“కేజ్రీవాల్ రాజకీయ అనుభవం లేమితో చేసిన తప్పిదాలే ఆప్ కు పూర్తి స్థాయిలో ఎక్కువ నష్టం చేశాయని చెప్పవచ్చును.ఆప్ పతనం లో ఆపార్టీ కీలక నేత కేజ్రీవాల్ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు, ఏకవ్యక్తి కేంద్ర రాజకీయాలు, తన అనుచరులను కూడా నమ్మకపోవడం,సమిష్టి నిర్ణయాలు లేక పోవడం, సంస్థాగత ప్రజాస్వామ్యం సున్నాగా మారడం, రాజకీయ ఎత్తుగడల్లో అపరిపక్వత, రాజకీయ స్పష్టత కొరవడటం ఇవన్నీ కారణాలే..”

(సీనియర్ జర్నలిస్టు, పొలిటికల్ ఎనలిస్టు)
సెల్:9441864514.ఇమెయిల్: thirmal.1960@gmail.com
పార్టీ పెట్టిన కేవలం పదేళ్ళకాలంలోనే జాతీయ పార్టీగా ఎదిగినా ఆమ్ఆద్మీపార్టీ అంతే త్వరితగతిన పతనం అంచులకు చేరుతుంది.ఆప్ పతనంలో బిజేపి రాజకీయ వ్యూహం, ఎత్తుగడలు ఒక కారణం అయితే,అంతే స్థాయిలో ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ స్వయంకృత అపరాధం కూడా అందులో ఎంతో కొంత భాగం ఎక్కువ గానే ఉంది.ఒక ఉన్నత బ్యూరోక్రాట్ గా ఉన్న కేజ్రీవాల్ కొన్నిసదాశయాలకోసం, దిల్లీ మురికి వాడల అభివృద్ధి కోసం ‘సమాంతర్’అనబడే స్వచ్ఛంద సంస్ద ఏర్పరచి చేసిన కృషి.అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా ఉద్యమంలో ముందుకు వచ్చి పూర్తిస్థాయిలో అవినీతిని పారద్రోలాలి అంటే సామాన్యులు పార్టీ ఒకటి ఉండాలనే సాహసం తో అనేక మంది ప్రజాస్వామ్య వాదులు, అవినీతి వ్యతిరేక ఉద్యమకారులతో కలిసి 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కేజ్రీవాల్.పార్టీ పెట్టగానే 2014లో సంకీర్ణ ముఖ్యమంత్రి గా అధికారంలోకి వచ్చారు.
అత్యంత ప్రజాస్వామ్య యుతంగా లోకాయుక్త బిల్లు ప్రధాని స్థాయి వరకు వర్తింపజేయాలనే డిమాండ్ తో ముఖ్యమంత్రి గా రాజీనామా చేసి ఎన్నికల కు వెళ్ళి 2015లో ఆమ్ఆద్మీపార్టీ సింగిల్ గానే అత్యధిక సీట్లతో దిల్లీ శాసనసభలో అధికారం లోకి వచ్చింది.ఇదే యాడాది నుండి కేజ్రీవాల్ వైఖరి నచ్చక యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లాంటి ప్రముఖులు ఆఫ్ నుండి నిష్క్రమించారు. 2019 నాటికి ఆప్ ప్రభుత్వం విద్యా,వైద్య రంగాల్లో తెచ్చిన ఘననీయమైన సంస్కరణ లను ప్రజలు స్వాగతించారు.నిజాయితీకి నిలువుటద్దాలైన గోపాల్ రాయ్,సత్యేంద్రజైన్,మనీష్ సిసోడియా లాంటి కీలక వ్యక్తుల కృషి కేజ్రీవాల్ కు అండగా నిలవడంతో బిజెపి తనదైన బాణీలో లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డం పెట్టుకొని చేసిన పాలనా అడ్డంకులు దాటుకొని 2019 ఎన్నికల్లో మరోసారి ఆప్ గణ విజయం సాధించింది.ఈ ఎన్నికల కంటే ముందే ఆల్కా లాంబా వంటి మహిళా నేతలు కాంగ్రెస్ లోకి వెళ్ళిపోగా,కపిల్ మిశ్రా లాంటి మాజీ మంత్రి ఏకంగా బిజెపి తీర్థం తీసుకున్నారు. అయినప్పటికీ ఆప్ పంజాబ్ రాష్ట్రంలో ఘన విజయం సాధించడం, గుజరాత్,గోవా లాంటి రాష్ట్రాల్లో కొన్ని ఫలితాలు సాధించడంతో 2023లో ఎన్నికల కమిషన్ ఆప్ కు జాతీయ హోదా కుల్పించింది.ఇక్కడ నుండి ఆప్ అనేక కష్టాలను ఎదుర్కొంది.
