఇంట్లోనే ఉంటారు.. అయినా సరే ఆయనకు 50 వేల మెజారిటీకి ఒక్క వోటు తక్కువ వచ్చిన నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.
లంకె బిందెలు ఉన్నాయనుకుని అడ్డమైన హామీలు ఇచ్చానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడన్నారు. రైతు రుణమాఫీకి ఇచ్చే నిధుల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం గోల్మాల్ చేసిందని మొత్తం రుణమాఫీకి 49,500 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం రూ. 11 వేల కోట్లు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం గప్పాలు కొట్టుకుంటుంది. చారాన మందం కూడా రుణమాఫీ కాలేదన్నారు. తులం బంగారం ఇయ్యలేదు. స్కూటీ లేదు రుణమాఫీ చెయ్యలేదని కేసీఆర్ 12 సార్లు రైతుబంధు ఇచ్చిండు. 73,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కేసీఆర్ గారు వేశారన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రైతుబంధు కోసం రూ. 7,600 కోట్ల రూపాయలను జమచేసి కేసీఆర్ గారు పెట్టారని రైతుబంధును వేయనీయద్దని ఎలక్షన్ కమీషన్‌కు ఫిర్యాదు చేయడంతో బడే భాయ్ మోదీ, ఛోటే బాయ్ రేవంత్ చెప్పిండని రైతుబంధు వేయకుండా ఆపిండన్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో వోట్లు వేయించుకోవడానికి నాలుగు నెలలు ఆపి రైతుబంధు పేరిట నోట్లు రైతుల ఖాతాల్లో రేవంత్ రెడ్డి వేసిండని తెలంగాణ రైతులకు ఎకరానికి రూ. 17,500 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయి అంటే రేవంత్ రెడ్డి రైతుబంధు వెయ్యడని రైతు భరోసా కింద రూ. 15,000 ఇస్తానని రూ. 12,000 ఇస్తున్న రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలన్నారు తాను చెప్పే మాటలు నిజం కాదు అని నిరూపించాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్నికలకు పోవాలని రేవంత్ రెడ్డి పై పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొడంగల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచ్‌లు, బిఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.