కూలీల ప‌ట్ల శాపంగా మారిన సాంకేతిక‌త‌

  • ఆధార్‌తో అనుసంధానం కాక ఇబ్బందులు
  • ధ్రువీక‌ర‌ణ లేక ఉపాధి కోల్పోతున్న వైనం
  • చుక్క‌లు చూపిస్తున్న ఇంట‌ర్నెట్‌

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భారతదేశంలోని పల్లె ప్రాంతాలలో నివసించే నిరుపేద కుటుంబాలకు కనీస కూలి పనిని, తద్వారా జీవన భద్రతను కల్పించే ఒక ముఖ్యమైన చట్టం. అయినప్పటికీ, ఇటీవల, కేంద్ర ప్రభుత్వం జాతీయ చరవాణి పర్యవేక్షణ వ్యవస్థ ( ఎన్ ఏం ఎంఎస్) ,ముఖ గుర్తింపు అనువర్తనం ( ఫేస్ ఆర్ డి ఆఫ్)ల ద్వారా అమలు చేస్తున్న ముఖ ఆధారిత సంఖ్యరూప (డిజిటల్) హాజరు విధానం, ప్రస్తుతం కోట్లాది మంది కూలీల కూలి హక్కును ప్రశ్నార్థకం చేస్తోంది. వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతిని అరికట్టాలనే గొప్ప ఉద్దేశం ఉన్నప్పటికీ, క్షేత్ర‌ స్థాయిలో ఈ కొత్త సాంకేతికత సృష్టిస్తున్న ఇబ్బందులు, సంక్లిష్టమైన వలలా పేద శ్రామికుల కూలిని హరించివేస్తున్నాయి. నిజాయితీ సాధన పేరుతో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య, నిజమైన కూలీల పాలిట శాపంగా మారుతుందన్న ఆందోళన వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విధానం అమలులో శ్రామికులను వేధిస్తున్న మొదటి సమస్య విద్యుత్  ఖాతా ధ్రువీక‌ర‌ణ‌ ( ఈ కేవైసీ). ప్రతి కూలీ తమ ఉద్యోగ పత్రాన్ని ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేయించుకోవాలి.

ఈ క్రమంలో, ఆధార్ పత్రంలోని పాత చిత్రంతో కూలీ యొక్క ప్రస్తుత ముఖం సరిపోలకపోవడం పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా వయస్సు పైబడిన వృద్ధులు, కాలంతో పాటు ముఖంలో వచ్చిన మార్పులు, అనారోగ్యం, లేదా ముఖంపై వెంట్రుకలు పెంచుకోవడం వంటి కారణాల వల్ల అనువర్తనంలో ధ్రువీకరణ పొందలేకపోతున్నారు. దీని ఫలితంగా, నిజంగా పని చేయడానికి సిద్ధంగా ఉన్న వేలాది మంది పేద కూలీలు ధ్రువీకరణ పూర్తి కానందున, ఉపాధిని కోల్పోతున్నారు. కేవలం సాంకేతిక కారణాల వల్ల వ్యవస్థ నుంచి బయటకు నెట్టివేయబడుతున్న ఈ దుస్థితి, పథకం యొక్క సామాజిక సమానత్వం లక్ష్యానికి పూర్తిగా విరుద్ధంగా ఉంది.
రెండవ అతిపెద్ద సమస్య సాంకేతిక మౌలిక వసతుల కొరత. కూలి పనులు జరిగే అనేక పల్లె ప్రాంతాలు, ముఖ్యంగా అడవులు, పొలాలు, మరియు కొండ ప్రాంతాలలో చరవాణి అంతర్జాల సంధానం (నెట్‌వర్క్ కనెక్టివిటీ) చాలా బలహీనంగా లేదా పూర్తిగా లేకుండా ఉంటుంది.