ఆప్ కొరకరాని కొయ్య గా దేశ రాజధాని దిల్లీ, మరో కీలక రాష్ట్రం పంజాబ్ లో పాగా వేయడంతో బిజెపి నేతలు మోదీ,అమిత్ షా ద్వయం తమదైన శైలిలో కేజ్రీవాల్ ను బోల్తా కొట్టించారు.అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పుట్టిన ఆప్ నేతలపైన లిక్కర్ కుంభకోణం పేరుతో కీలకమైన మంత్రులు సత్యేంద్రజైన్ ను మనీలాండరింగ్ పేరుతో, ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, చివరకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను కూడా జైలుకు పంపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకొని ఆప్ పార్టీకి అవినీతి మరక పెట్టడం ద్వారా బిజెపి తన ఎత్తుగడ సఫలం చేసుకొంది.దిల్లీ ఎన్నికల్లో ఆప్ ను ఓడించడం తోపాటు,పదికి ఏడుగురు యంపిలను బిజెపి లో చేర్చుకొని ఏకంగా పార్లమెంటు మెజారిటీ సభ్యులను చట్టబద్దం గానే బిజెపి తనలో విలీనం చేసుకుంది.
ఇదంతా ఒక ఎత్తయితే కేజ్రీవాల్ రాజకీయ అనుభవం లేమితో చేసిన తప్పిదాలే ఆప్ కు పూర్తి స్థాయిలో ఎక్కువ నష్టం చేశాయని చెప్పవచ్చును.ఆప్ పతనం లో ఆపార్టీ కీలక నేత కేజ్రీవాల్ అనుసరించిన అప్రజాస్వామిక విధానాలు,ఏకవ్యక్తి కేంద్ర రాజకీయాలు, తన అనుచరులను కూడా నమ్మకపోవడం,సమిష్టి నిర్ణయాలు లేక పోవడం,సంస్థాగత ప్రజాస్వామ్యం సున్నాగా మారడం , రాజకీయ ఎత్తుగడల్లో అపరిపక్వత, రాజకీయ స్పష్టత కొరవడటం ఇవన్నీ కారణాలే.ఇవన్నీ కేజ్రీవాల్ స్వయం కృత అపరాధాలు,అవరోధాలే? మరీ ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ కి దిగువ స్థాయి నుండి ఎగువ స్థాయి వరకు పార్టీ యూనిట్లు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నిక,కార్యకర్తల అభిప్రాయాల క్రోడీకరణ లేనేలేదు.అలాంటిది ఒక జాతీయ పార్టీగా ఆప్ లో ఉన్నట్లు ఎక్కడా కనిపించదు. అన్నీ కేజ్రీవాల్ కేంద్రీకృత నిర్ణయాలు, పేపర్ పై నిర్ణయాలే, నియామకాలే! పార్టీలో కూడా కేజ్రీవాల్ వ్యక్తి పూజ తప్ప మరేమీ లేదు!
పన్నెండేళ్ళుగా ఆమ్ఆద్మీపార్టీ దేశ రాజకీయాల్లో ఉన్నప్పటికీ నిర్దిష్ట రాజకీయ విధానం, లక్ష్యం లేదు.అన్నీ ఇన్ స్టాంట్ నినాదాలే..!కుడిఎడమల అంబేడ్కర్, భగత్ సింగ్ బొమ్మలు వాడుతూనే,తాను భజరంగ్ బలి కార్యకర్త నంటారు.మరోవైపు వందనోట్ల పై సరస్వతీదేవి, లక్ష్మీదేవి బొమ్మలు ముద్రించాలంటారు.ఇంక్విలాబ్ జిందాబాద్,భారత్ మాతా కీ జై నినాదం ఇస్తారు. ఇంతకీ ఈయన సెక్యులర్ వాదా! మతతత్వ వాదా!! ఎవరికీ ఒక పట్టాన ఆయన తత్వం బోధపడనీయరు!
బిజెపి, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా ఆప్ దేశంలో ఎదుగుతుందని చెప్పిన కేజ్రీవాల్ లిక్కర్ కుంభకోణం తర్వాత అర్థాంతరంగా తన వ్యూహం మార్చి ఇండియా కూటమిలో చేరిపోయారు. ఇండియా కూటమిలో ఉంటూనే తన పార్టీ విస్తరణ పక్కన పెట్టి ప్రాంతీయ పార్టీల అండకోసం పరుగులు తీసి ఏకంగా ప్రధాని పీఠం కు దగ్గర కావాలనే ప్రయత్నాలు చేసి బెడిసికొట్టాయి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు కు బేషరతుగా మద్దతు ప్రకటించి తెలుగు రాష్ట్రాల లో ఆప్ ఎదుగుదల కు తనకు తానే ఆటంకంగా నిలిచారు.ఆప్ జాతీయ పార్టీ గుర్తింపు తర్వాత కూడా పార్టీ విస్తరణ కు బదులు ప్రాంతీయ పార్టీల తోక పార్టీగా ‘ఆప్ ‘ను మార్చడం ద్వారా కార్యకర్తల అభీష్టంకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు.ఇక ఇండియా కూటమిలో ఉండి కూడా కనీసం పార్లమెంటు స్థానాలు కూటమి ద్వారా పొందడంలో, ఆప్ పార్టీ దేశవ్యాప్త విస్తీర్ణలో వైఫల్యం చెందారు.
