– బనకచర్ల ఏ బేసిన్‌లో వుందో ముఖ్యమంత్రికి తెలియదు
– బనకచర్లపై ప్రభుత్వాన్ని నిద్రలేపింది మేమే
– అనుమతులు ఇప్పటికే వొచ్చాయి
– ఇక చంద్రబాబు ఇచ్చుడేంది?
– కృష్ణానదిపై కూడా అవగాహన లేకపోవడం దారుణం
– నదుల అనుసంధానంపై తెలంగాణ అనుమతి అవసరం
– మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బేసిన్‌లపై బేసిక్ నాలెడ్జ్ కూడా లేదన్న సంగతి స్పష్టమైందని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఈయనకు బ్యాగుల మీద మంచి నాలెడ్జ్ ఉన్నట్టుంది గాని బేసిన్ల మీద నాలెడ్జ్ లేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్‌కు దేవాదుల ఏ బేసిన్‌లో ఉన్నదో, బనకచర్ల ఏ బేసిన్లో కడుతున్నారో తెలియకపోవడం దౌర్భాగ్యమన్నారు. బనకచర్ల ప్రాజెక్టు మీద ఏపీ ఆరు నెలలుగా పనిచేస్తున్నదని, కేంద్రానికి ఉత్తరాలు రాస్తూ కేంద్ర ఆర్థికమంత్రిని, కేంద్ర జలమంత్రిని కలుస్తూ ముందుకు పోతుంటే బనకచర్ల ఏ బేసిన్‌లో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ అడగడం ఆయన అమాయకత్వానికి నిదర్శనమన్నారు. ఆంధ్ర దోపిడీని అడ్డుకొని తెలంగాణ పొలాలకు నీళ్లు పారియ్యవయ్యా అంటే ఇంతవరకు చేతకాలేదని విమర్శించారు. ఆయన సలహాదారుడు ఆదిత్యనాథ్ దాస్ బనకచర్ల ప్రకాశం జిల్లాలో ఉందంటాడు.. అది ఉన్నది నంద్యాల జిల్లాలో. ముఖ్యమంత్రి కంటే ఆయన సలహాదారుడు గొప్ప ఘనుడుగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. మాట్లాడితే నల్లమల బిడ్డ అంటాడు.. నల్లమల తెలంగాణ కిందికి వస్తుందా .. ఆంధ్ర కిందికి వస్తుందా? అని ప్రశ్నించారు. బనకచర్ల విషయంలో మొద్దునిద్ర లేపింది బీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనన్నారు. తాను రెండుసార్లు ప్రెస్‌మీట్ పెట్టి వాయిస్తే పాత డేట్లు వేసి ఉత్తరాలు విడుదల చేశారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడకుండా రాజకీయ వేదికగా మార్చారంటూ విమర్శించారు. బనకచర్లను ఆపడానికి ప్రయత్నం మాట అట్లా వుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఘోరమన్నారు. గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టిఎంసీలు ఇచ్చి ఎంతైనా తీసుకుపో అంటాడు. నిన్నటి ప్రెజెంటేషన్‌లోనే సుబ్రమణ్యప్రసాద్ 968 టీఎంసీలకు తెలంగాణలో ప్రాజెక్టుగా రూపకల్పన జరిగిందని స్పష్టంగా చెప్పారు. అందులో 946 టీఎంసీ సీడబ్ల్యుసి హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 968 టీఎంసీలు కేటాయిస్తూ కేసీఆర్ జీవోలు ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ 968లో 946 టీఎంసీలకు అన్ని అనుమతులు సాధించామన్నారు. ఇక చంద్రబాబు వెయ్యి టీఎంసీలు ఇచ్చుడేంది? అంటే బనకచర్ల కట్టుకో అనే అర్థమా అని సందేహం వెలిబుచ్చారు. కేసీఆర్ గతంలో జల్ శక్తి మంత్రికి రాసిన లేఖలో గోదావరిలో 968 టీఎంసీ మాకు కేటాయించారు, 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి.. అందులో 1950 టీఎంసీ మాకు కావాలి అని స్పష్టం చేశారు. మరి రేవంత్ రెడ్డి మాత్రం వేయి ఇచ్చి మొత్తం తీసుకో అంటున్నారు. ఎవరు ఏపీకి దాసోహం అవుతున్నారో తెలియడంలేదా అని ప్రశ్నించారు.
