ట్యాపింగ్ సమాచారం ఆధారంగా వరుస ప్రశ్నలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్ 15న 600మంది ఫోన్లు ట్యాప్‌పై ప్రభాకర్‌రావును సిట్ ఆఫీసర్లు విచారించారు. ఇప్పటివరకు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ జరిగిందనే దానిపై ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్లపై సుదీర్ఘంగా మూడుసార్లు విచారణ జరిపి ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్‌ను సిట్ అధికారులు రికార్డు చేశారు. నాలుగోసారి విచారణలో భాగంగా వ్యక్తిగతంగా చేసిన ట్యాపింగ్ వ్యవహారంపై విచారణ జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా 2023 నవంబర్ 15న ఏకంగా 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. వీరి ఫోన్ ట్యాప్‌కు సంబంధించి కచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా నడిచిందని గుర్తించిన సిట్.. దీనిపై ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తోంది. మావోయిస్టుల సానుభూతిపరుల పేరుతో రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ జరిగినట్లు సిట్ గుర్తించింది. టెలికాం సర్వీస్ నుంచి సిట్ బృందం కీలక సమాచారాన్ని సేకరించింది. పదవీ విరమణ పొందిన తరువాత ప్రభాకర్ రావు ఓఎస్డీగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ లీగల్ ఇంటర్ ఇంటర్‌సెప్షన్‌కు డిజిగ్నెటెడ్ అథారిటీగా నియమించడంపై సిట్ విచారణ చేస్తోంది. డిజిగ్నెటెడ్ అథారిటీ హోదాలో 7 రోజులు మాత్రమే అనుమానిత ఫోన్‌లు నిఘా పెట్టాల్సి ఉంటుంది. అయితే చట్ట విరుద్ధంగా గడువు ముగిసిన ఫోన్స్‌పై నిఘా, ట్యాపింగ్‌కు పాల్పడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఏడు రోజులు తరువాత అనుమతి ఫోన్స్‌పై నిఘా పెట్టాలంటే రివ్యూ కమిటీ అనుమతి ఉండాల్సి ఉంది.