అటు తర్వాత జరిగిన తన సొంత రాష్ట్రం హర్యానా ఎన్నికల్లో, కీలక మైన దిల్లీ ఎన్నికలలో ఇండియా కూటమిలో ప్రధాన పక్షం అయిన కాంగ్రెస్ తో విభేదించి రెండు చోట్ల వ్యూహాత్మక నష్టం పొందారు.రాజకీయ అపరిపక్వత ఇక్కడ స్పష్టంగా బయటపడింది.తమ ఆప్ పార్టీకి స్పష్టమైన రాజకీయ, నిర్మాణ, ఎన్నికల విధానం లేకపోవడం వలన కాంగ్రెస్ పార్టీ ఆప్ పార్టీని బిజెపి బి టీం గా విమర్శించారు.మరికొన్ని సందర్భాల్లో బిజెపి కూడా ఆప్ ను కాంగ్రెస్ బి టీం గా ప్రచారం చేసింది.ఇంతకీ కేజ్రీవాల్ తన సొంత టీం ఏమిటో స్పష్టంగా చెప్పుకోలేని గందరగోళం లో ఉన్నారు.
దిల్లీలో ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఒక్క పంజాబ్ రాష్ట్రంలో తప్ప జాతీయ పార్టీ నేతగా ఎక్కడా పర్యటించలేదు.పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పతాగి అసెంబ్లీ లో అడుగు పెడుతున్నారనే విమర్శలకు కనీసం కేజ్రీవాల్ నైతిక స్పందనా లేదు..ఇదిలా ఉంటే పార్టీలో చిన్న చిన్న సమస్యలు తల ఎత్తినప్పుడు తనతో విభేదించిన వారు బయటకు పోవడం తప్ప కేజ్రీవాల్ ను కాదని, వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేసే ట్రబుల్ షుటర్స్ లేక పోవడం గమనార్హం.యంపి స్వాతిమలైవాల్ విషయంలో గానీ,రాఘవ చద్దా విషయంలో గానీ, ఇంతకుముందు పార్టీ వీడిన డజన్ల కొలది కీలక నేతలు విషయంలో గానీ ఇదే జరిగింది.అందువలననే ఆప్ లో గత పదేళ్లుగా పార్టీ వీడే వారి సంఖ్య పెరిగింది తప్ప చేరినవారి సంఖ్య నామ మాత్రమే!
ఒకవిధంగా ఆప్ ఎదుగూ,బొదుగూ లేదనే చెప్పాలి.ఆమ్ఆద్మీపార్టీ పేరుకే పేదల పార్టీకానీ, ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఆర్థిక పరిపుష్టి నే ప్రధానంగా చూసి టిక్కెట్లు కేటాయిస్తున్నారు. అందుకు ఉదాహరణ రాఘవ చద్దా రాజ్యసభ ఉపాధ్యక్షుడిగా తొలగిస్తూ పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ అధినేతకు ఆ పదవికట్టబెడితే ఆయన కూడా జెండా మార్చి చివరకు చద్దా ముఠాలో చేరడం కేజ్రీవాల్ రాజకీయ వైఫల్యం కు నిదర్శనం. ఫలితంగా ఆప్ లోవ్యాపార వర్గాలు తప్ప సామాన్యుల స్థానం లేని విధంగా తయారైంది.ఇంతకాలం ఆమ్ ఆద్మీ పార్టీ కి ఒక స్పష్టం అయిన ఆర్థిక విధానం కూడా లేదు.
అన్నింటికంటే, అగ్రనేత కేజ్రీవాల్ నే అధికార నివాసం విషయం లో సామాన్యుని సామాజిక సూత్రం విస్మరించి ఆడంబరాలకు పోవడం ఆయనకు ఆయనే సామాన్యుడు అనే పదానికి దూరంగా జరగడంతో పాటు, స్వయంగా నైతిక వ్యక్తిత్వ హననానికి తనకు తానే పాల్పడినట్లు అయ్యింది.రాజకీయ నటనకు ఆయన కూడా అతీతం కాదని నిరూపణ చేసుకున్నారు.’ఆప్ ‘ది వేషం , జెండా సామాన్యుని పరిభాష! ఆచరణ మాత్రం బ్యూరోక్రాట్ బుద్ధి మాంద్యం తో కూడిన కేజ్రీవాల్ వ్యక్తి కేంద్ర రాజకీయ నడత ..అని ఆప్ సారాంశం ఒక్క మాటలో చెప్పవచ్చు.





