– బీహార్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి పిలుపు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: భారత దేశం నుంచి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టడానికి మహాత్మా గాంధీజీ చంపారన్ జిల్లా వేదికగా సత్యాగ్రహాన్ని ప్రారంభించారని, అదే స్పూర్తితో నేడు బీహార్ రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కాంగ్రెస్ బీహార్ ఎన్నికల పరిశీలకుడు, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. చరిత్రాత్మక సంఘటనకు కారణమైన చంపారన్ జిల్లా నుంచే మహాగఠ్ బంధన్ గెలుపునకు బాటలు వేయాలని కోరారు. బీహార్ రాష్ట్రం పశ్చిమ చంపారన్ జిల్లాలోని చనుపటియా, భాగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలలో స్పష్టమైన మార్పు వాతావరణం కనిపిస్తున్నదన్నారు. ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో మహాగఠ్‌బంధన్ కూటమికి అద్భుతమైన ప్రజా మద్దతు లభిస్తోందని నవంబర్ 6, 11 తేదీల్లో జరిగే ఎన్నికల్లో మహాగఠ్ బంధన్‌ను భారీ మెజార్టీతో బీహార్ ప్రజలు గెలిపించబోతున్నారని, అవకాశవాద రాజకీయాలకు బీహార్ ప్రజలు ముగింపు పలకడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగావకాశాలు లేక వలసలు పోతున్నవేళ మహాగఠ్‌బంధన్ తన ఎన్నికల ప్రణాళికలో ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామంటూ ప్రకటించడంతో ఇప్పుడు యువతలో ఆశలు చిగురిస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని 7.40 కోట్ల మంది ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళిక రూపొందించామని, మహిళల కోసం ప్రకటించిన పధకాలు సరికొత్త అధ్యయనాన్ని లిఖించబోతున్నాయని మంత్రి పొంగులేటి అన్నారు. తాము పర్యటిస్తున్న ప్రాంతాల్లో ప్రజలు మహాగఠ్ బంధన్ కూటమికి మద్దతు తెలుపుతున్నారని, తమ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను విశేషంగా చైతన్యపరిచారని, అదే రాబోయే గెలుపునకు మూల సూత్రమని అభిప్రాయపడ్డారు. ప్రజలు రాబోయే తరం కోసం మార్పును ఎంచుకోబోతున్నారని అన్నారు. సమావేశంలో ఏఐసీసీ పరిశీలకుడు బీవీ శ్రీనివాస్, చంపారన్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ సింగ్ పటేల్, అఖిల భారత యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోకో పాధి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార పత్రాన్ని మంత్రి పొంగులేటి తదితరులు విడుదల చేశారు.
—————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