జాతీయ చరవాణి పర్యవేక్షణ వ్యవస్థ అనువర్తనంలో రోజుకు రెండుసార్లు ముఖ గుర్తింపు ద్వారా హాజరును ప్రాంత గుర్తింపు (జియో-ట్యాగింగ్)తో సహా అంతర్జాలంలో నమోదు చేయాల్సి ఉంటుంది. సంధానం లేని చోట, పని పరిచయకర్తలు (మేట్లు/క్షేత్ర సహాయకులు) గంటల తరబడి అంతర్జాల సంకేతం కోసం వేచి చూడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నిరంతర అంతర్జాల సమస్యల కారణంగా, కూలీల విలువైన పని గంటలు వృథా అవుతున్నాయి. ఉదయం హాజరు నమోదై, మధ్యాహ్నం సాంకేతిక లోపం లేదా అంతర్జాల సంకేతం దొరకకపోవడం వల్ల హాజరు నమోదు కాకపోతే, ఆ రోజు కూలీకి సగం కూలి మాత్రమే చెల్లించబడుతోంది.

అనువర్తనాలు నిలిచిపోవడం మరియు ముఖ గుర్తింపు సరిగా పనిచేయకపోవడం వంటి లోపాలు నిత్యకృత్యమయ్యాయి. దీనివల్ల నిజమైన కూలీల హాజరు కూడా సక్రమంగా నమోదు కాక, వారి కూలి హక్కు ప్రమాదంలో పడుతోంది. పని పరిచయకర్తలు సాంకేతిక అంశాలపై పూర్తి పట్టు లేక, కూలీల నిరసనలు, అధికారుల ఒత్తిడి కారణంగా నిత్యం వేధింపులు ఎదుర్కొంటున్నారు. సాంకేతికతను మానవ జీవితాలను సులభతరం చేసే సాధనంగా చూడకుండా, దాన్ని ఒక కఠినమైన నియమంగా అమలు చేయడం ద్వారా మానవీయ విలువలకు తిలోదకాలిచ్చినట్ల‌వుతోంది. సంఖ్యరూప హాజరు విధానంలో సాంకేతిక సమస్యలు లేదా సంధాన లోపాల కారణంగా హాజరు నమోదు చేయలేకపోయినా, కూలీలు శారీరక శ్రమ చేసినప్పటికీ, దాన్ని వ్యవస్థ గుర్తించదు. ‘రికార్డులలో లేకపోతే, మీరు పని చేయనట్లే’ అన్న పరోక్ష సందేశం ఇక్కడి నిరుపేద శ్రామికులకు వెళుతోంది.

ఈ విధానం పని పరిచయకులను, కూలీలను కూడా సాంకేతికతకు దాస్యులను చేస్తోంది. హాజరు ప్రక్రియలో ఆలస్యం జరిగినా, లేదా ముఖం సరిపోలకపోయినా, అనువర్తనంలో మానవీయంగా నమోదు చేసే ప్రత్యామ్నాయ అవకాశం లేకపోవడం వలన, నిరంతరం శ్రమించే వర్గం తమ వేతన భద్రత కోసం సాంకేతిక యంత్రం దయపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉపాధి హామీ పథకంలో సంఖ్యరూప హాజరు అనేది అవినీతిని నిర్మూలించి, ప్రభుత్వ నిధులను రక్షించడంలో తిరుగులేని సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది పథకం యొక్క నిజాయితీకి ఒక బలమైన పునాది.

అయితే, ఈ సాంకేతికతను అమలు చేసేటప్పుడు,  ఏ ఒక్క పేద కూలీ కూడా నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం మానవతా దృక్పథాన్ని ప్రదర్శించాల్సిన ఆవశ్యకత ఉంది. అంతర్జాలం లేని ప్రాంతాలలో చరవాణిలో నిల్వ చేసి, తర్వాత పంపే (సాంకేతిక పత్రం నిల్వ) సామర్థ్యాన్ని పెంచడం, సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు మానవీయ హాజరుకు ప్రత్యామ్నాయ పద్ధతులను సులభతరం చేయడం,  విద్యుత్తు ఖాతా ధృవీకరణ ప్రక్రియను వృద్ధ శ్రామికులకు అనుగుణంగా సరళీకృతం చేయడం వంటి చర్యలు తక్షణావసరం. లేదంటే, ముఖం చూసి వేటాడుతున్న ఈ సాంకేతిక వల, ఉపాధి భద్రతకు బదులు కూలి కోతకు దారితీసే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page