– ప్రశాంతంగా ముగిసిన వోటింగ్
– భారీగా పోలింగ్ శాతం నమోదు
న్యూదిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో కీలక రాష్ట్రాలైన తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 6 గంటల వరకు క్యూలో ఉన్న వోటర్లకు వోటు వేసే అవకాశం కల్పించారు. ఈ దశలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు కావడం విశేషం. సాయంత్రం 5గంటల వరకు తమిళనాడులో 82.24శాతం, పశ్చిమ బెంగాల్ తొలి విడత ఎన్నికల్లో 89.93శాతం నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. చెన్నైలో 81.34శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. అలాగే, బెంగాల్‌లోని దక్షిణ్ దినాజ్‌పుర్‌లో అత్యధికంగా 93.12శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు. సాయంత్రం 6గంటలతో పోలింగ్ సమయం ముగియగా ఇప్పటికే క్యూ లైన్లలో ఉన్న వారికి వోటు వేసేందుకు అనుమతించారు. ప్రజలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి వోటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడులో సాయంత్రం 5 గంటల వరకు 82.24 శాతం పోలింగ్ నమోదైంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో 89.93 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం. మొత్తం 294 స్థానాలు ఉండగా తొలి విడతలో 152 సీట్లకు ఎన్నికలు జరిగాయి. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. తమిళనాట మొత్తం 234 స్థానాలు, పశ్చిమ బెంగాల్‌లో తొలివిడతలో భాగంగా 152 స్థానాలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7గంటలకే పోలింగ్ ప్రారంభం కాగా ఎండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో వోటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. తొలి గంటల్లోనే పలువురు ప్రముఖులు తమ వోటు హక్కును వినియోగించుకున్నారు.
తమిళనాట పోటెత్తిన వోటరు : దాదాపు 83శాతం పోలింగ్ నమోదు 
చెన్నై: తమిళనాడు వోటర్లు చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు.. తమిళనాడులో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 82.24 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగియగా క్యూలైన్లలో నిల్చున్న వారికి మాత్రమే వోటు వేయడానికి అనుమతి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. రాష్ట్ర చరిత్రలోనే ఇదే అత్యధిక పోలింగ్ శాతంగా నిలిచింది. తమిళనాడులో మొత్తం 4,71,60,321 మంది తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో రాష్ట్ర చరిత్రలో అత్యధిక పోలింగ్ 2011 ఎన్నికల్లో 78 శాతంగా నమోదైంది. 2021 ఎన్నికల్లో 73.63 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. అయితే, ఈసారి ఆ రికార్డులన్నింటినీ అధిగమిస్తూ వోటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ పోటీ చేస్తున్న కొలత్తూరు నియోజకవర్గంలో 83.58 శాతం పోలింగ్ నమోదైంది. మాజీ సీఎం పళణిస్వామి పోటీ చేస్తున్న ఎడప్పాడిలో 89.09 శాతం పోలింగ్ నమోదవడం విశేషం. నటుడు విజయ్ పోటీ చేస్తున్న పెరంబూర్‌లో 86.72 శాతం పోలింగ్ నమోదైంది. తిరుచిరాపల్లి ఈస్ట్‌లో 79.32 శాతం పోలింగ్ నమోదైంది. ఎండను లెక్కచేయకుండా వోటర్లు వోటేసేందుకు క్యూ కట్టారు. ఇక, కొంగునాడు ప్రాంత జిల్లాల్లో కూడా రికార్డు స్థాయిలో వోటింగ్ జరిగింది. కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్, సేలం, నమక్కల్, కరూర్, నీలగిరి, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి తమిళనాడు వోటర్లు ప్రజాస్వామ్యంపై తమ నిబద్ధతను చాటారు. భారీ ఎత్తున పోలింగ్ జరగడంతో రాజకీయ పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. అధిక వోటింగ్ శాతం ఫలితాలపై ఎలా ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎన్నికల బరిలోకి తొలిసారిగా దిగిన విజయ్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. తమిళనాడులో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు విజయ్ టీవీకే పార్టీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
బెంగాల్లోనూ పోటెత్తిన జనం : దాదాపు 90శాతం నమోదు 
కోల్‌కతా :పశ్చిమ బెంగాల్‌లో తొలి విడత పోలింగ్ భారీ రికార్డుల్ని క్రియేట్ చేస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వోటర్లు పోలింగ్ సెంటర్ల ముందు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల వరకు బెంగాల్‌లో 90 శాతం మేర వోటింగ్ నమోదైంది. చాలామంది ఇంకా క్యూ లైన్లలో నిలిచి ఉండటంతో ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి విడతలో భాగంగా 152 స్థానాలకు గురువారం పోలింగ్ జరిగింది. బెంగాల్‌లో మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు 294 కాగా రెండో విడత పోలింగ్ 142 స్థానాలకు ఏప్రిల్ 29న జరగనుంది. పోలింగ్ సరళిని చూస్తే అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), ప్రతిపక్ష బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు జరిగినట్లు తెలుస్తోంది. బెంగాల్ మొదటి విడత ఎన్నికల్లో 1478 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బెంగాల్ ఎన్నికల్లో మరోవైపు హింస చెలరేగింది. ముర్షిదాబాద్‌లో టీఎంసీ కార్యకర్తలు ఏయూజేపీ పార్టీ చీఫ్ హుమాయున్ కబీర్‌పై దాడులు చేశారు. సిలిగురిలో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. కుమార్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు సర్కార్‌పై టీఎంసీ గుండాలు దాడికి పాల్పడ్డారు. మరోవైపు, ఈ వోటింగ్ చూస్తే ఎసఐఆర్ పక్రియ, వోట్ల తొలగింపుపై ప్రజల కోపాన్ని సూచిస్తోందని ఇది టీఎంసీకి అనుకూలమే అని సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, మే 4 టీఎంసీకి గుడ్ బై అంటూ బీజేపీ చెబుతోంది. గంటగంటకు పోలింగ్ పెరుగుతుండటంతో అధికార వ్యతిరేక వోటింగ్ నమోదవుతున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