కృష్ణానది విషయంలోనూ అదే అజ్ఞానం. ఆ జిల్లాలో పుట్టి కృష్ణా నదిపై అవగాహన లేకపోవడం దారుణం. ముఖ్యమంత్రి పక్కన పెట్టు.. జడ్పీటీసీ, ఎమ్మెల్యేగా చేసినావు కదా. అందులో కూడా 500 టిఎంసి ఇచ్చి మొత్తం నీళ్లు తీసుకో అనడం కంటే అన్యాయం మరేమైనా వుందా అని ప్రశ్నించారు. కెసిఆర్ పాదయాత్ర తర్వాత అప్పటి ప్రభుత్వం దిగివచ్చి ఎడమ కాలువ లిఫ్టులు, కుడి కాలువలు ప్రభుత్వమే మెయింటైన్ చేస్తున్నది. అది పోరాడి సాధించిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. 750 టీఎంసీల నీళ్ళు రావాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరఫున వాదించాం. సెక్షన్ 3 కోసం కేసీఆర్ పోరాటం చేశారు. కృష్ణాలో తాత్కాలిక ఒప్పందం ప్రకారం మనకు 299 టీఎంసీలే వచ్చాయి. అది ఈ కాంగ్రెస్ దరిద్రం వల్లనే. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, నీటి కేటాయింపులు చేయకపోవడం వల్ల నిర్ణయం జరిగింది. ఆ పాపం కాంగ్రెస్‌దే. న్యాయమైన వాటా కోసం సుప్రీంకు వెళ్లాల్సి వచ్చింది. పోలవరం ద్వారా మళ్ళించే 80 టీఎంసీలలో 45 టీఎంసీలు రావాలని కూడా చేర్చారు. దాని ప్రకారం 75శాతం డిపెండబిలిటీ కింద 555 టీఎంసీ, 65 డిపెండబులిటీ కింద 43 టీఎంసీ సగటున 120 టీఎంసీ, వాటర్ డైవర్షన్ కింద 45 టీఎంసీ అన్నీ కలిపి 763 టీఎంసీలు కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు రావాలని ట్రిబ్యునల్ ముందు అప్పటి ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది. మీరు చెబుతున్నది ట్రిబ్యునల్ ను ఎఫెక్ట్ చేయదా అని ప్రశ్నించారు. 3000 టీఎంసీ అనే బ్రహ్మ పదార్థం కేసీఆర్ కనిపెట్టాడంటారు. 60 ఏళ్ల సీడబ్ల్యుసీ లెక్కల ప్రకారం ఏటా కనీసం 3000 టీఎంసీ నీరు సముద్రములో కలుస్తున్నది. ఇదే విషయాన్ని కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో చెప్పారు. దీన్ని కూడా రేవంత్ రెడ్డి వక్రీకరించారు. బనకచర్ల ముచ్చట ఇక్కడ లేదు. నిన్న రేవంత్ రెడ్డి అపెక్స్ కౌన్సిల్లో చదివిన దాన్ని నేను కూడా చదువుతాను. బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లాలని అందులో ఎక్కడా లేదు. కృష్ణా నదిలో రెండు రాష్ట్రాలకు నీటి వినియోగం వెయ్యి టీఎంసీలకు మించడం లేదు. యేటా 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్తోంది. ఈ నీటిని రెండు రాష్ట్రాలు ఎలా ఉపయోగించుకోవాలనే అంశంపై ఇద్దరూ కూర్చొని మాట్లాడుకోవాలని, రెండు రాష్ట్రాలకు లాభం చేకూరే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కేసీఆర్ సూచించారు. అదే పేజీలో చెప్పిన ఇంకో అంశాన్ని మాత్రం కావాలని చదవలేదు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం విషయంలో తెలంగాణను సంప్రదించకుండా ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని, ఒకవేళ వెళ్తే తెలంగాణ అందుకు అంగీకరించదని చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని దాచిపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో కేసీఆర్ ఎన్నడూ ఒప్పుకోలేదు. అసలు బనకచర్ల అనే చర్చ లేదు. జగన్‌తో ఏమి మాట్లాడామో ఎజెండా ఉంటే బయట పెట్టు. రెండు రాష్ట్రాలకు నదీ జలాల గురించి కేసీఆర్ మాట్లాడారు. వాస్తవానికి ఆ ప్రస్తావన ముందుకు పోలేదు. జగన్ అంగీకరించలేదు. నదీ మార్గంగా నీళ్లు తేవాలని అప్పుడు అనుకున్నారు. దానివల్ల నాగార్జునసాగర్, శ్రీశైలం పరిధిలో నీళ్లు వస్తాయన్నది అసలు ఉద్దేశం. కానీ ఈరోజు వీళ్లు చేస్తున్నది నదీ మార్గంగా కాకుండా తెలంగాణ టచ్ కాకుండా 200 టీఎంసీలు తన్నుకుపోతున్నారు. దీన్ని ఆపాల్సిన బాధ్యత మన మీద లేదా? తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కట్టలేదు అంటారు. మరి కాంగ్రెస్ 2004-14 మధ్యలో ఆయకట్టు 6.64 లక్షల ఎకరాలు కాగా బీఆర్‌ఎస్ పాలన కొనసాగిన 2014-23 మధ్య కాలంలో 48.74 లక్షల ఎకరాలు. ఏ ప్రాజెక్టూ కట్టకుండానే ఇది సాధ్యమైందా? గోదావరి మీద కేసీఆర్ అనేక ప్రాజెక్టులు కట్టారు. సమ్మక్క సాగర్, సీతమ్మ సాగర్ ఇలా అన్ని ప్రాజెక్టులకు హైడ్రాలజీ క్లియరెన్స్ తెచ్చాం. కల్వకుర్తి బీమా నెట్టెంపాడు కోయిల్ సాగర్ పూర్తిచేసి 6.50 లక్షలు ఎకరాలకు నీళ్లు ఇచ్చాము. 18 నెలల్లో ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేసావా? ఒక్క చెక్ డామ్ కట్టావా? పెద్దవాగు కొట్టుకుపోయింది, ఎస్‌ఎల్‌బీసీ కూలింది. వట్టెం పంపు మునిగింది. తమ్మిడిహట్టి వద్ద గ్రావిటీతో నీళ్ళు వస్తాయి అంటారు. కానీ రెండు లిఫ్టులు అవసరం. ఇది ప్లాన్‌లోనే ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. నీటిని 66:34 రేషియోలో పదేళ్లు బీఆర్‌ఎస్ వాడుకున్నది. కానీ కాంగ్రెస్ వచ్చాక తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా వాడుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లైనింగ్ పనులు ప్రారంభమయ్యాయి.ఆపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. దానిమీద ఎందుకు స్పందిండంలేదని ప్రశ్నించారు. ఎస్‌ఎల్‌బీసీ కూలి ఇన్ని రోజులు అవుతుంది. ఎన్‌డీఎస్ ఎందుకు రాదు. బిజెపి ఎందుకు పంపదని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం వల్ల ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు కుప్పకూలింది. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉత్తం రాజీనామా చేయాలి. ఇప్పుడుఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకమైంది.ఇప్పటికి శవాలు కూడా బయటికి తేలేదు. తప్పు మీది కాదా? ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్, మేమందరం తెలంగాణ కోసం పోరాటం చేసినోళ్లం. నీళ్ల మీద, నదుల మీద ప్రజలకు అవగాహన కల్పించి సమాయత్తం చేసింది కేసీఆర్. పోతిరెడ్డి ప్రాజెక్టును నిరసిస్తూ ఆరుగురు మంత్రులం రాజీనామా చేశామన్నారు.