– బంధువులకు మృతదేహాల అప్పగింత
రంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబరు 3 : చేవెళ్ల మండలంలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులకు శవపరీక్ష పూర్తి చేసి బందువులకు అప్పగించారు. ఈ ఘటనలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ డ్రైవర్లతోపాటు 19 మంది మృతిచెందగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. ఖానాపూర్ గేట్ దగ్గర ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్‌లకు తరలించారు. మృతుల్లో ఎక్కువగా తాండూరు వాసులు ఉన్నారు. చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో 18 మంది మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. తాండూరు, వికారాబాద్, గాంధీ, ఉస్మానియా వైద్యులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు. మృతదేహాలని వారి స్వస్థలాలకి పంపించారు. నాగమణి మృతదేహం కర్ణాటకలోని భానూర్‌కు తరలించారు. అనూష, సాయిప్రియ, నందిని, నజీర్ అహ్మద్, విద్యార్థి అఖిల మృతదేహాలని తాండూరుకు పంపించారు. అలాగే, కల్పన, గుణమ్మ మృతదేహాలు హైదరాబాద్ బోరబండకు.. తారిబాయి మృతదేహం గంగారం తండాకు తరలించారు.
అంతా క్షణాల్లో జరిగిపోయి : కండక్టర్ రాధ
ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ బస్సు కండక్టర్ రాధ ఆ భయానక ఘటనను కన్నీళ్లతో గుర్తుచేసుకున్నారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందlr ని అన్నారు. టిప్పర్ చాలా వేగంగా వస్తున్నదని తను, డ్రైవర్ గమనించామని, డ్రైవర్ బస్సును కిందకు తిప్పే ప్రయత్నం చేశాడని, అలా చేయకపోయి ఉంటే ఇంకా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయేవారని చెప్పారు. చిట్టేపల్లి దగ్గర ఒక మహిళ బస్సులో ఎక్కింది. వికారాబాద్ దగ్గర ముగ్గురు పోలీసులు ఎక్కారు.. తరువాత వారు దిగిపోయారు. అందరూ సంతోషంగా తమ పనులకెళ్లడానికి బయల్దేరారు. ఒక్క క్షణంలోనే అంతా చిధ్రం అయిపోయింది. ఆ తర్వాత ఏమైందో గుర్తులేదని అన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు లోపల కలిగిన పరిస్థితులను రాధ వర్ణిస్తూ.. డ్రైవర్ వెనుక కూర్చున్న వాళ్లపై చాలా కంకరాళ్లు పడ్డాయి. నేను పక్కకు పడిపోయాను. ఓ వ్యక్తి నన్ను లాగి కాపాడాడు. తల నుంచి రక్తం కారుతుండడంతో నా చున్నీతో నేనే కట్టుకున్నానని వివరించారు. డ్రైవర్ దస్తగిరి చాలా మంచివాడు. డ్రైవింగ్‌లో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు. నన్ను అక్కా అని పిలిచేవాడు. ఇవాళ మధ్యాహ్నం రమ్మని అడిగితే ‘రాలేను అక్కా’ అన్నాడు. అంతలోనే ఇంత పెద్ద విషాదం జరగడం చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన వెంటనే వెనుక వస్తున్న వాహనాలు, జేసీబీ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొన్నాయని, బస్సు, టిప్పర్ వాహనాలను పక్కకు తొలగించి గాయపడిన వారిని బయటకు తీయడం జరిగినట్లు రాధ వివరించారు.\
ఎమ్మెల్యే కాలె యాదయ్యను నిలదీసిన జనం
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే కాలయ్య సంఘటనా స్థలానికి చేరుకోగా ఆయనకు నిరసన సెగ తగిలింది. బస్సు ప్రమాదం జరిగిన చాలా సమయం తరువాత ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని నిలదీశారు. అనేకసార్లు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పినా నిరక్ష్యం చేశారని ప్రజలు ఆందోళనకు దిగారు. దీంతో ఘటన స్థలం నుంచి ఎమ్మెల్యే యాదయ్య వెళ్లిపోయారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





