చికిత్స పొందుతున్న డిసిపి ,పిఎస్ఓ లను పరామర్శించిన డిజిపి, కమిషనర్
హైదరాబాద్: సోమాజిగూడ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ డిసిపి చైతన్య కుమార్, పిఎస్ఓ విఎస్ఎన్ మూర్తిలను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఆదివారం నాడు పరామర్శించారు. వారి చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. ఛాదర్ ఘాట్ సమీతంలోని విక్టరీ ప్లే గ్రౌండ్ లో సెల్ ఫోన్ స్నాచర్స్ ను పట్టుకునే క్రమంలో గాయపడ్డ డిసిపి, పిఎస్ఓల యోగక్షేమాలను, సంఘటన వివరాలను డిజిపి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ…. డిసిపి చైతన్యకుమార్, పిఎస్ఓ విఎస్ఎన్ మూర్తిల ఆరోగ్యం బాగుందని రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. నిందితులను పట్టుకునేందుకు వెంబడిస్తున్న నేపథ్యంలో నిందితుని వద్ద మారణాయుధం ఉన్నప్పటికీ వీరు శౌర్య సాహసాలు ప్రదర్శించారని అభినందించారు. ఆదర్శమైన పోలీసులుగా స్పందించారని ప్రశంసించారు. నిందితుడు కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ 750 మీటర్ల దూరం వరకు వెంబడించి పట్టుకునే క్రమంలో డిసిపి , పిఎస్ ఓ లు గాయపడి చికిత్స పొందుతున్నారన్నారు. నిందితుడు మహమ్మద్ ఉమర్ అన్సారి 22 కేసులలో నిందితుడిగా ఉన్నాడని, అతనిపై రెండుసార్లు పీడీ యాక్ట్ పెట్టారని, కాలా పత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితుడు పై రౌడీషీట్ ఉందన్నారు. పారిపోయిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నిందితుడుకోలుకుంటున్నాడన్నారు.
*డ్రైవర్ సందీప్ చాకచక్యంగా వ్యవహరించాడు: కమిషనర్*
చాదర్ఘాట్ ప్రాంతంలో శనివారం నాడు జరిగిన సంఘటనలో డ్రైవర్ సందీప్ చాకచక్యంగా వ్యవహరించూడంతో నిందితుడుని పట్టుకోగలిగామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనర్ అన్నారు. నేరాలకు పాల్పడే వారి విషయంలో చట్టం తన పని చేసుకోబోతుందని కమిషనర్ అన్నారు.





